వోలేటి దివాకర్
మిచౌంగ్ తుపాను తూర్పు గోదావరి జిల్లాలో పెనుభీభత్సం సృష్టించింది. తీవ్ర స్థాయిలో ఈదురుగాలులతో కూడిన వర్షం, విరుచుకుపడిన టోర్నడోలు ఒక్క గంటలోనే అల్లకల్లోలం సృష్టించాయి. కీలకమైన ఈ సమయంలోనే రాజమహేంద్రవరం వన్ టౌన్ ఎస్ ఐ ఆదినారాయణ కానిస్టేబుల్స్ రామకృష్ణ, నారాయణతో కలసి తన పోలీసు కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నిర్వర్తించి 15 మంది అనాధ పిల్లలను కాపాడారు.
ఎస్పీ పి జగదీష్ ఆదేశాల మేరకు ఆదినారాయణ నైటు పెట్రోలింగ్ తిరుగుతుండగా, వారికి కంట్రోల్ రూమ్ నుండి స్థానిక ఉమెన్స్ కాలేజీ వద్ద ఉన్న అనాధ బాలల సదనం భవనం లోనికి వర్షపు నీరు చేరి పిల్లలు ఆపదలో ఉన్నట్టు సమాచారం రాగా, హుటాహుటిన ఎస్సై కానిస్టేబుల్స్ కలసి
అక్కడికి చేరుకున్నారు. పిల్లలు ఉన్న సదనం వద్దకు వెళ్లి పరిశీలించగా ఆ భవనము వర్షపు నీటిలో మునిగి ఉండగా, బిల్డింగ్ పైన 15 మంది పిల్లలూ
వారి సంరక్షకులూ ఉన్నట్లుగా గుర్తించారు. ఎస్ ఐ ఆదినారాయణ, వారి సిబ్బంది పిల్లలు, సంరక్షకులను రక్షించి, దగ్గరలో ఉన్న ఆంధ్ర కేసరి ఆశ్రమము లోనికి క్షేమంగా చేర్చినారు.
ఈ సందర్భంగా సదరు సదనం భవనం బాలల సంరక్షకులు మాట్లాడుతూ.. తాము ఆపదలో ఉన్నామని 100 కి డయల్ చేయగా పోలీసులు వెంటనే స్పందించి వచ్చి తమను, 15 మంది అనాధ బాలలను, ఈ తుఫాన్ భారీ నుండి కాపాడి, రక్షించినందుకుగాను పోలీసులు,జిల్లా ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే డయల్ 100 కాల్ కు వెంటనే స్పందించి, భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, నీట మునిగిన భవనం నుండి 15 మంది అనాధ బాలలను వారి సంరక్షకులను రక్షించి వారిని దగ్గరలో ఉన్న వేరే ఆశ్రమమునకు క్షేమంగా చేర్చిన ఒకటో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ , కానిస్టేబుల్స్ రామకృష్ణ, నారాయణను ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు.