మధ్య తరగతి వాడిని
అవసరాలు తీరుతాయి
కొన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి
విలాసాలు మాత్రం ఉండవు.
ఆకలి బాధ తెలియదు
స్వంత ఇల్లు లేక పోయినా
అద్దె ఇల్లయినా ఉంటుంది
ఆశలు పెద్దగా ఉండవు
ఉన్నంతలో సర్దుకోవడం అలవాటే
కాని ఓ మెట్టు పైకి ఎక్కాలనే
తపన ఎప్పుడూ ఉంటుంది.
కలలు చాలానే ఉంటాయి
వాటిని నిజం చేసుకునే సామర్ద్యాన్ని
పెంచుకునే ఆర్ధిక వెసులుబాటు ఉండదు.
ఉన్నవాడి ఆత్మ విశ్వాసం
లేనోడి తెంపరితనం
కొరవడిన పిరికితనం
మధ్యలోవాడి లక్షణం.
వ్యాపారాలంటే భయం
ఆదాయం బాగుండే
స్థాయి తక్కువ పనులు చేయలేని భేషజం
గొర్రె తోక జీతాల మీదే ఆశ
చాలీచాలని ఆదాయంతో సతమతమవుతూ
తనను తాను కాదనుకుంటూ
కుటుంబం కోసం
సమాజంలో మంచి అనిపించుకోవడం కోసం
అహర్నిశలు శ్రమిస్తూ
అరకొర ఆనందాలతో
సగం చచ్చి
అటూఇటూ కాని బతుకు బండి లాగేవాడే
మధ్య తరగతి వాడు
Also read: “మానవ హక్కులు”
Also read: “ప్రేమ టూ వే”
Also read: రాజ్యాంగం
Also read: భూత దయ
Also read: “దీపావళి”