మనిషిలోని మనిషితనాన్ని గుర్తు చేయడానికి కొందరు పుడుతూ ఉంటారు. మంచి ఆలోచనలను పంచి, సమాజాన్ని ప్రభావితం చేసి, ఉన్నతి వైపు నడిపించాలని కంకణం కట్టుకుంటారు. సమాజానికి రక్షకులుగా, మన హృదయ సామ్రాజ్యానికి ప్రభువులుగా నిరంతరం మనల్ని పరిపాలిస్తూ వుంటారు.
శక్తి స్వరూపులు
వారే దైవంగా పిలుచుకునే మాననీయులు. దేవుడు ఉన్నాడా? లేడా? అనే వాదనలను పక్కనపెట్టి చూస్తే… వారు మన ఊహకు అందని శక్తి స్వరూపులు. అటువంటివారిలో కీర్తినీయుడు యేసుక్రీస్తు. శ్రీకృష్ణపరమాత్మ, అల్లా, యేసుక్రీస్తు… వీరందరూ మతాలకు అతీతంగా మనిషిని నడిపిన ప్రభువులు. వారు చెప్పిన బోధనలను ఆలకించి, ఆచరిస్తే సమాజంలో శాంతి, సోదరత్వం కలిసి సాగుతాయి. నేడు క్రిష్టమస్. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది ఎంతో భక్తితో, అనురక్తితో పండుగ జరుపుకునే గొప్పరోజు. ఈ సందర్భంగా ఆ మహనీయుని తలచుకుందాం.
క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు
క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుకుందాం. భగవద్గీత, ఖురాన్, బైబిల్…గ్రంథం ఏదయినా, దానికి ఏ మతమని పేరుపెట్టినా అన్నిటి అభిమతం ఒక్కటే. అదే మానవ శ్రేయస్సు. ప్రపంచ చరిత్రకు సంబంధించిన కాలాన్ని కొలవడానికి క్రీస్తు ముందు, క్రీస్తు తర్వాత అన్నట్లుగా అంత ప్రసిద్ధి వచ్చింది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, కోట్లమందిని ప్రభావితం చేసి, ఎందరో తమ రక్షకుడుగా భావించే యేసుక్రీస్తు మానవాళికి చెప్పిన మంచిమాటలను గుర్తుంచుకోవడం మంచి సంస్కారం.
భిన్న మతాలను గౌరవించడం సంస్కారం
విభిన్న సంస్కృతులను, మతాలను, అభిమతాలను, ఆచారాలను గౌరవించే సంస్కారమే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నతంగా నిలబెట్టింది. పండుగలు వచ్చిన సందర్భంలో ఒకరినొకరు అభినందించుకునే క్రమంలో, క్రీస్తు చెప్పిన కొన్ని సందేశాలను గుర్తుచేసుకుందాం. ఎదుటి మనిషిని మానసికంగా బాధ పెట్టడం కూడా నరహత్యగానే భావించాలి. మొదట నీ కంటిలో ఉన్న నలుసును తీసివేస్తే, ఇంకొకరి కంటిలో ఉన్న నలుసును తీసివేయడం సులభం. వినడం వలన విశ్వాసం, విశ్వాసం వల్ల స్వస్థత కలుగుతుంది. ఇలా ఎన్నో సూక్తులు చెప్పాడు.
Also Read : క్రీస్తు శకం…క్రీస్తు పూర్వం ఈ రెంటి మధ్య శాలివాహన శకం ఏమైంది?
క్షమాగుణం
తోటి మనుషులను, జీవులను ప్రేమించడం, తప్పు, పాపం చేసినవారిపట్ల క్షమాగుణం కలిగిఉండడం, చెడ్డవారిలో పరివర్తన రావడానికి ప్రయత్నం చేయడం ముఖ్య సూత్రాలుగానూ యేసుక్రీస్తు బోధించాడు. పాపులను కూడా ప్రేమించమంటూ మరో ఎత్తుకు ఎదిగిన మాట చెప్పాడు.ఈ మహనీయుని జీవితం, బోధనలను వివరించే గ్రంథం “బైబిల్”. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమందికి ఇది నిత్య పఠనీయ గ్రంథం. పఠిస్తున్నారే కానీ, ఎంతమంది ఆచరిస్తున్నారన్నది ప్రశ్నార్ధకమే. మనిషి ఆచరణలో చూపించకపోవడం అన్ని మతాల ఉత్తమ గ్రంథాలకూ వర్తిస్తుంది. ఈ అద్భుత జ్ఞానభాండాగారాలను సద్వినియోగం చేసుకుంటే, ఆచరణలో నిజం చేసుకుంటే,ప్రపంచ సమాజాలు మరింత ప్రగతిపథంలోకి నడిచివెళ్తాయని పెద్దలు చెబుతూనే వున్నారు.
క్రిస్మస్ సందర్భంగా సంఘీభావం
కొందరు ఆచరిస్తున్నారు,ప్రగతికి మెట్లుగా నిలుస్తున్నారు.క్రైస్తవ సోదరులు మతపరంగా క్రిష్టమస్ ను జరుపుకుంటే, మిగిలిన మతాలకు చెందిన సోదరులు వీరికి సంఘీభావం తెలుపుతూ, సాంస్కృతికంగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు ఏ సంవత్సరం, ఏ తేదీన జన్మించాడని చెప్పడానికి సరియైన ఆధారాలు సంపూర్ణంగా ఇంతవరకూ అందుబాటులోకి రాకపోయినా, డిసెంబర్ 25వ తేదీని క్రీస్తు పుట్టినరోజుగానే భావించి, ఎల్ల దేశాలు పండుగ జరుపుకోవడం కొన్ని వందలఏళ్ళ నుంచి ఆనవాయితీలో ఉంది. ఇందులో గ్రెగోరియన్ క్యాలెండర్ నే ఎక్కువమంది అనుసరిస్తున్నారు. బహుమతులు ఇవ్వడం, కొవ్వొత్తులు వెలిగించడం, సంగీతం, క్రిస్మస్ కరోల్ గీతాలను ఆలపించడం, క్రిస్టింగల్ అనే కొవ్వొత్తుని వెలిగించడం, క్రీస్తు పుట్టుకకు సంబంధించిన ప్రదర్శనలను చూడడం, సామూహిక ప్రార్ధనలు, క్రిస్మస్ చెట్టు, దీపాలు, అలంకరణ, సామూహిక ప్రార్ధనలు, శాంతాక్లాజ్, ఫాదర్ క్రిస్మస్, సెయింట్ నికోలస్, క్రైస్ట్ కైండ్ వంటి రూపాలను పిల్లలకు బహుమతులుగా ఇవ్వడం మొదలైన ఎన్నో దృశ్యాలు క్రిష్టమస్ వేళల్లో కనిపిస్తూ సందడి చేస్తుంటాయి.
మెర్రీ క్రిస్టమస్
కోవిడ్ -19 ప్రభావం, కొత్త రకాల కరోనా వైరస్ ల వార్తల మధ్య ఈసారి పండుగ ఎన్నో జాగ్రత్తల మధ్య నిర్వహించుకుంటున్నారు. ఎన్నో విదేశీ విమానాలు కూడా రద్దయ్యాయి.సొంత ఊర్లకు రాలేక కొందరు ఎక్కడికక్కడ ఇరుక్కుపొయ్యారు. అయినప్పటికీ, పండుగ కన్నుల పండువగా సాగుతోంది. వచ్చే క్రిష్టమస్ సమయానికి కరోనా నుండి ప్రపంచం బయటపడి, ఇంకా స్వేచ్ఛగా, వైభవంగా పండుగలు జరుపుకుంటుందని విశ్వసిద్దాం. క్రిస్టియన్ సోదరులకు మెరీ క్రిష్టమస్.