ఆకాశం రంగుపూలు పూచిన దృశ్యం
రబ్బరు చెట్ల కొమ్మల్లో
ఫ్లెమింగో, పెలికాన్ ల కాపురం
విస్తరిస్తున్న అపార్ట్ మెంట్ సంస్కృతిలో
వేలాడుతున్న మనిషి కుటుంబాల ప్రతిబింబం
ప్రళయ కావేరి నీటి పడగల నీడలో
సైబీరియా ఆనందాల అభ్యంగనం
వేల మైళ్ళ దూరభారాల అలసట మరచి
నావికాదళ సైన్యంలా
మేఘమల్హార్ ఆలపిస్తున్న పక్షిపాట
ఈ సముద్రం రామ చిలుకకి
ఎన్నికుంచెలు తలవంచి నమస్కరించాయో
ఎన్ని కాన్వాస్ లు మొహాలు
తెల్లబోసుకున్నాయో
కువకువలు ప్రేమల్ని పొదిగే సింఫనీలో
ఎన్నారై గువ్వల ముద్దు ముచ్చట్ల నిశ్చల చిత్రం
మనసుకు రెక్కల సంగీతం నేర్పే సరిగమ
ఏడాదికోసారయినా..
జన్మభూమి కౌగిలి కోసం తపన
పురిటి గడ్డను ముద్దాడాలన్న భావన
బ్రతుకు మూలాలు మరచిన సమరంలో
అంతర్ముఖాన్ని కోల్పోయిన మట్టిమనిషి
మరయంత్రమై పోయాక
ఇప్పటికైనా..యిక
పక్షిలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే..!
ఉపసంహారం
అంతరాంతరాత్మలన్నీ ఏకీభావమౌతాయి
విశ్వాత్మా విభూతులన్నీ మహితాత్మలౌతాయి
భారతీయ నదీ సంగమ జలనిధిలో
తీర్ధస్నానం చేసి పవిత్రగాత్రాలౌతాయి
వలస పక్షుల పురాకృత సుకృతం యేమిటో
నిత్యం నీరంలోనే నారాయణున్ని తలుస్తాయి..!
మొదటి ప్రచురణ ముందుమాటల నుంచి:
పెరుగు రామకృష్ణ ఈ కావ్యంతో ఫ్లెమింగో రామకృష్ణ అయ్యాడు. ఈ కవికీ ఈ దీర్ఘకవితకీ నేటివిటి వుంది. ఆ లక్షణమే ఈ కావ్యానికి జీవం పోసింది. ఒక మంచి కావ్యానికిమంచి వస్తువు దొరకడం మహాకష్టం. దొరికిందా అది కవి అదృష్టం. పక్షి భారతీయ కావ్య పరంపరలో ఒక బలమైన ప్రాకృతిక, ఆధ్యాత్మిక , సామాజిక ప్రతీక. రామకృష్ణ కొన్ని పంక్తుల్లో ఈ అంశాన్ని బాగానే గుర్తించాడు. ఈ కావ్యం అన్ని భాషల్లోకి అనువాదం కావాలి..అంతర్జాతీయ స్ధాయి రావాలి..!
-ఆచార్య ఎండ్లూరి సుధాకర్
కాలంతో ప్రారంభించిన కవిత్వాన్ని మళ్ళీ పక్షి దగ్గర్నుంచి కాలంతో అనుసంధానం చేస్తున్నాడు కవి. జీవనయాగ జ్ఞాని, సీమాంతర ద్వేషాలెరుగని ఆత్మీయ మిత్రుడైన, ఇంద్రియ చాపల్యం లేని విదేశీయోగి, కాలచక్ర రహస్యం దర్శించిన దివ్య జ్ఞాని అయిన పక్షి కాలానికి సంకేతం అంటాడు. భూత భవిష్యత్ వర్తమానాల సంగమగీతం అంటాడు..!
–డాక్టర్ నలిమెల భాస్కర్
(ముగిసింది)
Also read: ఫ్లెమింగో-14
Also read: ఫ్లెమింగో-13
Also read: ఫ్లెమింగో-12
Also read: ఫ్లెమింగో-11
Also read: ఫ్లెమింగో-10