జి వల్లీశ్వర్
ఒక అర్ధరాత్రి ఆర్డినెన్సు ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేసింది.
రహస్యంగా తయారై, మే 2 అర్ధరాత్రి విడుదలైన
ఒకే ఒక్క ఆర్డినెన్సు తెలుగు ప్రజల జీవితాల్ని
అతలాకుతలం చేసేసింది.
రాజకీయ భీభత్సం సృష్టించింది.
హడావుడిగా అనేక మంది భూ కామందులు దొంగ విడాకులు తీసుకునేలా చేసింది.
ఉత్తుత్తి భూవిరాళాల్ని సృష్టించింది.
ప్రాక్టీసు లేని లాయర్లకు సైతం ప్రాక్టీసు పెంచేసింది.
‘జై ఆంధ్ర’ ఉద్యమానికి దారి తీసింది.
మూడు మాసాల పాటు ‘దొరల ‘ ఆశీస్సులతో రైళ్లు, బస్సులు, తంతి-తపాలా
స్తంభించి పోయేలా చేసింది.
విజయవాడ సెంటర్లో ప్రజా నాయకుడు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని కూల్చేసింది.
ఆంధ్ర పట్టణాల్లో పోలీసు కాల్పుల్లో హాహాకారాలతో యువకులు మరణించేలా చేసింది.
కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్ధాంతిక దూరాన్ని పెంచేసింది.
నాయకులు గుండెపోటుతో మరణించటానికి కారణమైంది.
రాష్ట్ర అభివృద్ధిని పదేళ్లు వెనక్కి తోసేసింది.
పి.వి.నరసింహారావు రాజకీయ జీవితాన్ని దీర్ఘకాలం శీతల గిడ్డంగిలోకి నెట్టేసింది.
ఇంతటి రాజకీయ, సామాజిక సంక్షోభాన్ని సృష్టించిన 1972 మే 2 నాటి ఆర్డినెన్సు
లక్ష్యం – ఒక చట్టాన్ని తెచ్చి, భూకమతాలపై పరిమితి విధించి, ఆ మిగులు భూముల్ని
నిరుపేదలకు పంచిపెట్టడం.
నాలుగు మాసాల తరువాత ఆ చట్టం వచ్చింది.
ఆ వెంటనే ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పు అడ్డం పెట్టుకొని ‘జై ఆంధ్ర ‘ ఉద్యమ జ్వాలలు
ఉవ్వెత్తున ఎగిశాయి. …
“… నేను భూసంస్కరణల కమీషనరుగా 1996లో నియమింపబడ్డాక, ఈ చట్టం క్రింద ఏయే జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలు మిగులు భూమి లభించింది అని ఆరా తీశాను. అలాంటి గణాంకాలు ఏవీ లభ్యం కాలేదు. ఎవరికీ తెలీదు… నేను ఆ గణాంకాలు సేకరించాలని ప్రయత్నం మొదలుపెట్టాను … నాకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ వచ్చింది. …”
(ఐ.ఏ.ఎస్ అధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్ రచన ‘అసలేం జరిగిందంటే …)