మాస్టర్ ఇ కె గా సుప్రసిద్ధులైన ఎక్కిరాల కృష్ణమాచార్య బహుముఖ ప్రతిభామూర్తి. అనంతమైన జ్ఞానసంపద ఆయన సొంతం. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది అభిమాన, శిష్యగణం ఆయన ఐశ్వర్యం. వారిని మహాత్మునిగా (గ్రేట్ సోల్)ఎందరో ఆరాధిస్తారు. ఆగస్టు 11 వ తేదీ ఈ పుణ్యపురుషుడి పుట్టినరోజు (11-8-1926). వీరి తండ్రి అనంతాచార్యులు, సోదరులు కూడా మహాప్రతిభామూర్తులు. మాస్టర్ ఇ కె నిన్నమొన్నటి వరకూ మన మధ్యనే నడయాడారు. వారిని బాగా ఎరిగినవారు, ఆయనతో కలిసి తిరిగినవారు ఇప్పటికీ ఎందరో మనమధ్యనే ఉన్నారు. ఆరుపదులు రాకముందే భౌతికంగా ఈ లోకాన్ని వీడివెళ్లినా (17-3-1984), వారి బోధనలు, సాధనలు, రచనలు, చేసిన గొప్ప కార్యాలు ఆయనను చిరంజీవిగా నిలబెట్టాయి.
Also read: వ్యధాభరిత కథావిశ్వనాధుడు
జగద్గురుపీఠం
మాస్టర్ ఇ కె పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తులు ఉత్సవం వలె జరుపుకుంటారు. ధ్యాన,యోగ సాధన చేస్తారు. తెలుగునాట ఈ వందేళ్లలో ఉద్భవించిన మహనీయులలో మహనీయుడు మాస్టర్ ఇ కె. ఆచార్యుడు, కవి, సాహిత్యవేత్త, ఆధ్యాత్మిక, యోగ గురువు, జ్యోతిష్యవేత్త, హోమియో వైద్యుడు. ఒకటేమిటి అనేక రంగాల్లో వారి ప్రజ్ఞ విరాజమానమై వెలుగులు పంచింది. 1971లో ఆయన స్థాపించిన ‘ వరల్డ్ టీచర్స్ ట్రస్ట్’ (జగద్గురు పీఠం) ఎందరి జీవితాల్లోనో వెలుగులు పంచింది. ఆయన గుంటూరు హిందూ కాలేజీలోనూ, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా తెలుగు పాఠాలు చెప్పారు. పాఠ్యాంశాలకు అతీతంగా విద్యార్థులకు జ్ఞానాన్ని పంచిపెట్టారు. తెనాలి రామకృష్ణకవి రాసిన ‘పాండురంగ మాహాత్మ్యం’ – కావ్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. తెనాలి రామకృష్ణ సారస్వతంపై జరిగిన పరిశోధనలలో మాస్టర్ ఇ కె పరిశోధన శిఖరసమానం. అది రామకృష్ణకవిని సర్వకోణాల్లో దర్శింపచేసే గొప్ప గ్రంథం.
తెలుగు,సంస్కృతం, ఇంగ్లిష్ భాషలలో సమప్రతిభ మాస్టర్ సొత్తు. వేదవేదాంగాలను అధ్యయనం చేశారు. అధ్యయనం చేయడమే కాదు అరటిపండు వలిచిపెట్టి అందించినంత సులువైన మార్గంలో అతి సామాన్యులకు కూడా అర్ధమయ్యేట్టు ఆ సారాంశాన్ని చెప్పేవారు. మంత్రశాస్త్రాన్ని అదే తీరున మధించారు. అనేక మంత్రాలను ఉపాసించి, మంత్రసిద్ధి పొందిన మహనీయునిగా ఆధ్యాత్మిక లోకంలో మాస్టర్ ఇ కె ప్రసిద్ధి చాలా గొప్పది. మాస్టర్ సివివి మార్గంలో యోగ సాధన చేశారు. ఎందరినో ఆ మార్గానికి దగ్గర చేశారు. పేదల పక్షపాతిగా తన ఆదాయాన్ని ఎందరికో పంచిన దానశీలి. యోగ, ధ్యానమార్గంలో ఎంత గొప్పవారో, సాహిత్యక్షేత్రంలోనూ అంతే గొప్పవారు. అసాధారణమైన ధారణ ఆయన అనుపమ ప్రజ్ఞలో ఒక పార్శ్వం. ఒక సందర్భంలో,’కవిసమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ చదివిన పద్యాలను విని, ఆ మరునాడే వాటిని అప్పచెప్పి, ఆ మహాకవిని సైతం ఆశ్చర్యజలధిలో ముంచిన ఘనత మాస్టర్ ఎక్కిరాలవారిది.
Also read: కవికోకిల జాషువా
బహుగ్రంథ రచన
ఎంతటి ధారణ ఉందో, అంతటి ధారాశుద్ధి బంధురమైన కవితాశక్తి కలిగినవాడు. చిన్ననాడే పద్యాలను అల్లడం ప్రారంభించాడు. వందల పద్యాలతో ‘రాసలీల’ కావ్యాన్ని చిన్న వయస్సులోనే ఆశువుగా చెప్పారు. ‘భగవద్గీత’ రహస్యాలపై రాసిన ‘శంఖారావం’ ఉత్తమోత్తమ వ్యాఖ్యాన గ్రంథం. ‘భాగవతం’ పై అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. ‘భాగవతం -రహస్య ప్రకాశము’ పేరుతో పుస్తకాలుగా నేడు అందుబాటులో ఉన్నాయి. జయదేవుని ‘గీతగోవిందం’ను ‘పీయూష లహరి’ పేరుతో తెలుగులో అనువాదం చేశారు. గోదావైభవం, పురుష మేధము, ఋతుగానం,అపాండవము, స్వయంవరం,లోకయాత్ర మొదలైనవి ఎన్నో వారి సుప్రసిధ్ధ రచనలు. ఐరోపాలోనూ విరివిగా పర్యటించి భారతధర్మాన్ని ప్రచారం చేశారు. వీరి కృషి ఫలితంగా జెనీవాలో ‘మొరియా విశ్వవిద్యాలయం’ ఏర్పడింది. మానవజీవితానికి ఎంతో అవసరమైన వైద్య,తత్వశాస్త్రాలను సమగ్రంగా అక్కడ బోధిస్తారు. భారతదేశ ఆర్ధిక పరిస్థితికి ‘హోమియోపతి’ వైద్యవిధానం బాగా సరిపోతుందని మాస్టర్ ఇ కె భావన. విశాఖపట్నంలోనే కాక,అనేకచోట్ల ఉచిత హోమియో వైద్యకేంద్రాలను ఆయన ఏర్పాటుచేశారు. హోమియోవైద్య శాస్త్రం అందరికీ అర్ధమయ్యేట్లుగా, ఎక్కువమందికి చేరాలనే తలంపుతో తెలుగు,ఇంగ్లిష్ రెండు భాషల్లోనూ రచనలు చేశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వీరు, తదనంతర జీవిత ప్రయాణంలో విశాఖపట్నంకు చేరారు. అక్కడ ఎందరో పిన్నలకుపెద్దలకు తలలోని నాల్కలా మారారు. వారి బోధనలు, ప్రసంగాల వీడియోలు, ఆడియోలు కొన్ని నేడు అందుబాటులో ఉన్నాయి. మహాప్రతిభామూర్తి, మహిమాన్విత శక్తి స్వరూపుడైన మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య వంటివారు లోకంలో చాలా అరుదుగా జన్మిస్తారు. లోకశ్రేయస్సు కోసమే జీవించిన మాస్టర్ ఇ కె భారతీయ రత్నం, తెలుగుతేజం.
Also read: కోటి దీపాల వెలుగు కొవ్వలి