Thursday, November 21, 2024

(World Wonderful Husbands) ప్రపంచ అద్భుత భర్తలు-2

 మాలీ పటేళ్ళ వ్యవస్థ. ఇక్కడ మరో మాట కూడా చెప్పవచ్చు, సైకిళ్ల  పైన ఎక్కి ఊరూరా ఫుల్లుగా తిరిగే కాలం. ఆ ఇంటిలో సైకిల్ ఉంది అంటే గొప్ప దొడ్డ కుటుంబం, బాగా కలవారి సంసారం, స్టేటస్ సింబల్ అనవచ్చు. ఇదీ పోయి . కొన్ని రోజులలో సైకిల్  స్థానంలో స్కూటర్లు వాడే కాలం మొదలయ్యింది. అంటే సైకిళ్ళు అందరి ఇళ్ళల్లోకి వచ్చాయి. స్కూటర్ లు / ఇంధనం తో నడిచే రెండు చక్రాల బళ్ళ తో  గ్రామాలకు రాకపోకలు సాగించే సమయం.

ఒక మాలీ పటేల్ అన్న వున్నాడు. 5 వ తరగతి (5 class)  వరకు చదివాడు. తండ్రి మరణం తో ఆ మాలీ పటేల్ గిరి (నౌకరీ/ ఉద్యోగం) కొడుకుకు ఆనవాయితీగా వచ్చింది. ఊర్లో అందరూ అతన్ని అన్నా.. అన్నా అని పిలుస్తారు. అన్నా అని ఎందుకు పిలుస్తారు అంటే… ఓ రోజు రాత్రి వేళ ఓ సభను ఆ మాలీ పటేల్ ఏర్పాటు చేసారు. ఆ రాత్రి సభలో ఆయుధాలు ధరించిన వారు ముగ్గురు మాట్లాడారు. మాలీ పటేల్ ను ” అన్నా” అని సంబోధించారు.  అన్న ఈ ఊరి కోసం చాలా చేస్తాడు. ఊరికి బస్ వచ్చేటట్లు చేస్తాడు. ఈ గ్రామానికి నీళ్ళు తెప్పిస్తాడు. ఈ గ్రామానికి ఏ కష్టం వచ్చినా ఇట్టే తీరుస్తాడు ఈ అన్న అని చెప్పారు. ఆనాటి నుండి ఆ ఊరికి మాలీ పటేల్ దొర అన్న అయ్యాడు. పెళ్లి కూడా చేసుకోకుండా  అందరికీ అన్న అయ్యాడు.

ఈ అన్న పేరు విని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ అన్న సహాయం సహకారం తీసుకొనేంతగా   ప్రచారం అయ్యింది. ఈ గ్రామానికి చుట్టూ ఉన్న 20 – 30 గ్రామాలలో జరిగే ఏ కార్యానికైనా  ఈ అన్న తప్పని సరిగా వెళ్ళాలి. చావు, పుట్టుకలు, పెళ్ళిళ్ళు, గొడవలు, భార్య – భర్తల తగాదాలు … ఇలా ఏవి జరిగినా ఆ పంచాయతీలో అన్న ఉండవలసిందే. పోలిస్ స్టేషన్ కు ఏదైన కేసు వెళ్ళినట్లయితే అక్కడా అన్న ఉండాల్సిందే. అన్న వెళ్ళలేక పోతే, అన్న వచ్చిన రోజే ఆ కేసు గురించి మాట్లాడాలి.

అన్నకు తీరిక లేకుండా బిజీగా ఉండే వాడు.

రాత్రి కీ పగలు కు తేడా అనేది తెలియనంతగా ఏదో ఒక పనిలో వుండేవాడు. ఒక రోజు భార్య భర్తల పంచాయతీ తెంపాల్సి వచ్చింది. ఆ ఇద్దరికి పెళ్ళయ్యి రెండు నెలలు కూడా కాలేదు. భర్త వట్టి తాగుబోతు. వయసు కూడా ఏమంత లేదు 20-23 వుండొచ్చు. భార్య వయసు 18-20 వుండవచ్చు.

భార్య కూలీకి పోవాలి, ఆ కూలీ తెచ్చి భర్త చేతిలో పెట్టాలి,  రాత్రి అయ్యింది అంటే భర్త పక్కలోకి ఆ భార్య పోవాలి. ఈ పద్దతి ఆ భార్యకు నచ్చలేదు. ఓ రోజు ఆ భార్య, భర్తను అడిగేసింది – కడిగేసింది …  ” నీవు నన్ను ఏలుతావు అని అవ్వ అయ్య నీకు ఇచ్చి పెళ్లి చేసిరి, నీవేమో పనికి పోవు, నన్ను కూలికి పంపుతావు, కూలీ తెచ్చి నీకు ఇవ్వాలి, రాత్రి కి నీ పక్కలోకి రావాలి, ఇదేనా ఏలుకోవటం అంటే …. ఈ రోజు నుండి నీ పక్కలకు రాను, కూలీ డబ్బులు తెచ్చి ఇవ్వను … గిదే మొగుడు – పెళ్లాం  ల పని అయితే నేను చేయను, కష్టం చేయాలి, నిన్ను సుఖ పెట్టాలి, నాతో కాదని అవ్వ అయ్య దగ్గిరకు ఆ భార్య వెళ్ళిపోయింది ” ఇదీ గొడవ.

ఆ ఊరి పెద్ద మనుషులు ఈ గొడవను తెంపే ప్రయత్నం చేసారు,  ఆ భార్య “నేనే కష్టం చేయాలి, కూలీ డబ్బులు తెచ్చి వాడి చేతిలోనే పెట్టాలి, రాత్రి అయ్యింది అంటే తాగుబోతు పక్కలోకి పోవాలి … నా నుంటి కాదు, ఈ మొగుడొద్దు … మొగుడు అని చూపించేది గీ పుస్తెలే (తాళి బొట్టు) కదా, ఆ తాగుబోతునే  తీసుకొమ్మను … అని తీసి ఇచ్చేసింది … అన్న దగ్గిరకు వెళ్తానని పంచాయతీ నుండి లేసి వెళ్ళిపోయింది ” … పంచాయతీ లో కూసున్న పెద్దలు లేసి తలో దిక్కు వెళ్ళిపోయారు.

రెండు రోజుల తరువాత అన్న పంచాయతీ పెట్టాడు. భార్య – భర్తల తో పాటు ఊరి పెద్ద మనుషులూ కూర్చున్నారు. భార్య మళ్ళీ మొదటి నుండి చివరి వరకు జరిగింది చెప్పింది. భర్త పంచాయతీ పెద్దలకు చెప్పిందే అన్నతో చెప్పాడు ” భార్య అంటేనే కష్టం చేయాలి, పక్కలోకీ రావాలి …” ఇదే కదా అన్నా అని. వెంటనే భార్య,  అన్న వీడి మాటలు గివే వున్నాయి, నాకు వీడు నచ్చలేదు, నీకు ఓ చిన్న మాట చెప్పిన తరువాత,  ఇంకోడిని చేసుకుందామని, ఊరు ఏమి కరువు పోలేదు అన్నా అని అన్నది.

అన్న .. ఇంకోడిని అప్పుడే చేసుకుంటే పోలీసులు కేసు పెడతారు అంటే … ఆ భార్య ఆ పోలీసు ఆయనకు గీదే చెపుతాను అన్నా, అయినా ఆ పోలీసు ఆయన నన్ను ఏమైనా నడుపుతాడా / ఏలుకుంటడా?

గవన్నీ నీవే చూసుకో ఆన్నా… నా కైతే గీ మొగుడు వద్దు …. పంచాయతీ అయిపోయింది.

రెండు రోజులలో  ఆ భార్య – భర్త లిద్దరూ మరో పెళ్ళి చేసేసుకున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అన్న తనలో తానే నవ్వుకున్నాడు.

……  అజీబ

Also read: World Wonderful Husbands (ప్రపంచ అద్భుత భర్తలు) -1

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles