Tuesday, January 21, 2025

మనకు మే డే అని ఒకటుంది మీకు తెలుసా?

మాడభూషి శ్రీధర్

ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా మేడే వచ్చింది. కానీ, ఏం చేసుకోవడానికి? పాత చరిత్ర గొప్పగా ఉందని ఓహో అని చెప్పుకునేది ఏముంది? మే డే  అంటే కార్మికులు తన హక్కులు నిలబెట్టుకునే నియమాలు చట్టాలు శాసనాలు ఉన్నాయని అనుకునే వారం.

కార్మిక రాజ్యాంగం

కార్మిక రాజ్యాంగం అనే పేరు లేదు. కాని రాజ్యాంగంలో కార్మికుల హక్కులను కాపాడుకునే చట్టాలను 1950 రాజ్యాంగంలో చేర్పించారు. అంబేడ్కర్ వంటి మహనీయులు ఆ పేరుతొ అనకపొయినా కార్మిక రాజ్యాంగం వంటి లక్షణాలు కొన్ని ఉంచిన వారు ఉన్నారు. కొందరు నాయకులు కూడా ఇందుకు దోహదం చేశారు.

కాని ఇప్పుడు రాజ్యాంగం ప్రభువులు కార్మిక రాజ్యాంగం లేకుండా చంపేశారు. ఒకప్పుడు కార్మిక చట్టాలు, సమ్మె చట్టం ఉందని అనుకునేవాళ్లం. ప్రభుత్వం కాదు, యాజమానులు కాదు, హైకోర్టులు, మరికొందరు గొప్ప న్యాయమూర్తుల ఉండేవారు. వారు న్యాయం చెప్పేవాళ్లు. అప్పుడు కొన్నాళ్లు హక్కులు కూడా ఉండేవి అని చెప్పుకోవడానికి ఒక గత చరిత్ర అని రాసుకునేందుకు వీలవుతుంది. అంతే.

ఇదివరకు చాలా హక్కులు ఉన్నాయి. అది న్యూసెన్స్ అని ప్రభుత్వాలు పెద్దలు ప్రస్తుతం అనుకుంటున్నారు. అనుకోవడం కాదు. కొత్త కొత్త చట్టాలు చేసిపడేసారు. అవి కూడా రాజ్యాంగం ప్రకారం చేసిన చట్టాలు. పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభాలు చేసిన చట్టాలు.

కాని హక్కులే లేవు

కార్మిక చట్టాలని కొందరంటే ఆ తరువాత పరిశ్రమ చట్టాలు, ఇండస్ట్రియల్ చట్టాలు అన్నారు. ఆ తరువాత అన్నీ తీసేసి కేవలం నియమాలు అన్నారు. లేదా యాజమానులు పరిశ్రమ కార్పొరేట్ దయ్యం భూతాలంత పెద్ద కంపెనీలు పెట్టుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపినీ ప్రభువుల పాలనే బాగుందనుకునే గొప్ప కొత్త చట్టాలు తెచ్చుకున్నారు. అవన్నీ భారతీయ పార్టీలు, అంటే రాజ్యాంగం ప్రకారం నిర్మించిన పార్టీలు కలసి చేసుకున్న చట్టాలను రాజ్యాంగ చట్టాలు అంటున్నారు.  

కాంక్రీట్ న్యాయ చట్టాలు కాదు, కాంక్రీట్ విగ్రహాలు

రాజ్యాంగం ఇంకా ఉందని కొందరు అనుకుంటున్నారు. అంబేడ్కర్ పేరొకటి ఉంచుకుంటున్నాం. విగ్రహాలు చేసుకుంటున్నాం. ఆ మహానుభావుడిని మొక్కుకుంటున్నాం. కాని చట్టాలు పీకిపడేశారని ఎవరూ గుర్తుచేసుకోవడం లేదు.

పాపం అంబేడ్కర్ ఆ రాతి, లోహపు, స్టీల్, సిమెంట్ విగ్రహాలలో ఆత్మ (ఆత్మలా, ఉంటాయా? హేతు సంఘాల వారిని అడుగుదాం) ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మనకు రోజూ పత్రికలో ఏం రాసుకుంటామో తెలుసా? మన విలేఖరులు, పాత్రికేయులని గర్వంతో చెప్పుకుంటున్నాం కదా…(వాళ్లకు హక్కులే లేవని ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు, వారికి అది కూడా తెలియదు) ఆత్మహత్యల గురించి రాస్తున్నాం కదా. ఆత్మకు హత్యయేమిటి అసలు? కార్మిక నాయకులు సామన్యులైన కార్మిక వీరులు అని మనం అనుకున్నాం కదా, వారు కూడా డబ్బులేక, పేదరికంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదిగో ఆత్మహత్య అనీ మళ్లీ అంటున్నాం. ఆత్మ ఎక్కడుంది, అధికార పార్టీలోనా, రాజ్యాంగంలోనా లేక నేను చెప్పే లావుగా ఉండే లా పాఠాల్లో చెపుతున్న లెస్సన్స్ లో ఉన్నాయా?

భట్టీయం కేంద్రాలు

నేను ఉండే గాంధీనగర్ (అంటే అహ్మదాబాద్ అంటే మన గాంధీ పుట్టిన దేశం రాజ్యం అని కాదు, ప్రతి జిల్లాలో వాడవాడనా గాంధీనగర్ పేర్లతో ఉన్నాయి కదా. అందులో ఒక పేరు నేను ఉండే చోటు) ఐఎ ఎస్ లో చదువుకుని గెలిచి దేశాన్ని పరిపాలించడానికి భట్టీయం పట్టేసుకుంటారు చూడండి. అందులో రాజ్యాంగం గురించి చెబుతున్నారో లేదో గాని అది లేదని తెలుస్తుంది.

పాపం కార్మిక సంఘాల వారు, పాత్రికేయులు స్పెషల్ మే డే అని కొందరు గురించి వ్వాసాలు, ప్రత్యేక పత్రాలు అచ్చు వేద్దామంటున్నారు కొందరు. పాతకాలం పాలకులను గురించి ఏం రాయను?

ఎవరితోనూ మాట్లాడకుండా, అమ్మాయి పిల్లలు ఎవరికీ కనబడకుండా,ప్రొద్దు నుంచి రాత్రిదాకా చదువుకుంటున్నారు. ఐ ఎ ఎస్ పరీక్షలు ఉత్తీర్ణలు అవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పాసై పోతున్నారు కూడా.  కాని వేలవేల యవతీయువకులు ఫెయిల్ అవుతున్నారు. ఏ ఉద్యోగాలు లేకుండా లక్షల మంది ఉంటున్నారు. బోలెడన్ని  డబ్బులు ఇచ్చుకుని ఐ ఎ ఎస్ అవుతామని కోరుకుంటున్నారు. కలలు కొంటున్నారు. చాలా మంది గొప్ప లెక్చరర్లు కూడా కష్టపడి లెక్చర్ లు దంచుతున్నారు. వాళ్లు పాఠాలు చదివిస్తారు. ఏ పాఠాలు? అందులో రాజ్యాంగ పాఠాలు ఉంటాయి. ఉదాహరణ:  అంబేడ్కర్ జీవితం ఒక పాఠం. నిజం. అది అంబేడ్కర్ అంటే కేవలం ఒక పాఠం. ఒక లెక్చర్, దానికి చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు. 

అయినా అర్థం కాదు కనుక ఒక పెద్ద విగ్రహం. (దాని ముందు చిన్నబోయిన ఇందిరాగాంధీ, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న పివి నరసింహారావు ఇంకా చిన్నబోయిన విగ్రహాలు ఇప్పుడెవరైనా చూస్తారా అని). కోచింగ్ దుకాణాల్లో భట్టీ కొట్టి,  ఎన్ టీ రామారావ్ వలె మయసభ డైలాగ్ లు కొట్టినట్టు, అందరం చప్పట్లు కొట్టినట్టు, ఏం చేద్దాం బద్రర్. వాళ్లను ఏమనాలి? ఆ లెక్చరర్ గారికి నిజంగా అర్జెంట్ గా పది సన్మానాలు చేయాలి.  కాని ఎవరూ చేయరు. వారికి సరైన జీతాలు ఇస్తారా? ఇవ్వరు. ఆ కంపినీవారు లాభాలు చేసుకుంటారు. మొదటి నుంచి వందలదాకా రాంక్  లు బోలెడు తమ సంస్థకే వచ్చాయని చెప్పుకుంటున్నారు. కోట్ల రూపాయలు ప్రకటనలు చేస్తున్నారు. అవి చదివి ఇంకా కొన్ని లక్షల మంది ఐ ఎ ఎస్ లేదా ఐ పి ఎస్ చదువుకుంటున్నారు. వచ్చిందని రాలేదని ఎందరో నిరాశ పొందుతున్నారు కూడా. ఫెయిల్ అయిన వారు, దేవదాస్ వలె మందుగొట్టి, సాధించ లేని ఐ ఎ ఎస్ నిరాశలతో, మందుగొట్టకండి. ఆత్మహత్య చేసుకోకండి, యువతీయువకుల్లారా. బతకండి, దేశాన్ని నిలపండి. పోతే పోయింది ఐ ఏ ఎస్. కాని జీవితం గొప్పది.

అందుకని….

మీరంతా కార్మిక చట్టాలు లేవని తెలుసుకోండి. కంపినీల హక్కులు మాత్రమే ఉన్నాయని తెలుసుకోండి. నకిలీ కంపినీలు ఉంటాయి. కార్పొరేషన్ల మీద కార్పొరేషన్లు ఉంటాయి. మంత్రులు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. వాళ్ల మీద డజన్ల క్రిమినల్ కేసులు వస్తాయి. ఉంటాయి, పోవు. కింది కొర్టు, తరువాత హైకోర్టులు, తరువాత సుప్రీంకోర్టు ముందుకు వస్తాయి. నిన్నటి సుప్రీంకోర్టు కేసులు మళ్లీ హైకోర్టుకు వస్తాయి. అంతలో ఎన్నికలు వస్తాయి. మళ్లీ వీరి మీద కొన్ని పెరిగిన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏ డి ఆర్ పెద్దలు వార్తలు వ్యాసాలు రాస్తున్నారు. ప్రభుత్వాలకేంబట్టింది?

మళ్లీ భట్టీయం గొట్టే ఐ ఎ ఎస్ అధికారులైన వారు ఏమవుతారు? వారేంచేస్తారు? ఆ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులను ఆ ఐ ఎ ఎస్, (ఐ పి ఎస్ వారు కూడా) లు నోరుమూసుకుని వారు చెప్పినట్టు బుద్ధిగా (బుద్దిగా లేకుండా అందామా?) బతకాలి కదా మరి.

కనుక ఇప్పుడు అధికారంలో ఉన్నవారి ఆలోచనాసరళి ఏమంటే..

  • మనకు పెట్టుబడులు పెంచాలి, కనుక వాటికి అడ్డుగా ఉన్న కార్మాక హక్కులు పీకి పడేయ్యాలి.
  • ఇప్పుడున్న పాత ఉద్యోగాలు రక్షించంచే ప్రయత్నం చేయకండి.  కొత్త ఉద్యోగాలు ఇవ్వకండి.
  • ఇదివరకు డ్రైవర్ ఉద్యోగంలో ఉన్నవాడికి పెద్ద జీతాలు ఇవ్వకండి. ఓ 20 వేలో కొంచెం తక్కువే ఇవ్వండి. వాడు నోరుమూసుకుని పనిచేస్తాడులే.
  • కార్మికులు, వారి సంఘాలు, లేబర్ చట్టాలు, ఆఫీసర్లు ఏమిటా నాన్ సెన్స్. రెడ్ టేపిజం ఇక ఆపండి. ఈ చట్టాలు, దానిగురించి కేసులు పెట్టడం, సుప్రీంకోర్టుదాకా వాదించేయడం, ఏమిటా ప్రయాస? నాయకులు చెబుతున్నారు కదా? ఇంకా ఎందుకు రాయడం, వినడం. మే డే గురించి ఎర్ర జెండాలు, ఎర్ర ఎర్రి సినిమాలు. (ఎర్ర సైన్యం ఆర్.నారాయణమూర్తి గారూ, సారీ!). అన్నీ ఆపేయాలి.

కనుక ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్ 2020 అన్నారు. అంటే పరిశ్రమల సంబంధాల (మంచి అని నేను అనుకున్నాను. అది లేదు) కోడ్ అంటే బోలెడు చట్టాలు ఒక్క గుంప గుత్తగా హోల్ సేల్ చట్టాలు మార్చిపడేసారు. ‘‘తాంబూలాలు ఇచ్చేశాం. ఏం చేస్తారో చెప్పిచావండి’’ అని ఆ మహాభావుడు, మహాకవి  గురజాడ అప్పారావు 150 ఏళ్ల కిందట చెప్పిన పాత మాటనైనా వాడుకుంటున్నాం.

అంబేడ్కర్ కు దండాలు పెట్టుకుని, జనం అంతా అమెరికాకో దూబాయ్ కో పోతున్నారు. మేరా భారత్ మహాన్ అనుకొని నోరుమూసుకోవడం, పెన్ను మూసుకోవడం తప్ప ఏం జెద్దాం బ్రదర్. మే డే గుర్తుంచుకోండి.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

2 COMMENTS

  1. excellent article sridhar garu..

    Chandra Pratap
    former editor Vipula Chatura

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles