అక్షరాలు పదాలను నమ్ముకుంటాయి
వాటిని మలినపర్చడం తగదు.
భావనలు హృదయాలను అల్లుకుంటాయి
నిరాధారం చెయ్యడం సబబు కాదు.
ఈ నవప్రభాతం నిండా
గులాబికాంతులు అలముకున్నాయి.
వాటిని కలుషితం గావించడం
ప్రకృతిని నిరాకరించడమే.
కాలం వైశాల్యాన్ని
దర్శించవచ్చునేమోగాని
లోతును ఇంకా
స్పృశించవలిసే వుంది.
కొన్ని మాటలు
మన ముందు నిలబడి
కన్నీళ్లు పెడతాయి.
నిస్సహాయతను నిర్లక్ష్యం చేసి
నిటారుగా నిలబడటం కష్టం!
కొండొకచో కవిత్వమూ నిన్ను ప్రేమించదు.
ఒకానొక అపస్మారకత
శూన్యానికి కారకమౌతుంది.
వర్షంలో నక్షత్రాలు వొణికినట్టు
తలపోతలు మసకబారుతాయి.
నానార్థాలు వ్యర్థమౌతాయి
పర్యాయ పదాలకు ఛాయలేర్పడతాయి.
తెలివితేటలు కాదు
తేటనీరే మనకు ఆదర్శం.
ఏదో ఒక అనన్య భావ విధానం
నదిని మలుపు తిప్పుతుంది.
ఆ ఒక్కక్షణంలోనే
కవిత్వం తటాలున మెరుస్తుంది.