- వయోభారంతో కన్నుమూసిన ఖిండో
జాతీయక్రీడ హాకీకి, ఒరిస్సా రాష్ట్ర్రానికి విడదీయరాని అనుబంధమే ఉంది. భారత, అంతర్జాతీయహాకీకి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లు…ప్రధానంగా డిఫెండర్లను అందించిన రికార్డు ఒరిస్సాకు ఉంది.
ఒరిస్సాను తలచుకోగానే దిలీప్ టిర్కే, వీరేంద్ర లాక్రా, ప్రభోద్ టిర్కే, లాజరస్ బార్లా వంటి అంతర్జాతీయ హాకీ స్టార్లే గుర్తుకు వస్తారు. వీరందరికీ మార్గదర్శకుడుగా, స్పూర్తిగా నిలిచిన ఆటగాడే అలనాటి హాకీ దిగ్గజం మైకేల్ ఖిండో.
ఫుల్ బ్యాక్ గా, పవర్ ఫుల్ డిఫెండర్ గా భారత హాకీకి సేవలు అందించిన మైకేల్ ఖిండో తమ 73వ ఏట భువనేశ్వర్ లో కన్నుమూశారు. కౌలాలంపూర్ వేదికగా 1975లో ముగిసిన ప్రపంచకప్ హాకీలో భారత్ ను విజేతగా నిలిపిన జట్టులో మైకేల్ ఖిండో కీలక సభ్యుడిగా ఉన్నారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారతజట్టులో కూడా మైకేల్ ఖిండో సభ్యుడే.
భారత హాకీకి చేసిన సేవలకు గుర్తింపుగా అర్జున అవార్డు అందుకొన్న మైకేల్ ఖిండో వయోభారంతో గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఖిండో మృతి పట్ల ఒడిశాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. హాకీ ఇండియా, ఒడిశా స్పోర్ట్స్, మాజీ క్రీడాకారులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. ఖిండోకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.