రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
వైదిక ధర్మంలో వేద మంత్రాలతో
అగ్ని సాక్షిగా జరిగేది వివాహం
ఆహూతులందరి ఆశీర్వచనాలతో
ఆచారాలతో, సాంప్రదాయాలతో
ఇద్దరు వ్యక్తుల మనసులను
వారి కుటుంబాల మధ్య సంబంధాన్ని
దగ్గర చేసేది వివాహం.
బాల్య వివాహాలు, కన్యా శుల్కాలు
సతీ సహగమనాలు గతకాలపు అవశేషాలు
కట్న కానుకలు మరుగున పడుతున్నాయి
మత, కుల వ్యవస్థలు కనుమరుగవుతున్నాయి
ఉమ్మడి కుటుంబాలు పోయి
చిన్న కుటుంబాలు మిగిలాయి.
వంటింటి కుందేలు రోజులు పోయి
పురుషులతో సమంగా స్త్రీలూ
ఉద్యోగ వ్యాపారాల్లో స్థిర పడ్డారు
ఆర్థిక ప్రగతి సాధించినా శాంతి, సహనం,
పిల్లల పెంపకం కుంటుపడుతున్నాయి.
కుటుంబంలోని పెద్దలను లగేజ్ గా భావించి
వృద్ధాశ్రమాలకు తరలించే రోజులు.
నీ డబ్బు, నా డబ్బు అని కాట్లాడే రోజులు
అలసిన బాంధవ్యాలు ముదిరి
పక్కదార్లు పడుతున్నారు కొందరు
మరి కొందరు సమాజం లెక్కలేదంటూ
అసహజ బంధాలకు సిద్ధమవుతున్నారు
వివాహ వ్యవస్థ మీదే అపనమ్మకంతో
సహజీవనం శ్రేయో మార్గ మనుకుంటున్నారు.
అన్నిటికీ మూల కారణం మితిమీరిన అహం
కోరికలకు హద్దులు లేక పోవడం
క్షమ, గౌరవం, నమ్మకం, ఓపిక తగ్గడం
మనిషి మీద కంటే డబ్బు మీద ప్రేమ పెరగడం
ఆధునిక యుగంలో యంత్రంలా మారడం
మనసును నియంత్రించలేక పోవడం
దానికి పగ్గం వేసే మతాన్ని పక్కకు తప్పించడం
మంచి చెప్పే పుస్తకాలు, గురువులకు దూరం కావడం.
ఎన్నో రకాల వివాహాలు
బహు భార్యలు, భర్తలు ఉన్నా
అన్యోన్యత చెడని సంసారాలున్న
ప్రాచీన సంస్కృతిని గుర్తు చేసుకుని
నేటి మన చిన్న కుటుంబ జీవితాలను
సుఖ సంతోషాలతో గడపలేమా
చంద్రుడికి పైకి లంఘించిన మన తరం
మన మనసులను అదుపు చేయలేమా?!
Also read: నీవే
Also read: గీత