Sunday, December 22, 2024

మౌనం వీడి మాయావతి మాయాజూదం

  • పంజాబ్ లో అకాలీలతో పొత్తు
  • యూపీలో అనూహ్యంగా అడుగులు
  • బీజేపీకి పరోక్షంగా సహకారం?

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ‘సెమీఫైనల్స్’ గా వర్ణించబడుతున్న,నేటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా రాకపోయినా, వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ నానా తిప్పలు పడుతున్నారు. మొన్నటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అమేయమైన విజయాన్ని సొంతం చేసుకొని మంచి ఊపుమీద ఉన్న మమతా బెనర్జీ మిగిలిన రాష్ట్రాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ను విస్తరించాలని, వచ్చే ఎన్నికల నాటికి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా నిలవాలని చాలా తపన పడుతున్నారు. దిల్లీ రాష్ట్రాధికారాన్ని వరుసగా రెండుసార్లు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ కన్ను మిగిలిన రాష్ట్రాల పైనా పడింది.  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆయనా చూస్తున్నారు. జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా ముందుగా మరోసారి ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

Also read: అమరగాయనికి బాష్పాంజలి

ఆలస్యంగా రంగంలోకి…

ఇలా, వీరందరూ మొదటి నుంచీ చాలా చురుకుగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెంటివేయబడిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్ తన ప్రతాపాన్ని పంజాబ్ లో చూపే ప్రయత్నం చేస్తున్నారు.  వీరందరితో పోల్చుకుంటే బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కదలికలు నిన్నటి వరకూ అంత చురుకుగా కనిపించడం లేదు. నిన్నటి దాకా ఆమె స్తబ్దుగానే ఉన్నారు. ఆవిడ మౌనం వెనకాల పెద్ద వ్యూహం ఉందనే ప్రచారం ఉంది. ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్ లోనూ తమ అభ్యర్థులను నిలబెడుతున్న మాయావతి మెల్లగా మౌనాన్ని వీడుతున్నారు. శిరోమణి అకాలీ దళ్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రచారం జరిగింది. గత సంవత్సరం జూన్ లో ఆ రెండు పార్టీలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు శిరోమణి అకాలీదళ్ తో కలిసి మొట్టమొదటిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తద్వారా మౌనాన్ని బద్దలు కొడుతున్నట్లు సంకేతం ఇచ్చారు. బహుశా ఎన్నికలకు భయపడే మాయావతి బయటకు రావడం లేదని ఆ మధ్య బిజెపి అగ్రనేత అమిత్ షా చురకలు కూడా వేశారు. ఈ చురకలు, విమర్శలు ఎలా ఉన్నా, మాయావతి – బిజెపి మధ్య రహస్య ఒప్పందం ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. కేసులకు భయపడి, కేంద్ర పెద్దల చల్లని చూపుల కోసం ఆమె చూస్తున్నారనే వదంతులు ఉన్నాయి.

Also read: ముందున్నవి మంచిరోజులు

పంజాబ్ లో అకాలీలతో పొత్తు

పంజాబ్ లో అకాలీదళ్ భాగస్వామ్యంలో, 20 స్థానాలకు బహుజన సమాజ్ అభ్యర్ధులను నిలబెడుతోంది. పంజాబ్ ఓట్ బ్యాంక్ లో అత్యధిక శాతం దళితులకే ఉంది. దళితనేతగా  మాయావతికి జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపు ఉంది.  దేశంలో ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేబట్టిన మొట్టమొదటి దళిత మహిళా నేత ఆమె. ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా ఉన్న చన్నీ కూడా దళిత సమాజిక వర్గానికి చెందినవారే. రేపటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా చన్నీయే ఉంటారని కాంగ్రెస్ తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దళిత ఓటుబ్యాంక్ ను కాంగ్రెస్ తన్నుకుపోకుండా చూడడానికి అన్ని పార్టీలు వాటి పరిధిలో ప్రయత్నం చేస్తున్నాయి. దళిత ఓట్లు తమ ఖాతాలో పడతాయానే విశ్వాసంలో మాయావతి ఉన్నట్టు కనిపిస్తోంది. దళిత నేతగా తనకున్న ముద్ర ఉపయోగపడుతుందని ఆమె అంచనా వేస్తున్నట్లుగా వినపడుతోంది. పంజాబ్ లో సుమారు 32 శాతం ఓటుబ్యాంక్ దళిత సామాజిక వర్గాలకు ఉన్నప్పటికీ  వారి మధ్య  ఐక్యత లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఆ విషయం అర్ధమవుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దళిత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా నిలబెట్టిన కాంగ్రెస్ కు న్యాయంగా దళితుల ఓట్లు ఎక్కువ రావాలి. కానీ, ప్రస్తుతం ఆ వాతావరణం కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రేపటి ఎన్నికల్లో దళిత ఓట్ల చీలికలో మాయావతి ప్రభావం కూడా ఎంతోకొంత ఉంటుందని, అది కాంగ్రెస్ కు నష్టాన్ని కలిగిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Also read: సామాజిక న్యాయం సాటిలేని నినాదం

యూపీలో ఓబీసీలూ, ముస్లింలతో…

ఉత్తరప్రదేశ్ లో మాయావతి భిన్నమైన ఆట ఆడుతున్నట్లు కనిపిస్తోంది. దళితులతో పాటు ఓబీసీ వర్గాల వైపు ఆమె ఎక్కువగా దృష్టి సారించారు. గతంలో బ్రాహ్మణులను ఎక్కువగా కలుపుకొని వెళ్లారు.ఈసారి బ్రాహ్మణుల నుంచి కొంత దృష్టి మరల్చినట్లుగా తెలుస్తోంది. మైనారిటీస్ పైనా మాయావతి దృష్టి సారించారు. అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించే పనిలో ఉన్నారు. గతంలో బీహార్ లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టి కొన్ని ఫలితాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోనూ అదే ప్రయోగం చేస్తున్నారు. మైనారిటీస్ ఓటుబ్యాంక్ ను కొల్లగొట్టాలనే విశ్వప్రయత్నంలో ఒవైసీ ఉన్నారు. మైనారిటీస్ కు సీట్లు కేటాయించి, ఒవైసీకి పోటీగా నిలవాలని మాయావతి చూస్తున్నారు. ‘బి టీమ్ అఫ్ బిజెపి’ గా ఒవైసీపై కొన్ని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మాయావతి సహకారం కూడా బిజెపికే ఉంటుందనే ప్రచారమూ ఉంది. 2017 ఎన్నికల్లో బీ ఎస్ పీ కేవలం 19 స్థానాలనే తెచ్చుకో గలిగింది.సమాజ్ వాదీ పార్టీ 47 స్థానాల్లో గెలిచినా, ఓటింగ్ శాతంలో ( 21.82%) వెనుకబడింది. బహుజన సమాజ్ 22.23 శాతం ఓటుబ్యాంక్ ను సాధించింది. దళిత, ఓబీసీ, మైనారిటీస్ కలయికతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే విశ్వాసంలో మాయావతి ఉన్నారని యూపీ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. మొత్తం మీద,మౌనాన్ని వీడి అస్త్రశస్త్రాలు చేబట్టిన మాయావతి ఒకప్పటి తమ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటారా? కేంద్ర అధికార పార్టీకి భయపడి ‘బీ టీమ్ / సీ టీమ్ అఫ్ బిజెపి’ గా పేరుతెచ్చుకుంటారా? వేచిచూద్దాం.

Also read: కార్పొరేట్లకు కొమ్ముకాసే బడ్జెట్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles