ఆకాశవాణి లో ‘నాగసూరీయం’-4
చదవడం, తెలుసుకోవడం, వీలైతే పర్యటించడం లేదా కలవడం, అధ్యయనం చేయడం, అవసరమైతే మరింత శ్రమించడం.. అనేవి నన్ను నేను మెరుగుపరచుకోవడానికి ఎంతో తోడ్పడ్డాయి, ఇవే లక్షణాలు నేను ఆకాశవాణి ఉద్యోగం తృప్తికరంగా, నాణ్యంగా చేయడానికీ ఎంతో దోహదపడ్డాయి.
ఆకాశవాణిలో చేరక ముందే కవుల, రచయితల, కళాకారుల పేర్లు చాలా పరిచితం. దీనికి నా చదివే అలవాటే కారణం – తొలుత పత్రికలూ, పిమ్మట పుస్తకాలు! బదిలి తాకీదు రాగానే ఆ ప్రాంతపు విశేషాలూ, వ్యక్తులూ మదిలో మెదలడం, అక్కడ చేయదగ్గ ప్రయోగాలు స్ఫురించడం ప్రారంభమౌతుంది. గుర్తింపు, గౌరవం, ప్రాచుర్యం ఉండే ఉద్యోగాలలో చాలా సమస్యలకు బదిలీ మంచి విరుగుడు. అంతకు మించి ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఫలితాలు సాధ్యమవుతాయి!
మేళత్తూరు భాగవతమేళ నాట్యనాటకాలు గురించి గుర్తుకు వచ్చినపుడు ఉపోద్ఘాతంగా చెప్పిన అంశాలు మదిలో తారట్లాడాయి. మద్రాసుకు బదిలీ అవుతుందని ఎప్పుడూ భావించలేదు. మరోసారి విజయవాడ లేదా హైదరాబాదు బదులు మద్రాసు గురించి ఎందుకు ఆలోచించకూడదని నా గురుతుల్యులు ఒకరు సూచించారు.
నిజానికి మద్రాసు మా హిందూపురానికి ఎంతో దూరం కాదు. నా ఆకాశవాణి ‘ట్రెక్స్’ ఉద్యోగానికి ఇంటర్య్వూ 1987లో అక్కడే జరిగింది. పిమ్మట, 1991లో మా పెళ్ళి బట్టలు అక్కడే కొన్నాం. అయినా, మద్రాసులో ఉద్యోగం చేసే రోజులు వస్తాయని ఎప్పుడూ కలగనలేదు! అవునూ, మద్రాసు లో ఉద్యోగం కల వంటిదే! తెలుగు ప్రసారాలకు రాజధాని వంటిదని విజయవాడకు పేరు. కానీ మద్రాసు తెలుగు ఆకాశవాణికి ఆదిమస్థానం వంటిది, అంత కంటే గొప్ప. దాని ప్రభ అంతటిది! నిజానికి రాజమహేంద్రిలో రావాల్సిన ఆకాశవాణి, తెలుగు రాజకీయ నాయకుల సామర్థ్యం వల్ల అలా దొర్లుతూపోయి మద్రాసులో (1938లో) మొదలైందని అంటారు. అది వేరే సంగతి.
బ్రిటిష్ హయాంలో దక్షిణాదిలో రెండే కేంద్రాలు
దక్షిణాదిలో బ్రిటీషు కాలంలో మొదలైన రేడియో కేంద్రాలు రెండే.. మద్రాసు (1938లో), తిరుచ్చిరాపల్లి (1939లో)! మన దేశంలో 1947 ఆగస్టు 15 నాటికి కేవలం ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, తిరుచ్చిరాపల్లి, లక్నో – ఈ ఆరు పట్టణాలు మాత్రమే ఆకాశవాణి కేంద్రాలను కలిగి ఉన్నాయి! భారతదేశ చిత్రపటాన్ని గుర్తు చేసుకొని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
2013 మే 30న మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో చేరినపుడు ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు వంటివారు గుర్తుకు వచ్చి, ఎంతో ఉత్సాహం, మరెంతో ఉద్వేగం కల్గింది. సరిగ్గా తేది గుర్తులేదు కానీ, అదే సంవత్సరం సెప్టెంబరులో మండలి బుద్ధప్రసాద్ (అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి) కొందరు తెలుగు మిత్రులతో మూడు , నాలుగు రోజులు తంజావూరు, తిరువయ్యారు, మేళత్తూరు, తిరుచ్చిరాపల్లి – ఇలా తెలుగుదనంతో ముడిపడిన విషయాలనూ, వ్యక్తులనూ, నేరుగా చూడటం, కలవడం సాధ్యమయ్యేలా పర్యటన ప్రణాళిక చేశారు. నేను మద్రాసులో ఆ బృందంతో కలిశాను. ఆ సాంస్కృతిక పర్యటన కబుర్లు ‘తెలుగు వెలుగు’ పత్రికలో రాసినట్టు గుర్తు. ఇందులో భాగంగా మేళత్తూరు వెళ్ళాం. ఇది త్యాగరాజస్వామి సమాధి ఉండే తిరువయ్యారుకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మేళత్తూరు వెంకటరామశాస్త్రి
త్యాగరాజస్వామికి సమకాలీనుడైన మేళత్తూరు వెంకట్రామశాస్త్రి సుమారు 11 తెలుగు నాట్యనాటకాలు రాశారు. వీరి తండ్రి గోపాలకృష్ణయ్య, ఇంకా కూచిపూడి నాట్య సిద్ధేంద్రయోగి — ఈ ఇరువురూ నారాయణ తీర్థుల శిష్యులని అంటారు. 1550లో విజయనగర పాలకులు తంజావూరు పాలకుడిగా చెవ్వప్పనాయకుని కుమారుడు అచ్యుతరాయలను నియమించారు. అచ్యుత రాయలు సుమారు 500 మంది బ్రాహ్మణులకు ఆశ్రయం కల్పించారు. ఆ ప్రాంతమే మేళ (ఉన్నత)త్తూరుగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఆ రకంగా ఆశ్రయం పొందిన వారు కళలకు దోహద పడ్డారు. నారాయణ తీర్థులు కూడా మేళత్తూరులో స్థిరపడ్డారని అంటారు. ఈ నారాయణ తీర్థుల ప్రశిష్యులైన మేళత్తూరు వెంకట్రామశాస్త్రి రచించిన తెలుగు రచనలే మేళత్తూరు నాట్యనాటకాలుగా, భాగవత మేళగా ప్రసిద్ధి పొందాయి. క్రమంగా తెలుగు రచనలు తమిళ లిపిలో రాసుకుని, తమిళయాసతో ప్రదర్శించడం స్థిరపడింది. శ్రీరామనవమి, ప్రహ్లాద జయంతికి రాత్రంతా ఈ నాట్యనాటకాలు వేయడం మేళత్తూరులో మొదలై క్రమంగా ప్రహ్లాద జయంతికి రెండు రోజులు వేయడంగా మారింది. తర్వాత ఒకరోజుకు మారింది. ఒక మేళత్తూరులోనే కాదు, శాలియమంగళం, తేపేరమానల్లూరు, శూలమంగళం, నల్లూరు, ఊతుకాడు, పులిమేడు, గోవిందపురం, తిరువిళనెల్లూరు, మరుదా నెల్లూరు వంటి చోట్ల కూడా తెలుగు భాగవతాల ప్రదర్శనలు ఉండేవని స.వెం. రమేష్ ‘ఎల్లలు లేని తెలుగు’ గ్రంథంలో వివరిస్తారు.
మహాలింగంతో మైత్రి
మేళత్తూరులో మహాలింగం గారిని కలిశాం, వారింట భోజనం కూడా చేశాం. 2014 ప్రహ్లాద జయంతి రోజున ప్రదర్శనకు, మద్రాసుకు వచ్చి నాకు ఆహ్వానం కూడా అందించారు. ఇదిలా ఉండగా మద్రాసులో నవంబరు – డిసెంబరులో సంగీతోత్సవాలు, డిసెంబరు-జనవరిలో నృత్యోత్సవాలు విరివిగా జరుగుతాయి. 2014 జనవరి 6న మేళత్తూరు భాగవతమేళ ప్రదర్శన ఉన్నట్టు ఇమెయిల్ ను కలైమామణి కుమార్ పంపారు. ఆ ప్రదర్శనను నేను, హంస మైలాపూర్ లో చూశాం. దీని గురించి ‘ఆంధ్రప్రభ’ ఆదివారం కాలమ్ గా ఫిబ్రవరి 9 సంచికలో ఒక చిన్న వ్యాసం రాశాను. ఈ వ్యాసం ఇటీవలి నా పుస్తకం ‘వేణునాదం’లో కూడా ఉంది. నిజానికి 2014 మేలో మేళత్తూరు వెళ్ళాలని భావించాం. అయితే, వేరే ట్రిప్ క్లాష్ అవడంతో వెళ్ళలేకపోయాం. కానీ దానికి మించిన పని ఒకటి 2015 జనవరి సంక్రాంతికి మద్రాసులో తెలుగు ఆకాశవాణి ద్వారా జరిగింది.
ఏ దక్షిణాది కేంద్రానికి లేని రీతిలో మద్రాసు ఆకాశవాణి ప్రాంగణంలోనే మంచి ఆడిటోరియం ఉంది. ఇటు మైలాపూర్, అడయారు; అటు ట్రిప్లికేన్, మద్రాసు విశ్వవిద్యాలయం; ఎదురుగా లైట్ హౌస్, మెరినా బీచ్…ఇదీ మద్రాసు ఆకాశవాణి పరిసర ప్రాంతం! అప్పుడు సంగీత ప్రవేశం. కార్యక్రమ అభినివేశం ఉన్న సహృదయులు శ్రీ సుబ్రహ్మణ్యం మద్రాసు ఆకాశవాణి డైరెక్టరుగా ఉన్నారు. వారికి నేనంటే ఎంతో అభిమానం, గౌరవం. 2015 సంక్రాతికి ఆకాశవాణి తెలుగు విభాగం తరఫున సొంత ఆడిటోరియంలో మేళత్తూరు భాగవత మేళ ప్రదర్శన ప్రతిపాదనను వారు ఆమోదించారు. మిత్రులు మహాలింగం బృందంతో మేళత్తూరు నుంచి తరలి వచ్చారు.
భాగవత మేళా
2015 జనవరి 12 సా. 6 గం.లకు తొలిసారి ఆకాశవాణి మేళత్తూరు భాగవత మేళాను నిర్వహించి, వేదిక మీద ప్రదర్శింపచేసింది. (అంతకు ముందు విజయవాడ నుంచి ఒక బృందం మేళత్తూరు వెళ్ళి ఆడియోను ఆర్కైవ్స్ కోసం రికార్డు చేసిందని అన్నారు. పూర్తి వివరాలు నాకు అందుబాటులో లేవు.) ఈ ప్రదర్శనకు మద్రాసు తెలుగు మిత్రులు మహదానంద పడ్డారు. ప్రఖ్యాత రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహ రావు కుమారుడు నాగేశ్వరరావు అతిథిగా వచ్చారు. మహాలింగం గారితో పాటు అరవింద్ సుబ్రమణియన్, ఎస్ నాగరాజన్, ఆర్. సుబ్రమణియన్, ఆర్. రామస్వామి, అరుణాచలం వంటి వారు అటు నటనా, ఇటు నాట్యంలో రాణించారు. తెర వెనుక శ్రీనివాసన్, మురళీరంగరాజన్, హరిహరన్ మొదలైన వారు సంగీత పరంగా తోడ్పాటునిచ్చారు. వీరి ప్రదర్శనలో నాట్యం విశేషం. గొప్పగా రాణించింది.
అలా మేము రికార్డు చేసిన ప్రదర్శన ఆడియో రెండు భాగాలుగా 2015 జనవరి 14, 15 తేదీల ఉదయం 8.15 గం. మద్రాసు బి. కేంద్రంలో తెలుగు కార్యక్రమాలలో భాగంగా ప్రసారమయ్యింది. నల్లికుప్పుస్వామి తోడ్పాటుతో అవే రోజుల్లో మద్రాసు ఎఫ్ ఎం గోల్డ్ ఛానల్ లో ఉదయం 11 గం.లకు పునఃప్రసారమయ్యింది. ఇది ఒక అపురూప సందర్భం.
ప్రహ్లాదచరిత్రం
మహాలింగం మిత్రత్వం బహు దొడ్డది, చెడ్డది, దాన్ని తెంచుకోవడం బహుకష్టం. 2015 మేలో ప్రహ్లాదజయంతి ప్రదర్శన సమయానికి అతిథిగా వెళ్ళాను. అరవింద స్వామి తండ్రి ఆ ఊరికి చెందినవారే. వారూ, నల్లి కుప్పుస్వామి, నేను ఆనాటి వేడుకను ఎంతో మందితోపాటు తిలకించాం. ఆ ప్రదర్శన నడుస్తుండగా నల్లి కుప్పుస్వామి నా చెవిలో, ఈ ప్రదర్శన ఆడియో తెలుగు ఆకాశవాణి కేంద్రాలన్నింటిలో ఒకేసారి ప్రసారమైతే బావుంటుందని అన్నారు.
‘ప్రహ్లాదచరిత్రం’ తెలుగు, దేవనాగరి లిపిలో తొలిసారి పుస్తకంగా ప్రచురించారు మహాలింగం. దీని ఆవిష్కరణకు 2016 మేలో ఆహ్వనించారు. అదే సమయంలో డా. సాయికృష్ణ యాచేంద్ర కూడా అక్కడ కలిసినట్టు గుర్తు. అలా వెళ్ళినపుడు ‘శాలియ మంగళం’ కూడా వెళ్ళి ప్రదర్శనను కూడా కొంత చూశాం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మేళత్తూరు భాగవత మేళ ప్రదర్శనలో మొత్తం సంగీతం, నృత్యం ప్రధానంగా ఉంటుంది. వచనం దాదాపు ఉండదు. కూచిపూడి పోలినది కనుక నాట్యనాటకం అంటాం. అయితే శాలియమంగళం ప్రదర్శనలో సంగీతం, నృత్యం బాగా తక్కువ, వచనం ఎక్కువ! ఈ శాలియ మంగళం రీతినే ఎస్వీరంగారావు, రోజారమణి నటించిన ఏవియం వారి ‘భక్తప్రహ్లాద’ సినిమాలో స్వీకరించారని నాకు ఆ ప్రదర్శన చూస్తుండగా స్ఫురించింది.
ఊర్వశి శారద అభినందన
ఊర్వశి శారదగారితో నేనూ, హంస కూర్చున్న ఫోటో ఫేస్ బుక్ లో విపరీతంగా ఆదరణకు నోచుకుంది. అది 2017 ఏప్రిల్ 8న మహాలింగం ప్రచురించిన ‘మార్కండేయ చరిత్రం’ ఆవిష్కరణ సందర్భం. ఆ సభలో ఒకవైపు శారద, మరోవైపు నల్లి కుప్పుస్వామి నన్ను అభినందించడం ఒక మధురస్మృతి. కె.వి.రమణాచారి. ఎన్. ముక్తేశ్వరరావు వంటి సహృదయుల తోడ్పాటుతో మహాలింగం బృందం తెలుగు ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చింది.
నేను తిరుపతి ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు ‘మహతి’ ఆడిటోరియంలో 2016 చివరి మాసాల్లో ఒక ప్రదర్శన జరిగింది. దీని ఆడియోను మహాలింగం అనుమతితో తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి మురళీధర్ చక్కగా రికార్డు చేశారు. దీనికి సంబంధించి నల్లి కుప్పుస్వామితో ఒక ప్రతిపాదన చేశాను. ఆయన అంగీకరించారు. ఫలితంగా 2017 మే 10వ తేదీన ఉదయం 11 గం.లకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 ఆకాశవాణి కేంద్రాలు ఓ గంటపాటు మేళత్తూరు భాగవత మేళ ‘ప్రహ్లాద చరిత్ర’ను ప్రసారం చేశాయి. ఈ ప్రసారాన్ని కుప్పుస్వామి ప్రాయోజితం చేయడం వల్ల ఆకాశవాణికి ఒక లక్షరూపాయలకు పైగా లాభించింది!
ఇప్పుడు మళ్ళీ ఈ వ్యాసంలోని తొలి రెండు వాక్యాలు ఇంకోసారి చదువుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే స్వచ్ఛమైన ఇచ్ఛ, నిజాయితీగల ప్రయత్నం, సాహసంతో కూడిన ప్రయోగం కలిసి శ్రమిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి!
– డా. నాగసూరి వేణుగోపాల్
మొబైల్ : 9440732392