- మార్చి 16, 2012న సచిన్ శత శతకం
- చెక్కుచెదరని మాస్టర్ ప్రపంచ రికార్డు
సచిన్ టెండుల్కర్.. క్రికెట్ అభిమానులకు పరిచయం ఏమాత్రం అవసరం లేని పేరు. 22 సంవత్సరాలపాటు భారత క్రికెట్ కు అసమాన సేవలు అందించడంతో పాటు తన ఆటతీరు, వ్యక్తిత్వంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరిస్తూ వచ్చిన క్రికెట్ దేవుడు రిటైరైనా ఆ లిటిల్ మాస్టర్ సాధించిన రికార్డులు, విజయాలు..శతకోటి భారత క్రికెట్ అభిమానుల స్మృతిపథంలో తాజాగా, నిన్నే జరిగినట్లుగా అనిపిస్తాయి.
క్రికెట్ చరిత్రలోనే డజన్లకొద్దీ ప్రపంచ రికార్డులు నెలకొల్పిన సచిన్ కెరియర్ లో 2012 మార్చి 16 వ తేదీకి ప్రత్యేకస్థానం ఉండితీరుతుంది. ఎందుకంటే తొమ్మిదిసంవత్సరాల క్రితం ఖచ్చితంగా ఇదేరోజున తన వందో అంతర్జాతీయ శతకాన్నిసాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. వంద అంతర్జాతీయ వందలు సాధించిన తొలి్, ఏకైక ఆటగాడిగా నిలిచిపోయాడు. భారీఅంచనాలు,విపరీతమైన ఒత్తిడి, ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలను అధిగమించి తన ఆటతీరును నిత్యనూతనంగా ఉంచుకొంటూ, తన ప్రత్యేకతను కాపాడుకోడమే కాదు క్రికెట్ దేవుడు అన్న పదానికి న్యాయం చేసిన మొనగాడు సచిన్. మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లోని మీర్పూర్ షేర్-ఇ- బంగా నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ లో సచిన్ తన 100వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేయగలిగాడు. ఆ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమిపాలైనా మాస్టర్ సాధించిన సెంచరీనే హైలైట్ గా నిలిచిపోయింది. సచిన్ మొత్తం 138 బాల్స్ ఎదుర్కొని 114 పరుగులు సాధించడం ద్వారా వంద శతకాల క్రికెట్ ఎవరెస్ట్ ను అధిరోహించగలిగాడు.
ఇదీ చదవండి: టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు
1989లో కేవలం 16 సంవత్సరాల చిరుప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి ఆ తర్వాత రెండుదశాబ్దాలపాటు ఓ వెలుగువెలిగిన మేరునగధీరుడు సచిన్. కంగారూ క్రికెట్ దిగ్గజం సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ ను మరపిస్తూ అభినవ బ్రాడ్మన్ గా నీరాజనాలు అందుకొన్న సచిన్ ఆటతీరులో సొగసే వేరు. క్రికెట్ పుస్తకంలోని షాట్లన్నీ అలవోకంగా ఆడగలగడంలో సచిన్ తర్వాతే ఎవరైనా. అంతేకాదు సచిన్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టాడంటే చాలు అది చూడటానికి రెండుకళ్లూ చాలవన్నా అతిశయోక్తి లేదు. సచిన్ అంత సొగసుగా షాట్లు కొట్టే క్రికెటర్లు నేటితరంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు.
ఇదీ చదవండి: విజయ్ హజారే ట్రోఫీ విజేత ముంబై
2003 ప్రపంచకప్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తాను శతకం సాధించిన సమయంలో ఎవ్వరూ పట్టించుకోలేదని అయితే అది తన కెరియర్ లో 99వ శతకమని, వందో శతకానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారని, తాను తీవ్రఒత్తిడి ఎదుర్కొని వందో వందను పూర్తి చేయగలిగానని మాస్టర్ ఇప్పటికీ గుర్తు చేసుకొంటూ ఉంటాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మూడంకెల స్కోర్లు సాధించడం అంత తేలికకాదని అయితే తాను వందసార్లు సెంచరీలు సాధించడం వెనుక పెద్దలు, దేశంలోని కోట్లాదిమంది అభిమానుల దీవెనలు ఉన్నాయని సచిన్ నిగర్వంగా చెబుతూ ఉంటాడు. ఏది ఏమైనా భారత చరిత్రలో ఓ లతా మంగేష్కర్, ఓ బడే గులాం అలీఖాన్, ఓ ఘంటసాల, ఓ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓ సచిన్ టెండుల్కర్ మాత్రమే. క్రికెటర్లు తామరతంపరగా ఎందరు వచ్చినా, పోయినా క్రికెట్ ఉన్నంతకాలం మాస్టర్ సచిన్ ఘనత, ప్రత్యేకత చెక్కుచెదరకుండా ఉండిపోతుంది. సచిన్ కళాత్మక బ్యాటింగ్ చూసే అవకాశం లేని నేటితరం క్రికెట్ అభిమానులను చూసి పాపం దురదృష్టవంతులు అనుకోక తప్పదు కాక తప్పదు.
ఇదీ చదవండి: నవశతాబ్దిలో సరికొత్త రికార్డు