అనంత వినీల విశ్వంలో
విరాజమాన విహంగాలు
కలకూజితాలతో
పసి హృదయాలు కిలకిలలాడ
ఇరుపక్షాలతో వినువీధుల యాత్ర
ఏక లక్ష్యంతో అలుపెరగని ప్రయాణం
సముద్రాలు, కొండలు, దేశాలు దాటి
వస్తాయి దారి తప్పకుండా
ఏ దిక్సూచి లేకుండా
మనల్ని ఆహ్లాద పరచి
మన నేలను సస్య శ్యామలం చేసి
మరలి పోతాయి వీడ్కోలు చెబుతూ
మాతృభూమిని మరచిపోని మహితాత్మలు.
మనంకూడా వలస పక్షుల మవుతున్నాం
మాతృభూమిని వదలి పోతున్నాం
మాతృభాషను మరిచిపోతున్నాం
పరాయి పంచను చేరి స్వజనాన్ని వదిలేస్తున్నాం
స్వంత ఇంటికంటే పరాయి చూరుకు వేలాడడం
పదిలమని భావిస్తున్నాం
అజరామర ఆచారాల్ని ఈసడిస్తున్నాం
ప్రతి పరాయి విషయాన్ని పరమ పదంగా భావిస్తున్నాం
కోట్ల కోసం నోట్ల కోసం పరిగెడుతున్నాం
అపార సాంస్కృతిక వారసత్వ సంపదను
పోగొట్టుకుంటున్నామని గుర్తించలేకున్నాం
వలస పక్షుల మార్గ దర్శనమే
ఈ జాతికి నిష్కృతి మార్గం.