`ఏ వయస్సుకు ఆ ముచ్చట`అనే మాట పాతబడిపోయింది. పిల్లలకు పెళ్లిళ్లు కావడం, చేయడం కష్టతరమవుతోంది. కూతుళ్ల పెళ్లి చేయడానికి నానాకష్టాలు పడ్డారు కాళ్లకూరి నారాయణ రావుగారి `వరవిక్రయం`లోని పుణ్యమూర్తులు పురుషోత్తమరావు పంతులు. అందుకు భిన్నంగా కుమారుల పెళ్లిళ్ల కోసం అంతకు మించి అవస్థలు పడుతున్నారు నేటి తల్లిదండ్రులు.`ఆడపిల్లలుగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మంచిది`అనే సామెత తిరగబడుతోంది. ఒకవైపు ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న ప్రచారం, మరోవంక పెరిగి పోతున్న కోరికల చిట్టాతో సంబంధాలు ఒక పట్టాన కుదరడం లేదంటున్నారు. అన్ని అంశలూ ఒకే వ్యక్తిలో సమకూరడం అసాధ్యమనే సంగతి తెలిసినా సర్దుకుపోలేక పోతున్నారని వివాహపరిచయ వేదికల వారే అంటున్నారు. అటు తల్లిదండ్రులు ఇటు అబ్బాయిలు, అమ్మాయిల్లో రాజీపడలేని తత్వం. ఎవరి ప్రాధాన్యాలు వారివి. ఎవరూ ఎవరికి నచ్చ చెప్పలేని పరిస్థితి.
కొన్ని వృత్తుల వారికి సంబంధాలు కుదరడం కష్టంగా ఉందంటున్నారు. వాటిపై సామాజిక మాధ్యమాలలో లఘుచిత్రాలు కూడా వస్తు న్నాయి. అలాంటి వృత్తుల్లోని వారే తమ లాంటి వృత్తిపరులకు పిల్లలను ఇవ్వడానికి ఇష్టపడకపోవడం విచిత్రపరిణామం.
జాప్యానికి కారణాలెన్నో…
పెళ్లిళ్లకు జాప్యానికి కారణాలు ఎన్నో ఉన్నా ప్రధానమైనవి…ఆర్థికం, విదేశాలలోఉద్యోగం, జాతకాలు, కన్నవారి బాధ్యతలు..అని పలువురి అనుభవాలను బట్టి తెలుస్తోంది. ప్రతి ఆడపిల్లకూ, వారి తల్లిదండ్రులకూ ఈ పట్టింపులు అన్నీ ఉంటాయని చెప్పలేం కానీ వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుందని వనస్థలిపురం,న్యూనల్లకుంటలోని వివాహ పరిచయ వేదికల నిర్వాహకులు చెప్పారు. ఇటీవల కాలంలో జాతకాల పట్టింపు మరీ ఎక్కువగా ఉంటోందనీ, చాలా అంశాలలో సర్దుకుపోతున్న వారికి జాతకాల విషయంలో రాజీపడలేక పోతున్నారనీ కొందరు జ్యోతిష్యులే అంటున్నారు. జీవితభాగస్వాముల ఎంపికలో పిల్లల అభీష్టాలకే మొగ్గుచూపడం, కాదంటే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచన కూడా ఇంకో కారణంగా చెబుతున్నారు.
మరోవంక శాఖాంతర, కులాంతర సంబంధాలకు అభ్యంతరం లేదని `మ్యారేజీ బ్యూరో`ల్లో నమోదు చేసుకుంటూ తీరా అలాంటివి వచ్చేసరికి మనసు, మాట మార్చుకుంటుంటారని వాటి నిర్వాహకులు చెబుతున్నారు.
`పెళ్లంటే నమ్మకం…పెళ్లంటే జీవితం…`లాంటి సూక్తులకు కాలం చెల్లుతోంది. హార్దిక సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. యువతీయువకుల కుటుంబ నేపథ్యం, వారి రూపురేఖలు, పోషించడంలో శక్తి సామర్థ్యాల కంటే ఆర్థిక స్థితి ముందుంటోంది. ఒకవేళ సంబంధం కుదిరినా అదీ పీటల దాకా వెళుతుందనే నమ్మకం లేద నేందుకు అనేక ఉదాహరణలు.
ఒక అబద్ధం….
వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని లోకోక్తి. అన్నికాకపోయినా ఒక అబద్ధం ఆడితే పర్వాలేదన్న ధోరణి పెరిగిపోతోంది. అయితే, ఒక్కొక్క సారి కలసిరావడం లేదంటున్నారు. వయసు మీరి పోతున్నవారిని ఎలాగైన ఒక ఇంటివారిని చేయాలనే తాపత్రయంలో పుట్టిన తేదీలు, జనన సమయాల్లో మార్పులతో పరస్పరం సమాచారం పంచుకుంటుం టారని తెలుస్తోంది. తీరా అలా అందుకున్న వివరాలతో వాస్తవ తేదీలు, జనన సమయాలను సరిపోల్చుకుంటూ మనసుకు నచ్చచెప్పు కోలేకపోతున్నారని తెలుస్తోంది. `ఎంచుకుంటూపోతే వంకలు ఎన్నో`అనే `వరవిక్రయం` మాటలానే రాజీపడితేనే తోడు దొరకుతుందనిపిస్తోంది.
నిజమే! ఎంచటం మొదలు పెడితే ఎన్ని వంకలైన ఉంటాయి. జీవిత సత్యాలు, జీవిత సత్యాలే. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.