Wednesday, January 22, 2025

ఆదిత్యనాథ్ యోగిమహరాజ్ దిగ్విజయం

  • మోదీకి ధన్యవాదాలు చెప్పిన యోగి
  • ఐదేళ్ళలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటే మంచిది
  • అకస్మాత్తుగా పెరిగిన యోగీ గ్రాఫ్
  • మోదీ తర్వాత దేశంలో యోగీనే

బిజెపి తరపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి కూడా సింహాసనాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు యోగి ఆదిత్య నాథ్. భవిష్యత్తులో భారతదేశ ప్రధానమంత్రిగా మోదీ తర్వాత ఆ యోగం యోగికి పడుతుందనే ప్రచారంలో వేగం మళ్ళీ ఊపందుకొంటోంది.  రాజెవరో రెడ్డెవరో కాలం నిర్ణయిస్తుంది. ఈలోగా యోగి గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. ఒకదశలో ముఖ్యమంత్రిగానే తప్పిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అటువంటి అడ్డంకులన్నింటినీ దాటుకొని యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాధిపతి అయ్యారు. లఖ్ నవూ లోని అటల్ బిహారీ వాజ్ పేయీ ఎకనా స్టేడియంలో ప్రమాణస్వీకార మహోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పార్టీకి చెందిన మిగిలిన పెద్దలందరూ ఈ ఉత్సవంలో పాల్గొని యోగిని ప్రశంసల్లో ముంచెత్తారు. దాదాపు 85వేలమంది పాల్గొన్న ఈ వేడుక రంగరంగ వైభవంగా జరిగింది.

Also read: యుద్ధపర్వంలో ఎత్తులు పైఎత్తులు

ఓడినా మౌర్యకు ఉన్నత పదవి

కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పఠక్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మౌర్య ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఉపముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం గమనార్హం. దీని పర్యవసానం భవిష్యత్తు పరిణామాల్లో తెలుస్తుందనే మాటలు వినపడుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రాజకీయంగా అత్యంత కీలకమైంది కూడా. దేశాన్ని ఏలాలంటే ఉత్తరప్రదేశ్ లో పట్టుసాధించాల్సిందే. ఆ మర్మమెరిగిన బిజెపి తన సర్వ శక్తియుక్తులను  ఒడ్డి, ప్రతిపక్షాలను ఓడించి, తన పట్టును మరోమారు నిలుపుకుంది. ఈ విజయం ఉభయకుశలోపరిగా అటు నరేంద్రమోదీకి -ఇటు యోగి ఆదిత్యనాథ్ కు నిలుస్తుంది. ఈ గెలుపుతో యోగి ఏడు రికార్డులను బద్దలు కొట్టారు.యూపీ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అధికారాన్ని నిలబెట్టుకొని వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం ప్రథానమైన విశేషం. ఉత్తరప్రదేశ్ లో బిజెపి రెండోసారి కూడా గెలుపుగుర్రం ఎక్కిందంటే, అందులో ప్రధాన పాత్రధారుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ద్వితీయ స్థానం ఆదిత్యనాథ్ కు చెందుతుంది. ఈ విజయం అట్లుండగా, నిన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బలమైన పోటీనే ఇచ్చారని చెప్పాలి. సామాజిక సమీకరణలు బలంగా వేశారు. అందివచ్చిన ప్రతిపార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారు. అధికారంలోకి రాలేకపోయినా బిజెపి సీట్లను గతం కంటే తగ్గించడంలో, తమ పార్టీ స్థానాలను పెంచుకోవడంలో మంచి విజయాన్నే సాధించారు. అఖిలేష్ ఈ గెలుపు తెచ్చిన బలంతో తాజాగా తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేతగా తన దమ్ము చూపించడానికి సిద్ధమవుతున్నారు.

Also read: మరోసారి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్

బలం పుంజుకున్న ప్రతిపక్షం

నిన్నటి వరకూ ప్రతిపక్షం బలహీనంగా ఉండేది. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ రూపంలో బలం ఒకింత పెరిగింది. దీనిని ఎదుర్కోవాల్సిన చాకచక్యాన్ని యోగి ప్రదర్శించాల్సి ఉంది. గతంలో వచ్చిన చెడ్డపేరును పోగొట్టుకోవాల్సివుంది. ’80:20 ఫార్ములా’ ప్రస్తుతానికి హిట్ అయినప్పటికీ, భవిష్యత్తులో దుష్ప్రభావాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం బిజెపికి ఉంది. ఇది కేవలం ఉత్తరప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన అంశం కాదు. అనేక మతాల సమ్మేళనమైన మొత్తం భారతదేశానికి వర్తిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలను రాబట్టుకొని, మూడోసారి దిల్లీ పీఠాన్ని ఎక్కాలంటే  సున్నితమైన మతపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది.  ఉత్తరప్రదేశ్ లో మోదీ-యోగి సంయోగం హిట్ అయ్యింది. పరిపాలనా పరమైన వైఫల్యాలు, విమర్శలన్నింటినీ ఈ ద్వయం చాకచక్యంగా ఎదుర్కొని సెభాష్ అనిపించుకుంది. సామాజిక సమీకరణల దగ్గర నుంచి యువతను,మహిళలను తమ వైపు తిప్పుకోవడంలో బాగా సఫలీకృతులయ్యారు. జితిన్ ప్రసాద, ఆర్ పి ఎన్ సింగ్ లాంటివారిని తమ వైపు తిప్పుకోవడంలోనూ విజయం సాధించారు. రైతులపై హింసాకాండ జరిగిన లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో మొత్తం స్థానాలను గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ముస్లింలు, జాట్ ల ఓట్లను కూడా గణనీయంగా సంపాయించుకోగలగడం  మరో  ఆశ్చర్యకరమైన విషయం. గతంలో సుమారు 30మంది ఎమ్మెల్యేలు యోగి నాయకత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. వారందరూ శాంతపడి, యోగి గెలుపుకు సహకరించారంటే  అది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also read: ‘కశ్మీర్ ఫైల్స్’ కలవరం, కలకలం

ఆర్ఎస్ఎస్ పాత్ర మరువరానిది

ఈ గెలుపులో సంఘ్ పాత్ర విస్మరించరానిది. నరేంద్రమోదీ వ్యక్తిగత చరిష్మా ఎంత పెరిగినప్పటికీ, సంఘ్ ను కలుపుకొని వెళ్లడం చారిత్రక అవసరం. అటు కేంద్రంలోనూ – ఇటు రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వం ఉండడం యోగికి కలిసి వచ్చింది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. అక్కడ చేపట్టిన కాశీవిశ్వనాథుని కారిడార్ మొదలైన అభివృద్ధి పనులు, అయోధ్య రామమందిరం నిర్మాణం, ఆ రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రత్యేక ప్రాజెక్టులు అక్కడ బిజెపి గెలుపుకు బలమైన ఊతమిచ్చాయి. ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ గెలిచినంత మాత్రాన అంతా అద్భుతమని చెప్పలేం. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. రైతులు, కూలీల స్థితిగతులు దారుణంగా ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ పాలనలో ఉన్నప్పుడు కొన్ని సామాజిక వర్గాలు పెత్తనం చేశాయి. అవినీతి వరదలై పారిందని, రౌడీలు రాజ్యమేలారని ఆ ప్రభుత్వానికి చెడ్డపేరు పెద్దఎత్తున వచ్చింది. నిన్నటి ఎన్నికల్లోనూ ఆ పార్టీని అది వెంటాడింది. యోగి ఆదిత్యనాథ్ పాలనాకాలంలోనూ కొన్ని సామాజిక వర్గాలే పెత్తనం చేశాయనే పేరు వచ్చింది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన బ్రాహ్మణులు మొదలైన సామాజిక వర్గాలు అసంతృప్తిని వెళ్ళగక్కాయి. సామాజిక శాంతిని, సమతను సాధించకపోతే ఎంతటి నాయకులకైనా ఎప్పటికైనా ప్రమాదమే. గూండాయిజాన్ని అరికట్టడంలో యోగి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత మంచిపేరును తెచ్చుకోవడం విశేషం. హోం మొదలైన కీలక శాఖలను ఆయన దగ్గరే ఉంచుకుని, కొన్ని చెడు వ్యవస్థలను కట్టడి చేశారని  ఆ రాష్ట్రంలో చెప్పుకుంటారు. ఉత్తరప్రదేశ్ లో రెండోసారి కూడా తమ పార్టీ అధికారంలోకి రావడం కానీ , ఏ మాత్రం పాలనా అనుభవంలేని తాను ముఖ్యమంత్రి కావడం  మొదలైనవన్నీ కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్లనే సాధ్యమయ్యాయని ప్రమాణస్వీకార ప్రసంగంలో యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా, ఆదిత్యనాథ్ యోగి అటు స్వరాష్ట్రంలోనూ – ఇటు దేశంలోనూ ప్రత్యేకమైన పేరును తెచ్చుకున్నారు. పరివ్రాజక వేషంలో ఉన్నారు. ఇంకా ఎంతో వయస్సు ఉంది. సుపరిపాలన అందించి, సుకీర్తిని మూటకట్టుకుంటారని ఆశిద్దాం. ఉత్తరభారతదేశంలో పీఠాధిపతులను, సన్యాసాశ్రమాన్ని స్వీకరించినవారిని ‘మహరాజ్’ అని పిలుస్తారు. ఆ విధంగా, యోగి ఆదిత్యనాథ్ కు రాజయోగం, మహరాజయోగం రెండూ పట్టడం విశేషం.

Also read: ఇంటి నుంచి పనికి ఇకపై స్వస్తి?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles