- అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన సువేందు
- మమతపై తీవ్ర స్వరంతో సువేందు విమర్శలు
- అధికారమిస్తే బెంగాల్ తలరాతను మార్చివేస్తామన్న అమిత్ షా
పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా పర్యటనతో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీటలు వారుతోంది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు నడ్డా కాన్వాయ్ పై జరిగిన దాడితో పూర్తిగా దెబ్బతిన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతిభద్రతలపై సమీక్ష అంటూ బెంగాల్ పర్యటిస్తున్న అమిత్ షా తొలిరోజు బిజీ బిజీ గా గడిపారు. అందరూ ఊహించినట్లుగానే మమత కోటలో కీలక నేత అయిన సువేందు అధికారి మిడ్నపూర్ లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సభలో ప్రసంగించిన సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. రెండు దశబ్దాల పాటు తృణమూల్ కాంగ్రెస్ కు సేవలు చేశానని ఆత్మగౌరవం లేనిచోట రాజీపడి ఉండలేక పార్టీని వీడినట్లు తెలిపారు. కానీ ఇపుడు తృణమూల్ నన్ను వెన్నుపోటుదారుడిగా చిత్రీకరిస్తోందని సువేందు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సువేందు ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ హయాంలో బెంగాల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని, అవినీతి, నిరుద్యోగం పెరిగిపోయాయని సుబేందు ఆరోపించారు.
ఇదీ చదవండి: చిక్కుల్లో మమత
బీజేపీలో పలువురు ఎమ్మెల్యేల చేరిక
సువేందుతో పాటు మరో 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మరో మాజీ ఎంపీ బీజీపీలో చేరారు. ఎమ్మెల్యేలలో ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ కు చెందినవారు. ఎమ్మెల్యేలలో నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అదికారి, హల్దియా ఎమ్మెల్యే తపసి మండల్, తమ్లుగ్ ఎమ్మెల్యే అశోక్ దిండా, పురూలియా ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ, బుర్ ద్వాన్ ఎమ్మెల్యే సాయ్ కత్ పంజా, బర్రక్ పూర్ ఎమ్మెల్యే శీల్ భద్ర దత్త, గజోల్ ఎమ్మెల్యే దీపాలి బిశ్వాస్, నాగర్ కాట ఎమ్మెల్యే శుక్ర ముండా, కల్నా ఎమ్మెల్యే బిశ్వజిత్ కుందు నార్త్ కాంతి ఎమ్మెల్యే బన్సారి మైతిలు ఉన్నారు. బిష్ణోపూర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి శ్యామ ప్రసాద్ ముఖర్జీ, బుర్ద్ వాన్ పూర్బ ఎంపీ సునీల్ మండల్, మాజీ ఎంపీ దశరథ్ టిర్కీ బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు.
ఇదీ చదవండి: బెంగాల్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ
కష్టాల్లో తృణమూల్ కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ తాజా పరిణామాలు మమతకు సవాలుగా మారుతున్నాయి. తృణమూల్ లో సువేందు స్థానాన్ని భర్తీ చేసే మరో నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారనుంది. సువేందు పార్టీని వీడటం వల్ల తృణమూల్ కాంగ్రెస్ కు తీరని నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఇదీ చదవండి: బెంగాల్ ప్రిపోల్ సర్వేలో మమతకు ఎదురుదెబ్బ