అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణపై కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వివాదస్పద వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు మెట్ పల్లికి చేరుకుని ఎమ్మెల్యే ఇంటిముందు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు.
విద్యాసాగరరావు ఏమన్నారంటే..?
జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండోవిడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అయోధ్య ఆలయం పేరుతో బీజేపీ నేతలు విరాళాలు సేకరిస్తున్నారని మన ప్రాంతంలో రామాలయాలు ఉన్నందున అయోధ్య రామాలయం మనకు అవసరం లేదని విద్యాసాగరరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్ల అయోధ్య మందిర నిర్మాణానికి చందాలివ్వొద్దని పిలుపునిచ్చారు.
వివాదస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే:
అయోధ్య రామాలయ విరాళాలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. దీంతో ఎమ్మెల్యే తప్పు తెలుసుకున్నారు. విరాళాలపై తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. రామాలయ విరాళాలపై తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.
రాముడంటే చాలా ఇష్టం:
విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని అన్నారు. కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయంగా అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తాను కూడా హిందువునేనని రాముడంటే ఇష్టమని అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని అన్నారు.