Tuesday, December 3, 2024

ఎన్నికల సమయంలో మీడియా చేయవలసిందేమిటి?

మాడభూషి శ్రీధర్

అందరికీ ఓటు హక్కు ఉందని చెప్పే రాజ్యాంగం ఆర్టికిల్ 325 ప్రతిప్రాదేశిక నియోజకవర్గానికి ఒకే సాధారణ ఓటర్ల జాబితా ఉండాలని నిర్దేశిస్తున్నది. ఇది అసలైనపని. ఈ నియమాన్నిఅమలు చేయడం ఒక సమున్నత బాధ్యత. మతం, జాతి, కులం, లేదా వీటిలో ఏ అంశం ఆధారంగా కూడా లింగవివక్ష చూపకుండా అందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈ ఆర్టికిల్  స్పష్టంగాచెప్పింది.

ప్రతివ్యక్తికి 18 ఏళ్ల వయసు రాగానే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించేందుకు ఓటుహక్కు ఇవ్వాలి. వయోజన ఓటు హక్కు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక నినాదం, విధానం, ఆశయం, ఆ తరువాత ఒక మౌలిక రాజ్యాంగసూత్రం. రాజ్యాంగం ఏర్పడిన సందర్భంలో 21 సంవత్సరాల వయసున్న ఆడవారికీ, మగవారికీ సమానంగా ఓటు హక్కు ఇవ్వాలన్నది ఒక చారిత్రిక నిర్ణయం, సమానతకు తొలిమెట్టు అని కాంగ్రెస్ సమావేశాలు రాజ్యాంగ రచనా సభలు చర్చించాయి.

అయితే, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. కాని ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభం కావడం కూడా సాధ్యం కాదు. అందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించడం, వారు సక్రమంగా ప్రశాంతంగా ఓటు వేయడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడం, ఓటర్లు ఏ ప్రభావాలకూ లోను కాకుండా స్వయంగా స్వతంత్రంగా అన్నీ తెలిసి సొంత చైతన్యంతో నిర్ణయం తీసుకుని ఓటు వేయడానికి ఏర్పాట్లు చేస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో తొలి విజయం సాధించినట్టే. ప్రతి అయిదేళ్లకొకసారి ఈ విజయాలు సాధిస్తూ ఉండాల్సిందే. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడినట్టు.

అందుకు జనాన్ని సిద్ధం చేయడం పౌరసమాజం బాధ్యత. పత్రికల బాధ్యత. మీడియా బాధ్యత. ఎన్నికలు సక్రమంగా జరిపించడం అనేదే గురుతరమైన బాధ్యత. ఎన్నికల కమిషన్ అధ్వర్యంలో, ప్రభుత్వ అధికారుల నిర్వహణలో ఈ బాధ్యత సక్రమంగా నెరవేరడానికి పౌరుల పక్షాన నిలబడవలిసింది విలేకరులు. ఈ హక్కును, రాజ్యాంగాన్ని ప్రజలే పాలించే అవకాశాన్ని కాపాడుకోవలసింది కలాలు, కెమెరాలు కూడా ఓటర్లు జర్నలిస్టులు దాదాపు ఒకే పనిచేస్తుంటారు. అదేమంటే తమ భావవ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని వినియోగించడమే. ఓటేయడం అంటే తమ అభిమతం తెలపడమే, ఓటర్ల భావస్వేచ్ఛను కాపాడితే ఆ ఓట్లే పత్రికాస్వేచ్ఛను కాపాడతాయి. అందరూ కలసి భావస్వేచ్ఛను కాపాడుకోవలసిందే.

ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే వివిధ అంశాలపై మీడియా చేయవలసిందేమిటి? కలాలు రాయవలసిందేమిటి? కెమెరా కన్నుచూడవలసిందేమిటి? కాపలా కాయవలసిన అంశాలు ఏమిటి? ఎన్నికల చట్టాల్లో చెప్పేబాధ్యతలు ఏమిటి?

ఎంతో కొంత భూమిఉండి ఆ భూమికి శిస్తు కట్టేవారికే బ్రిటిషు పాలకులు ఓటు హక్కు ఇచ్చారు. అందరికీ ఓటు అనేది అప్పుడు అందని ఆకాశకుసుమం. కనుక డబ్బు, హోదా, సర్కారువారి బిరుదులు, ప్రాపకం, కులంమతం, రంగు, జాతీయత, ప్రాంతీయతతో సంబంధం లేకుండా 21 ఏళ్లు ఉన్నవారందరికీ ఓటుహక్కు లభించడం అనేదే ఒక గొప్ప విజయం.

మొట్టమొదటిసారి మనదైన రాజ్యాంగ నియమాల ప్రకారం 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు భారతదేశంలో ప్రతిచోట పండుగ జరుపుకున్నారు. ఎన్నికలంటే నిజంగా పండుగే. అందరికీ భాగస్వామ్యం లభించే పండుగ. అందరికీ తామే ఈ ప్రజాస్వామిక రాజ్యాన్నినడుపుతున్నామనే సార్వజనీన భావన కలిగించే పండుగ.

అంతగా కల్లోలంగా ఉన్న కశ్మీరంలో కూడా ఎన్నికలు సక్రమంగా  జరగడం, ప్రభుత్వాలు మారడం, అప్పుడప్పుడూ అల్లర్లు జరిగినా ప్రశాంతంగా అభివృద్ధి సాగడం ప్రజాస్వామ్యం విజయాలనే చెప్పాలి. ఓటు వేసే చైతన్యం అందరిలోనూ ఎదగడం అతిముఖ్యమైన అంశం. ఓటు వయసున్న వారందరికీ ఓటు హక్కు కల్పించడం, వారంతా ఓటువేయడం, అదీ స్వయంనిర్ణయంతో ఓటు వేయడం జరిగినపుడు సంపూర్ణమైన ప్రజాస్వామ్య విజయం అని ధైర్యంగా చెప్పుకోవచ్చు.

ప్రజాస్వామ్యాన్నికాపాడుకోవడంఎలా?

ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఎలా? అది ఎవరి చేతుల్లో ఉంది? అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. ఆ బాధ్యత అందరిదీ కనుక. రాజ్యాంగం (భారత సంవిధానం)లోన్యాయ, ప్రభుత్వ,శాసన వ్యవస్థల నిర్మాణం జరగడానికి ప్రాతిపదిక ఎన్నికలు. ముందు చట్టసభల ప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్నతరువాత, వారినుంచిప్రధానమంత్రి, మంత్రివర్గం ఏర్పడుతుంది. ప్రజా ప్రతినిధులే రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. వారి అధ్వర్యంలో న్యాయవ్యవస్థ నిర్మాణం జరుగుతుంది. మొత్తం ప్రభుత్వ నిర్మాణమే ప్రజల  ఓట్ల ఆధారంగా సాగుతుంది. ఒకదేశాన్ని ఆ దేశ ప్రజలు నడుపుకోవడ మేప్రజాస్వామ్యం.

రిజస్టరయన ఓటరుగా ఉండే హక్కును రాజ్యాంగం కల్పిస్తే, రిజిస్టర్చేసుకునే హక్కును చట్టబద్దంగా కల్పించింది ప్రజాప్రాతినిధ్యచట్టం. 1988లో రాజ్యాంగం 61 సవరణచట్టం ద్వారా వయోజన ఓటు హక్కును 18 సంవత్సరాలకే ఇవ్వాలని రాజీవ్ గాంధీ పాలనలో పార్లమెంటు నిర్ణయించడం మరో మంచి మార్పు. ప్రజాప్రాతినిధ్యచట్టం 1950, ఆ చట్టం కింద 1960 నియమాల ప్రకారం ఓటు హక్కు ఏ విధంగా నమోదు చేసుకోవాలో వివరించారు. 18 నిండిన భారత పౌరులకు ఇతర అనర్హతలు ఏవీ లేకపోతే ఓటరుగా నమోదు చేసుకునే హక్కు లభిస్తుంది.

ఓటు హక్కు లేనివారికి ఇవ్వడం, అర్హత ఉన్న వారికి ఇవ్వకపోవడం అనే అక్రమాలు జరిగినప్పుడు ఎత్తిచూపవలసింది జర్నలిస్టులు. బోగసు ఓట్లన్నీ ఏరివేయించడం, అర్హులందరికీ ఓటు హక్కు ఇప్పించడం అనేది ఒక బాధ్యత.

ఇది ఎన్నికల సమయంలో సాధ్యం కాకపోవచ్చు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత అప్పటికి సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే  ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. అయితే ఆ దశలో కూడా మరీ బోగస్ అని చెప్పడానికి వీలైన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావలసి ఉంటుంది. ఈ మధ్యఓటర్లజాబితాసవరణకుతప్పులదిద్దుబాటుకునోటిఫికేషన్తరువాతకూడాఅవకాశాలుకల్పించడంమంచిపరిణామం.

ఓటరుగా ఉండాలంటే కావలసిన అర్హతలు. భారత పౌరులు కావడం, 18 ఏళ్ల వయసు నిండడం, ఆ నియోజకవర్గంలో నివసిస్తూ ఉండడం. అనర్హతలేవీ ఉండక పోవడం. సెక్షన్ 16 ప్రజాప్రాతినిధ్యచట్టం 1950 ప్రకారం మానసిక సమతౌల్యం కోల్పోయినట్టు న్యాయస్థానం తేల్చి చెప్పడం, ఎన్నికల అక్రమాలు లేదా నేరాల్లో బాధ్యుడని రుజువై ఉండడం అసలు అనర్హతలు. ఓటరుగా నమోదు చేయడానికి అతను ఏ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఉండకూడదు. ఏ విధమైన ఎన్నికల నేరాలు చేయకూడదు. ఎన్నికల్లో అసమంజసంగా లంచాలు ఇచ్చినా తీసుకున్నా, మరొకరి ఓటు తాము ఓటు వేయించుకునేందుకు ప్రజలను ప్రభావితం చేసినా, ఎన్నికల సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలను రెచ్చగొట్టినా, పోలింగ్ స్టేషన్నుంచి బ్యాలెట కత్రాలను తొలగించినా, నామినేషన్ పేపర్లను బాలెట్ త్రాలను పెట్టెలను దుర్మార్గంగా ధ్వంసం చేసినా, ఆ నేరం చేసినట్టు రుజువైతే ఎన్నికల నేరస్తుడవుతాడు. ఆరేళ్లపాటు ఓటు వేయడానికి అనర్హుడవుతాడు. ఈ ఎన్నికల నేరాలకు పాల్పడిన వ్యక్తి శిక్షకు గురైతే ఆ వ్యక్తి తాను ఏ నియోజకవర్గంలోనూ అభ్యర్థిగా ఎన్నికకావడానికి, సభ్యుడిగా కొనసాగడానికి అనర్హులవుతారు. ఏ ఎన్నికల్లో కూడా ఓటు వేయడానికి కూడా వీలుండదు. ఎవరికైనా ఓటు వేయాలని అక్రమంగా ఓటరును ఎవరయినా ప్రభావితం చేస్తే ఆ వ్యక్తి ఓటు హక్కును అప్పడికప్పుడు రద్దు చేసే అధికారం ఎన్నికల అధికారికి ఉంటుంది. మళ్లీ ఏ నేరమూ చేయక పోతే ఆరేళ్ల తరువాత అనర్హత తొలగి పోతుంది.

ఏదయినా నియోజకవర్గంలో సాధారణంగా నివసిస్తూ ఉన్న వ్యక్తికి ఆ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఉండాలనే నియమం ఏదీ లేదు. ఎంతోకొంతకాలం ఉంటే చాలు. తను నివసిస్తున్న చోట ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చట్టం వివరిస్తున్నది (1950 చట్టంసెక్షన్ 19(ఎ) (బి). తాత్కాలికంగా మరో నగరానికి వెళ్లి ఉంటున్నవారు కూడా అక్కడ నివసిస్తున్నట్టే. వారూ అక్కడ ఓటరు కావచ్చు. 1956లో గోవా ఓటర్ల జాబితా సవరించినపుడు అక్కడ పోర్చుగీసు కాలనీల్లో బందీలుగా ఉన్న భారతీయులకు ఓటు హక్కు ఎందుకు ఇవ్వకూడదనే ప్రశ్న తలెత్తింది. వారికి కూడా ఓటు నమోదు చేయాలని నిర్ణయించారు. సాధారణంగా నివసించడం అంటే ఒక ఇల్లు ఉండి, అక్కడికి  నిద్రించడానికి రాత్రికల్లా రావడం. అతనికి అక్కడ నివసించే ఉద్దేశం ఉంటేనే అది నివాసం అవుతుంది.

డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్సాంలో ఆ విధంగా నివసించి ఉంటేనే ఆయనకు ఓటు హక్కు ఇవ్వవచ్చునని గౌహతి హైకోర్టు నిర్ణయించింది. దానిపైన ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు నివాసం అంటే అర్థం అదే అయినా, నివసిస్తేనే ఓటు హక్కు ఉంటుందని అదనపు షరతులు విధించి ఓటు హక్కు లేదనే అధికారం లేదని సుప్రీంకోర్టు వివరించింది. అంటే ఇల్లు లేకపోతే ఓటు ఇవ్వరా అనేది మరో ప్రశ్న. ఫుట్ పాత్ మీద బతికే వ్యక్తి ఈ దేశ పౌరుడు కాదా అతనికి ఓటు `ఇవ్వబోరా? అన్నది సవాల్. కనుక నివాసం ఉంటేనే ఓటు హక్కు అంటే డబ్బు ఇల్లు సంపద. ఆధారంగా ఓటు హక్కును నిర్ణయించినట్టవుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం. ఆ నియమాన్నిఎన్నికల కమిషన్ తనంతట తానే తొలగించింది. ఒక నియోజకవర్గంలో సొంత ఇల్లు ఉన్నంత మాత్రానే అక్కడే ఆయన నివసిస్తున్నట్టు భావించాల్సినఅవసరంకూడాలేదు. ఎన్నికైన తరువాత ఎంపీలు ఎంఎల్యేలు రాజధానుల్లో ఉంటారు. అయితే వారి నివాసం మారిపోతుందా లేదా వారి ఓటుపోతుందా? వారు ఇదివరకు ఎక్కడ ఓటరుగా నమోదయ్యారో అక్కడ వారు నివసిస్తున్నట్టే, అక్కడ వారి ఓటు ఉన్నట్టే. మనం బతికి ఉంటే , ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే మన ఓటు హక్కు బతికి ఉండాలి. ఓటు వేయడం ద్వారా ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం, జనం వారి జీవనం బతుకుంది.

(26 నవంబర్ ను 1949న మనకోసం మనం ఇచ్చుకున్న మన భారత రాజ్యాంగాన్ని అవతరించిన రోజు. 74 సంవత్సరాలు పూర్తయింది. అంటే 27 నవంబర్ 2023 నుంచి మన నేషనల్ లా డే, 75వ దినోత్సవం చేసుకోవలసిన దినం. రచన ముగించి రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజు. మొత్తం కాకపోయినా 16 ఆర్టికిల్స్ నవంబర్ 1949న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులో కీలకమైన హక్కు వోట్ హక్కు పుట్టిన రోజు ఈ రోజు.)

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles