* సచిన్, యువరాజ్ సూపర్ షో
* సౌతాఫ్రికాపై భారత్ విజయం
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మరోసారి గతాన్ని గుర్తుకు తెచ్చారు. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ కు దూరమైనా తమలోని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని చాటుకొన్నారు.
రాయ్ పూర్ షాహీద్ వీరనారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఆరుదేశాల వరల్డ్ సిరీస్ రోడ్ సేఫ్టీ లెజెండ్స్ సిరీస్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో ముగిసిన మ్యాచ్ లో మాస్టర్ సచిన్, బ్లాస్టర్ యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించారు. తమదైన శైలిలో ఆడి అలనాటి రోజుల్ని గుర్తుకు తెచ్చారు. తమజట్టుకు 56 పరుగుల కీలక విజయం అందించారు.
Also Read : భారత్ కు నేడే అసలు పరీక్ష
వారేవ్వా! సచిన్
వీరేంద్ర సెహ్వాగ్ తో కలసి జంటగా భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన సచిన్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ తో తనకు తానే సాటిగా నిలిచాడు. తనకు మాత్రమే సొంతమైన చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. కేవలం 37 బాల్స్ లోనే 60 పరుగులతో కళాత్మక ఇన్నింగ్స్ ఆడాడు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించి పెట్టిన కళాత్మక స్ట్రయిట్ డ్రైవ్ తో వావ్ అనిపించాడు. ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదని తన ఆటతీరుతో చాటిచెప్పాడు.
రిటైర్మెంట్ తో గత కొద్ది సంవత్సరాలుగా క్రికెట్ కు దూరమైన సచిన్…లెజెండ్స్ సిరీస్ కోసం తిరిగి బ్యాటు చేతపట్టాడు. కేవలం సిరీస్ లోని మూడోమ్యాచ్ తోనే ఫామ్ ను అందిపుచ్చుకొన్నాడు. గ్రౌండ్ నలుమూలలకూ షాట్లు కొట్టి…ఎంతైనా మాస్టర్ మాస్టరేనని మరోసారి చాటి చెప్పాడు.
Also Read : విజయ్ హజారే టోర్నీలో టైటిల్ సమరం
యువీ సిక్సర్ల మోత
సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ సైతం వరుసగా నాలుగు సిక్సర్లు బాది…తన బ్యాటులో పవర్ ఏమాత్రం తగ్గలేదని చాటుకొన్నాడు. సఫారీ పేసర్ డి బ్రూయన్ బౌలింగ్ లో.. యువీ చెలరేగిపోయాడు. సిక్సర్ల మోత మోగించాడు. 21 బాల్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఆఖరి రెండు ఓవర్లలో యువీ చెలరేగిపోడంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.
సమాధానంగా 205 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన సఫారీజట్టుకు ఓపెనర్లు పుతిక్-వాన్ విక్ మొదటి వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే…భారత పేసర్ యూసుఫ్ పఠాన్ తన నాలుగు ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడు. సౌతాఫ్రికాజట్టు తన కోటా 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Also Readd : టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు
ఆరుజట్ల లీగ్ లో ఇప్పటి వరకూ మూడుమ్యాచ్ లు ఆడిన భారత దిగ్గజాలజట్టు బంగ్లాదేశ్, సౌతాఫ్రికాజట్లపై నెగ్గి …ఇంగ్లండ్ చేతిలో 6 పరుగుల ఓటమి చవిచూసింది. శ్రీలంక, వెస్టిండీస్ లెజెండ్స్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంది.