* వయసు తగ్గించుకునే ప్రయత్నంలో రోగాల పాలవుతున్న జనం!
* దేవుడిచ్చిన ముఖానికి సరికొత్త సోయగాలా?
ఈమధ్య ఏ సెలూన్ చూసినా, ఏ బ్యూటీ పార్లర్ చూసిన బ్యూటీ టిప్స్ బోర్డులు కనబడుతున్నాయి. ఉన్న ముఖాన్ని అందంగా అలంకరించుకొని బజారులో తనను అందరూ చూడాలనే తపన వల్ల ఈ మధ్య నలభై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్ల వారికి ముఖ ‘అందం’ పిచ్చి ముదిరిపోయి, ఊడిపోయిన పళ్ళను అతికించుకుని, ఇంకా యవ్వన వయ్యారాలు పోతున్న జనం వల్ల మా వ్యాపారం ‘మూడు పువ్వులు అరుకాయలుగా” ఉందని బ్యూటీ పార్లర్లు, సెలూన్ లు పెట్టిన వారు సాయంత్రం నిండిన గల్లా పెట్టెను చూసుకొని అద్దం ముందు వికటట్టాహాసం చేస్తున్నారు.
రొట్టెల వ్యాపారం రెట్టింపు
దానికి తోడు డాక్టర్లు కూడా పొట్ట తగ్గించుకోమని, రాత్రి పూట రైస్ తినొద్దని… చపాతీ అయితే బెటర్ అని చెప్పడం వల్ల ప్రతి సిటీలోని గల్లీల్లో కట్టెల పోయి మీద రకరకాల రొట్టెలు చేసి అమ్మే వారి వ్యాపారం కూడా రెట్టింపు అయింది. అలాగే జిమ్ములు, యోగా క్లాస్ టీచర్లు కూడా ఈ అందం వ్యామోహం గల వారి వల్ల నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఈ వ్యామోహం ఎవరికి ఉంటుంది అనేది ఒక సర్వే నిర్వహిస్తే…ఇంట్లో భార్య కోసమో, భర్త కోసమో కాకుండా సమాజం కోసం ‘వయసు దాచే’ ప్రయత్నం అని తెలిసి విమర్శకులు నోరు వెళ్ళబెట్టి కళ్ళు మిటకరిస్తూ వాళ్లనే చూస్తున్నారు. ఏ చరిత్ర చూసినా ఏముంది గర్వ కారణం… అన్ని చరిత్రల్లోనూ అందం సొంతం చేసుకోవడానికి యుద్ధాలే. భారతం లో కృషుణ్ణి మోహించిన అష్ట భార్యలను పొందడానికి, సాక్షాత్తు కృష్ణ భగవానుడే యుద్ధాలు చేశాడు! సీతా దేవి ముగ్ధ మనోహరమైన రూపాన్ని పొందే దూరలోచన వల్లే కదా రామ-రావణ యుద్ధం జరిగింది. ఆలాగే ఒక మొగ/ ఆడ ఆకర్షణీయమైన ముఖాల కోసమే కలియుగంలో ప్రతి రోజు చంపుకోవడాలు, చచ్చిపోవడాలు!! నేను సినిమా రిపోర్టర్ గా పని చేస్తున్నప్పుడు సినిమాల్లో కాస్ట్యూమ్స్ డిజైనర్ల తో ఇంటర్వ్యూ చేశాను… వారు చెప్పిన కథనం విని పడిపడి నవ్వాను. నన్ను వారు షూటింగ్ స్పాట్ కు తీసుకు వెళ్లారు.
Also Read : ఆత్మ విశ్వాసమే మీ ఆయుధం!
అరవై ఏళ్ళ హీరోకి ఇరవై ఏళ్ళ హీరోయిన్
అరవై ఏళ్ల ‘హీరో’ ని ఇరవై ఏళ్ళ హీరోహిన్ కు దగ్గట్టు మేకప్ చేస్తున్న తీరు… ఆయనకి టీ షర్ట్ వేసి పొట్టను బాగా లోపలికి దట్టించి బెల్ట్ పెట్టి, షూ వేసి, చూడడానికి యాంగ్ ఎనర్జటిక్ మ్యాన్ గా తయారు చేసినప్పుడు మేకప్ మెన్ “కళ” ను చూసి నమస్కారం పెట్టాను. తీరా ఒక నృత్యం సాంగ్ లో ఇరవై ఏళ్ళ హీరోహిన్ ఏమో… చెంగు రంగా అని స్టెప్స్ వేస్తుంటే, ఆ అమ్మాయి తో ఎగరలేక కాళ్ళ నొప్పులతో, కీళ్ల నొప్పులతో అవస్థ పడి చెమటలు పడ్డ హీరో ను చూసి నవ్వకుండా ఉండగలమా? తీరా సినిమాల్లో గ్రాఫిక్స్ పుణ్యమా, స్పీడ్ రీల్ పుణ్యమా లేక యంగ్ డూప్ పుణ్యమా? హీరో ఎగిరినప్పుడల్లా పూల వర్షం, కనక వర్షం వెండి తెరపై కురుస్తున్నపుడు ఆ సినిమా ఫస్ట్ షో విలేకరులతో పాటు చూస్తున్న సినిమా బృందంలో ఆ హీరోహిన్ కూడా ఉండడం, ఆ సీన్స్ వచ్చినప్పుడల్లా ఆమె ముసి ముసి నవ్వులు నవ్వడం చూస్తే “ముసలోడికి దసరా పండుగ’ అన్న సూక్తి గుర్తుకు వచ్చింది.
పదేళ్ళ వ్యత్యాసం ఉన్న భర్తతో
నిజ జీవితంలో కూడా పదేళ్ల వ్యత్యాసం ఉన్న భర్తను తన పక్కన నడిస్తే మొగుణ్ణి పట్టుకుని తండ్రి అంటారని భయానికి మొగుడికి టీ షర్ట్, ముఖంపై ముడతలు కనబడకుండా దట్టంగా పౌడర్ రుద్ది తీసుకుపోయే భార్యమణులు కూడా ఈనాడు ఉన్నారు. పితృస్వామ్య వ్యవస్థలో మొదట్నుంచీ “అందం” అనే పదాన్ని బాల్యంలో జొప్పించారు. కాస్త బుగ్గలు… నిండుధనం ..గుండ్రటి ముఖం ఉన్న పిల్లాడు/ పిల్ల పుడితే వాళ్లను ఎత్తుకొని ముద్దాడడం, నల్లగా, పీలగా పుట్టిన వాళ్ళను ఉయ్యాళ్లకే పరిమితం చేసే చెడు సంప్రదాయం వల్ల అణువణువు ఆకర్షణ కోసం అర్రులు చాచే మనస్తత్వం మనలో జీర్ణించుకుపోయింది. అలాగే స్కూల్లో కూడా ఇదే వైఖరి.
Also Read : మానవ జీవితమే ఒక సముద్ర ఘోష!
స్కూళ్ళలో సైతం ఇదే వైఖరి
అందంగా ఉన్న అబ్బాయి/ అమ్మాయిని ముందు సీట్లో కూర్చోమని, నల్లగా ఉన్న వాళ్ళని వెనక బెంచీలో చోటిచ్చే వారిని చూస్తుంటాం! అంతర్ సౌందర్యం కన్నా బాహ్య సౌందర్యానికి చోటిచ్చే వారి వల్లే స్త్రీ వ్యాపార వస్తువు అయింది. ఏ కంపెనీ వ్యాపార ప్రకటనల చూసినా అందమైన ఆడవారి ముఖాలు! ఆమె పక్కన బాడీ బిల్డింగ్ చేసే యువకుని ఫోటో. దానికి తోడు ప్రపంచ వ్యాప్తంగా జరిగే అందాల పోటీల వల్ల ఈ అందం పిచ్చి ముదిరి పాకాన పడింది. దేవుడిచ్చిన ఈ ముఖానికి అందాలు అద్దడం వల్ల ఎన్నో అపశ్రుతులు వస్తున్నాయి. మిడ్ లైఫ్ లో (మధ్య వయసు) ఆడవారికి అందం పిచ్చి పెరిగింది. తెల్లబడ్డ వెంట్రుకలకు కలర్ వేయడం, ఐ బ్రోస్ ను పొందికగా కట్ చేయించడం, కళ్ల క్రింద ముడతలు రాకుండా క్రీములు రాయడం, తన హాండ్ బ్యాగ్ నిండా సౌందర్య సాధనాలు పెట్టుకుని బజారుకెళ్లడం, దానితో పాటు మొగుణ్ణి కూడా అలాగే తయారు చేయడం, లేని దిష్టి చుక్కను ఆర్టిఫిషియల్ గా బుగ్గన దట్టించడం, ఇలా రోజ్ వాటర్, జెర్మ ప్రోటాక్షన్ వైప్స్, జాస్మిన్, రోజ్ పరిమళం మిక్స్ అయిన పేషియల్ టానిక్ మిస్ట్, ముఖం ప్రెష్ నెస్ కోసం, ఫ్రూటి, ప్లేవర్, పెర్ఫ్యూమ్, డియోడరెంట్, సన్ గ్లాసెస్, వేట్ వైప్స్, లిప్ బామ్, ఇలా అన్ని సౌందర్య చిట్కాలతో పాటు, కలబంద ఆకు పసర్లు ఒక్కటేమిటీ అన్ని దట్టగా ముఖానికి దట్టించడం వల్ల ముఖ వర్చసు కన్నా మొటిమలు వచ్చి ఉన్న అందం హుష్ కాకి అవుతుందని లేడి డాక్టర్ల మొత్తుకుంటున్నారు.
మగవారేమీ తక్కువ తినలేదు
ఇక మగవారేమైనా తక్కువా? తలకు బ్లాక్ కలర్, రెడ్ కలర్, మీసాలకు కూడా అదే కలర్, మ్యాచింగ్ డ్రెస్, బట్టతల ఉంటే విగ్గు… ఒక్కటేమిటీ? అంత షోకిల్లారాయుళ్లుగా తయారై షాపింగ్ కి వెళ్లి యంగ్ అమ్మయిలవైపు ఒక లుక్కేసి ఏదో అడగబోతే…”అంకుల్, అధిక్కడ దొరకదు ఓల్డ్ ఏజ్ హోమ్ పక్కన దొరుకుతుందని” అని చెప్పగానే సగం సచ్చి పెళ్ళాం వంక చూస్తే, తనను ఆ అమ్మాయి ఎక్కడ “ఆంటీ” అంటుందనే భయంతో మొగుడి చెయ్యివిడిచి, ఆయన ఎవరో తెలియనట్టు పక్కకు వెళ్లి పోయే సత్యభామలు ఉన్నారు. రోడ్లపై దొరికే రొట్టెల్లో కల్తీ ఉంటున్నాయని, సౌందర్య సాధనల్లో మిక్స్ ఐటమ్స్ ముఖానికి దట్టించడం వల్లే ముఖ వర్చసు పాడై పోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు… బట్ట తలకు విగ్గు అతికించడం వల్ల న్యూరో టిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్లు ముందు జాగ్రత్తలు చెబుతున్నారు.
Also Read : అమ్మ జోల పాటలో ఉన్న నిద్ర ఇప్పుడేది?
దృష్టి ఆరోగ్యంపై ఉండాలి
ఆరోగ్యం పై దృష్టి సారించకుండా అందాలపై దృష్టి సారించే వారి వల్ల ఎన్నో అపశ్రుతులు దొర్లుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రాశ్చాత్య ధోరణితో, డ్రెస్ లు వేసే మిడ్ లైఫ్ ఆంటీల వల్ల కూడా యువత అంటే వాళ్ళ అమ్మాయిలపై / అబ్బాయిలపై తీవ్ర దుష్పరిణామాలు పడుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read : సర్వసంగ పరిత్యాగం అంటే పెళ్ళాం పిల్లలను వదిలి వెళ్లడం కాదు