ఈ ఆంజనేయస్వామి విగ్రహం. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని బడుగులేరును ఆనుకొని వున్న పట్టాభిరామాపురం లోనిది. కొన్ని దశాబ్దాల క్రితం దీనిని ప్రతిష్ఠ చేశారు. నా పుట్టుకకు కారణమైన స్వామి ఈ మారుతిస్వామియే. ఒక కాశీపండితుని ఆజ్ఞ మేరకు మా అమ్మ మండలం పాటు ఈ మారుతిస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి గర్భము ధరించి నన్ను కన్నది. మా తల్లిదండ్రులకు పెళ్ళైన దాదాపు 30 ఏళ్ళ తర్వాత హనుమత్ ప్రసాదంగా నేను జన్మించాను. నేను పుట్టింది మా మేనమామ ఇంట గుంటూరు జిల్లా నరసరావుపేటలో. నరసరావుపేటకు కాస్త దగ్గరలోనే మా అమ్మగారి ఊరు కొప్పరం. నేను పుట్టిప్పుడు మా అమ్మ వయస్సు :40, నాన్నగారి వయస్సు :53. మా అమ్మ
కొప్పరపు సోదర కవులలో అగ్రజులు వేంకటసుబ్బరాయకవి చివరి కుమార్తె.
మా నాన్నగారు పట్టాభిరామాపురం మొదలైన ఊర్లన్నింటికీ కరణము, మునసబుగా చేసితిరి. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే (1983-84) ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల కరణీకంతో పాటు ఆ గ్రామాలతో కూడా మాకు బంధం తెగిపోయినది. ఇతఃపూర్వమే నా చదువుల గురించి మా గ్రామాలను వీడితిమి. కరణీకం వల్ల నాన్నగారి రాకపోకలు ఉండేవి. ఎన్టీఆర్ దెబ్బతో బంధం శాశ్వతంగా దెబ్బతిని పోయినది.
ఈ ఊర్లల్లో మాకు చాలా పొలమే ఉండేది. జమాబందీ మొదలు మా ఖర్చులన్నింటికీ మొత్తం హారతి కర్పూరమై పోయినది. నాన్నగారి దాన ధర్మములు, అతి మంచితనం వల్ల కూడా అంతా కోల్పోయాము. దీని వల్ల ఈ ఊర్లకు రావాల్సిన అవసరం కూడా తీరిపోయినది. కొంతకాలానికి ప్రకాశం జిల్లాతో అనుబంధం కూడా దూరమైపోయింది. అదొక సుదీర్ఘ ప్రయాణం! ఈ ప్రయాణాన్ని అట్లుంచగా, పట్టాభిరామాపురం ఆంజనేయస్వామితో వున్న మధురజ్ఞాపకాలు చిరంజీవిగా వున్నాయి. ఇటీవల రెండు మూడు సార్లు ఈ స్వామిని దర్శించుకొని పులకితగాత్రుడనైతిని. మా తాతలకాలం నుంచి అక్కడి గ్రామపాలన మాదే. మాఊరి వాసుల ఆలనాపాలనా కూడా మాదే. కులమతాలకు అతీతంగా, రాజకీయమైన గొడవలు లేకుండా,కరణంగారిపై ఎంతో గౌరవంతో మా ఊర్ల ప్రజలు ఉండేవారు. “ఈ ఊర్లో ఎక్కువ పొలమంతా మా కరణంగారిదే. దేవుడులాంటి మనిషి. మొత్తం పోగొట్టుకున్నారు” అంటూ మావూరి వాసులు మా సతీమణికి చెబుతూవుంటే… నా కళ్ళల్లో నీళ్లు సుడిగుండాలుగా తిరిగాయి. నేను వచ్చానని తెలుసుకొని మావూరి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మా దగ్గర కూర్చొని పాత విషయాలన్నీ మాతో పంచుకున్నారు. మారుతిస్వామిని దర్శించుకోవడానికి వెళ్లి, మాప్రాంతవాసుల ప్రేమస్పర్శను కూడా అనుభవించాము. మా ఊరు వదిలి 40ఏళ్ళయినా అదే అనురాగం… ఆ స్వామితో అదే అనుబంధం… మేము ఆస్తులు కోల్పోయినా… ఆనందానికి ఎప్పుడూ దూరమవ్వలేదు. ఉన్నదాంతో తృప్తిగానే వున్నాం. సంగీత,సాహిత్యాల ఆస్వాదనలో అనిర్వచనీయమైన అనుభూతులను అందుకుంటూనే వున్నాము. భవిష్యత్తులో ‘ఆత్మకథ’ రాస్తే, అప్పుడు నా బతుకుపుస్తకం రాస్తాను.