ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నిరంతరం సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు నుంచి తెలుగు మీడియా పనితీరు విచిత్రంగా మారిపోయింది. చంద్రబాబు పాలనలో ఒక వర్గం మీడియా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్ధిస్తూ అతిశయోక్తి ప్రచారాలు చేసేది. ఆ వార్తలకు మరింత ఊతమివ్వడానికి ఆయన కూడా రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ప్రసారమాధ్యమాల్లో నిరంతరం ప్రచారమయ్యేలా నానాయాగీ చేస్తుంటే చూడడానికి ప్రజలకు విసుగ్గా ఉండేది. చంద్రబాబు ప్రజలను పట్టించుకోవడానికి రోజుకున్న ఇరవైనాలుగు గంటలూ సరిపోవడం లేదనిపించేది. ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు మాత్రమే కాక వివిధ శాఖల మంత్రులు చేయవలసిన పనులతో పాటుగా పలు శాఖల ఉన్నతాధికారుల విధులను కూడా చంద్రబాబు ఒంటి చేత్తో లయవిన్యాసంగా చేసేస్తుంటే చూసేవారికి కడుపు దేవేసినట్టుండేది. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత దానికి పూర్తి భిన్నంగా రివర్స్ టైంటేబుల్ ఫిక్స్ చేశారు. తన జమానాలో రాజకీయం, పాలన రెండింటినీ నైన్ టూ ఫైవ్ ఉద్యోగంలాగా మార్చిపారేశారు.
Also read: సైన్యం చేసిన హత్యలకు శిక్షల్లేవా?
ముఖ్యమంత్రి పనితీరు మార్చిన జగన్
ముఖ్యమంత్రి అన్నాక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు జరపడం తప్పనిసరి. సాయంత్రం ఐదింటికల్లా తనతోపాటే అధికారులంతా ఇంటికెళ్లిపోవాలని జగన్ నియమం పెట్టుకున్నట్టుంది. మొదట్లో కలెక్టర్లకు సాయంత్రం మూడు గంటలకే మొదటి వార్నింగ్ ఇచ్చే వారని, నాలుగున్నరకల్లా చివరి అరగంట వార్నింగ్ గట్టిగా ఇచ్చేవారని అనుకూల మీడియాలో లీకులు కూడా వచ్చాయి. ఒక్కరు మాట్లాడుతుంటే మిగిలిన వారంతా వినడం మాత్రమే చేయాల్సిన వీడియో కాన్ఫరెన్సులు అర్థరాత్రి వరకూ సాగుతూనే ఉండే దృశ్యం అకస్మాత్తుగా మన రాష్ట్రంలో అదృశ్యమైంది. మంత్రుల గొంతులకు సవరింపులు జరగడం వల్ల కొద్దిగా మాట్లాడగలుతున్నారు. అయితే కొందరు మాత్రం మాట్లాడడమంటే ప్రతిపక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న వారిని చూసి జనం విసుక్కుంటున్నారు. నిరంతరం ప్రజలతో కలిసిమెలసి ఉండడమే కాక, రాష్ట్రమంతా కాలినడకతో పర్యటించి, వారితో మమేకమైన యువనేత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా ప్రజలతో మాట్లాడక మూగనోము పట్టడం వారికి అంతుచిక్కడం లేదు. వానలొచ్చినా, వరదలొచ్చినా పరామర్శల్లేవు. ఊరడింపుల్లేవు. కంటితుడుపుల్లేవు. కౌగిలింతలు లేవు. సహాయంగా అందవలసిన నష్టపరిహారం మాత్రం టంచనుగా లబ్దిదారుల, బాధితుల బ్యాంకు అకౌంట్లలోకి చేరిపోతుంది. తమకు అందుతున్న సాయానికి ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకపోవడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. ఇదొక నూతన రాజకీయంగా ప్రజలు అర్థం చేసుకున్నంత విశాల దృక్పథంలో ఆ పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మరొక పర్యాయం ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఒడిషా, కేరళ రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్ర రాజకీయ దృశ్యం మారడం ఖాయమని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కేవలం ఈ రెండున్నరేళ్లలోనే ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు తగ్గిన పరపతిని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు.
Also read: ‘జైైభీమ్’ సినిమా మన ఆలోచనను మారుస్తుందా!
మీడియా అసిధారావ్రతం
మీడియాది నిరంతర ప్రతిపక్ష పాత్ర. కాని మన రాష్ట్రంలో మీడియా తాను పోషించవలసిన పాత్రలో మరీ తలమునకలుగా లీనమైంది. నిర్మాణాత్మక విమర్శను మర్చిపోయింది. ప్రతిపక్షం తన ఉనికిని తానే రద్దు చేసుకోవడం ద్వారా తన మనుగడను సుప్తావస్థలోకి జార్చుకుంది. దాంతో ప్రతిపక్షం చేయాల్సిన పనిని మన తెలివితక్కువ తెలుగు మీడియా తన తలకెత్తుకుంది. ఎలాగైనా ముఖ్యమంత్రిని గద్దె దించాలన్న లక్ష్యాన్ని ఔదలదాల్చింది. రోజుకో వార్తాకథనాన్ని గత రెండున్నరేళ్లుగా అసిధారావ్రతంగా పాఠకులకు అందిస్తోంది. అందులో నిజమెంతో అబద్దమెంతో చెప్పాల్సిన బాధ్యత ఆ పత్రికలకు లేదు, వాటిలో నిజం పాలు ఎంతో తెలుసుకోవాలన్న తాపత్రయం ప్రజలకు అంతకన్నా లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నిరంతరం వేడిని పుట్టిస్తూనే ఉంటాయి. దానికి కోర్టులు తాము తక్కువ తినలేదంటూ ఎవరూ కోరకపోయినా, అది తమ పని కానప్పటికీ తెలుగు మీడియాకు సాటిలేని పోటీ ఇచ్చి, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించడానికి సూ-మోటోగా రంగంలోకి దిగాయి. సరైన సమాచారం అధికారులు అందించకపోతే ఈ దేశంలో మరెక్కడైనా కోర్టులు ఆయా అధికారులకు జరిమానాలు విధిస్తాయి, కాని మన రాష్ట్రంలో మాత్రం పాలన వైఫల్యం చెందిందని వ్యాఖ్యానిస్తాయి. అంతకుమించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని సూచన చేయడాన్ని పరిశీలిస్తామని కొందరు న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తారు. ‘నవ్విపోదురు గాక నాకేటి వెరపు..’ అంటూ ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో కుదరదు.
Also read: మూడు రాజధానులు లేనట్టేనా!
ప్రభుత్వ నిర్ణయాలన్నీ కొట్టివేస్తున్న న్యాయస్థానం
మన రాష్ట్రంలో కోర్టులు దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కొట్టివేస్తున్నాయి. ఇష్టానుసారం ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేసుకుంటూ తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నపుడు నిరోధించడానికి ప్రభుత్వం పూనుకుంటే అది కూడా మన న్యాయస్థానాల దృష్టిలో తప్పుడు నిర్ణయమే. ఆ జీవోను కొట్టేస్తాయి. అడ్డగోలుగా సినిమా హాళ్లలో టిక్కెట్ల రేటును పెంచుకుంటూ పోయి పేద మధ్యతరగతి ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టడానికి అడ్డుకట్ట వేసి సినిమా రేట్లు తగ్గించడానికి ప్రభుత్వం పూనుకుంటే అది కూడా మన న్యాయస్థానాల దృష్టిలో ప్రభుత్వ వైఫల్యమే. సినిమా టిక్కెట్లను ఇష్టానుసారం పెంచకూడదన్న జీవోను కొట్టిపారేస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురానికి ఆనుకుని ఉన్న 200 గ్రామాలను కలుపుతూ గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (గుడా)ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ జీవోను మన సమున్నత న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తి కొట్టివేశారు. పైగా తన తీర్పును సమర్ధించుకోవడానికి ఎన్నెన్నో సుద్దులు చెప్పారు. గ్రామాలను పరిరక్షించుకోవాలని కోరుతూ, గ్రామాలను పట్టణీకరణ చేసుకుంటూ పోతే మన సంస్కృతికి పట్టుగొమ్మలయిన పల్లెలు ఏమవుతాయని ఆందోళన చెంది, దిగులుపడి, బెంగటిల్లారు. అదే న్యాయస్థానం చాలా విచిత్రంగా మూడు పంటలు పండే ముప్పైమూడు వేల ఎకరాల మాగాణిని రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడాన్ని ఏమంటారో చెప్పలేదు. కోనసీమలో గోదావరి అథారిటీని ఏర్పాటు చేయడం తప్పని చెప్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసిన మహోన్నత న్యాయస్థానం – కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలను కలుపుతూ కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని చంద్రబాబు ఏర్పాటు చేయడాన్ని ఆమోదించింది. ఇలా చెప్పుకుంటూ పోతే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలనాపరమైన ప్రతి నిర్ణయాన్ని కోర్టులు అడ్డుకున్న ఉదంతాలు అనేకం.
Also read: రోజురోజుకూ అడుగు కిందకు…
పొరుగు రాష్ట్రంలో నాలుగో స్తంభం
ఇప్పటివరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో చేస్తున్న మౌలిక కృషి ఫలితంగా ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా విడుదలవుతున్న అభివృద్ధి సూచీలలో మన రాష్ట్రం తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొంటో వస్తోంది. మన పత్రికలు ఆ వార్తలు రాయడానికి ఇచ్చగించడం లేదు. వ్యతిరేక వార్తలకు తప్ప సానుకూల వార్తలకు తమ పత్రికలలో, తమ టీవీ చానెళ్లలో చోటివ్వకపోవడం వారి హ్రస్వదృష్టికి నిదర్శనం. అరచేతితో సూర్యుడి కాంతిని ఆపలేరని తెలుసుకుని, ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలను చర్చించడానికి తమ వేదికను వినియోగించినప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు శ్రేయోదాయకంగా ఉంటుంది. రాజధాని వికేంద్రీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శక్తులన్నీ తెలుసుకోవలసింది ఏమంటే.. ఎగ్జిక్యుటివ్, జ్యూడిషియరీ, లెజిస్లేటివ్ వ్యవస్థలనే మూడు పాదాలు మన రాష్ట్రంలోనే మూడు చోట్ల అంటేనే మింగుడు పడడం లేదు కదా, మరి మన నాలుగో పాదం మీడియా మాత్రం పొరుగు రాష్ట్రంలో ఉండొచ్చా.. అక్కడ ఉంటూనే ఇక్కడ విద్వేషాలు, అసహనం, అబద్ధపు ప్రచారాలు సాగించవచ్చా..!
Also read: వైకాపా కార్యకర్తల నిరాశ నిజమేనా?