- భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు
- నలుగురు ఉగ్రవాదుల హతం
కాశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో ఈ రోజు (మార్చి 22) ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. భద్రతాదళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. జిల్లాలోని మునిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో భారత ఆర్మీ, సీఆర్ పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల అనంతరం పరారైన మరికొందరు టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.ఆపరేషన్ పూర్తయినట్లు కశ్మీర్ ఐజీ స్పష్టం చేశారు.
కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న పాక్:
షోపియాన్ లోనే ఈనెల 16 న జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. భారత-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడవద్దని ఇటీవలే ఇరు దేశాలూ నిర్ణయించాయి. అయితే పాక్ ఉగ్రవాదులు మాత్రం రెచ్చగొడుతూ జమ్మూ కశ్మీర్ లోని జిల్లాల్లో అక్రమంగా చొరబాట్లకు పాల్పడుతున్నారు. పాక్ దళాల ప్రోత్సాహంతోనే ఉగ్రవాదులు సరిహద్దులను దాటి దేశంలోకి చొరబడుతున్నారని భారత ఆర్మీ సందేహాలు వ్యక్తం చేస్తోంది.
Also Read: కాల్పుల ఉల్లంఘనపై భారత్ పాక్ ల మధ్య కీలక చర్చలు
స్టీలు బుల్లెట్లను తట్టుకునేందుకు రక్షణ చర్యలు:
మరోవైపు సరిహద్దుల్లో ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా దళాల వద్దనున్న రక్షణ కవచాలను తుత్తునియలు చేసే స్టీలు తూటాలు ఉగ్రవాదుల వద్ద లభ్యం కావడంతో జమ్ము కశ్మీర్ భద్రతాదళాలు తమ వాహనాలు, బంకర్లకు అమర్చిన బులెట్ ప్రూఫ్ కవచాలను పటిష్ఠం చేసే పనిలో పడ్డాయి. ఈ నెల 16న పోషియాన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఘటనా స్థలం నుంచి సుమారు 40 రౌండ్ల స్టీల్ తూటాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చేపడుతున్న ఆపరేషన్లలో వినియోగిస్తున్న వాహనాలు, భద్రతా సిబ్బందికి అదనపు భద్రతను కల్పించనున్నారు.
Also Read: ఇండియా, అమెరికా రక్షణ మంత్రుల భేటీ