వోలేటి దివాకర్
స్వాతంత్రోద్యమంలో పత్రికల పాత్ర అమూల్యం. ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వ అరాచకాలు … అకృత్యాలను వెలుగులోకి తెచ్చి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో పత్రికలు కీలక భూమిక పోషించాయి. ఆనాడు పత్రికలు నిష్పక్షపాతంగా కేవలం సమాచారాన్ని అందించడానికి పరిమితమయ్యాయి. జరిగిన సంఘటన ఆధారంగా స్వాతంత్య్ర సమరయోధులు ప్రజా ఉద్యమాలను నిర్మించారు. వార్తల ఆధారంగా కొన్ని సార్లు స్వచ్చందంగా ప్రజలే ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
నాటికీ నేటికీ సమాచార మాధ్యమాల పాత్రలో గణనీయమైన మార్పు వచ్చింది. నేడు పత్రికలు, టీవీలే తమకు అనుకూలమైన ప్రభుత్వాల కోసం కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నాయి. ప్రతీ పార్టీకి సొంత, అనుకూల మీడియాలు ఉన్నాయి . అధికార వై ఎస్సార్సిపికి సొంత సాక్షి మీడియా తో పాటు టీవీ9, ఎన్ టీవీ అనుకూలంగా ఉన్నాయి. వామపక్షాలకు ఏనాటి నుంచో సొంత పత్రికలు ఉన్నాయి. సిపిఎంకు ప్రజాశక్తి, సిపిఐకి విశాలాంధ్ర పత్రికలు బాసటగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఎబిఎన్, టివీ 5 సంస్థలు సొంత మీడియాలాంటివి.ఇవి టిడిపికి అనుకూలంగా ఉన్న పార్టీలు, నాయకుల వార్తలను ప్రముఖంగా వెలుగులోకి తెస్తాయి. ఆయా పార్టీలు టిడిపికి వ్యతిరేకమైతే వెంటనే వ్యతిరేక వార్తలను వండివారుస్తాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి వ్యతిరేక వార్తలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక జన సేనకు ఆంధ్రప్రభ, 99 టీవీ అనుకూలంగా ఉన్నాయి. ఒకప్పుడు నిష్పక్షపాతంగా ఉన్న ఆంధ్రప్రభ యాజమాన్యం ముత్తా గోపాలకృష్ణ చేతుల్లోకి వెళ్లిన తరువాత ఆయన కుటుంబం ఏపార్టీలో ఉంటే ఆపార్టీ తరుపున పత్రిక పనిచేస్తుందన్న ప్రచారం ఉంది. అలాగే తెలంగాణాలో అధికార టిఆర్ఎస్ , బిజెపిలకు అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి .
ఎపిలో ప్రతిపక్ష పాత్రలో పత్రికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై ఎస్సార్సిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాన ప్రతిపక్షాల కన్నా ఆ రెండు పత్రికలు , మీడియా సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాయి. సొంత పార్టీ. వాణిని గట్టిగా వినిపించడంతో పాటు , ప్రజావ్యతిరేకతను కూడగట్టడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆ పత్రికలు, మీడియా ఆడించినట్లు ప్రతిపక్షాలు ఆడుతున్నట్లు కనిపిస్తోంది . ప్రస్తుత వైసిపి పాలనలో అన్నీ తప్పులే జరుగుతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రతీరోజూ ఈనాడు,ఆంధ్రజ్యోతి పత్రికల్లో మొదటి పేజీ వార్తలు వైసిపి ప్రభుత్వ వ్యతిరేక వార్తలతో నింపేస్తున్నారు . కొన్ని సంఘటనలను బూతద్దంలో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు సమావేశాలు, ఆందోళనలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాయి. రాత్రికి అవే అంశాలపై టివీ -5 , ఎబిఎన్ చానళ్లలో డిబేట్లు సాగుతాయి. రాష్ట్రంలో ప్రజానుకూల విధానాలు ఒక్కటీ అమలు జరగడం లేదా అన్న అనుమానాలు ఆపత్రికలు చదివిన వారికి రాక మానదు .
మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రంలోని పత్రికల పనితీరును ఆనాడే గుర్తించారు . పదేపదే ఆ రెండు పత్రికలు అంటూ .ఈనాడు , ఆంధ్రజ్యోతిని ఎద్దేవా చేసేవారు. ఆ పత్రికల వ్యతిరేక గళాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకే సాక్షి మీడియాను ప్రారంభించారు. సాక్షి మీడియా ఆయా పత్రికలు , మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై వివరణలు, ఖండనలు ఇస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా కూడా కాస్తోకూస్తో ప్రభావం చూపిస్తోంది. ఈ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష అనుకూల మీడియా ప్రత్యర్ధులపై బురద జల్లుతూనే. తమ పార్టీల గొప్పతనాన్ని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2004,2009,2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి అనుకూల మీడియా ఎంత బాకా ఊదినా ప్రజలు పట్టించుకోకుండా కాంగ్రెస్, వైసీపీ లను అధికారంలోకి తెచ్చారు. ఈ సారైనా మీడియాను ప్రజలు విశ్వసిస్తారా అన్నది ప్రశ్నార్ధకం. అలాగని అధికార మీడియా బాకాను కూడా ప్రజలు విశ్వసించడం లేదు.