రామాయణమ్ – 74
రావణుడి ఆజ్ఞ విని మారీచుడు అంతే పరుషముగా బదులిచ్చాడు.
‘‘నీవు, నీపుత్రులు, నీఅమాత్యులు, నీ రాష్ట్రము సకలము నాశనమయ్యేటట్లు ఏ పాపాత్ముడిచ్చాడు నీకీ సలహా! కోరికోరి మృత్యుద్వార ప్రవేశము చేయాలనుకుంటున్నావు. నీకు సరి అయిన సలహా ఇచ్చే మంత్రులే కరవైనారే! రావణా ఇంత తీక్ష్ణ స్వభావముగల నీ పాలనలో ప్రజలంతా కూడా నక్కచేత కాపలా కాయబడే గొర్రెల వంటి వారు. వారికింకా వృద్ది ఎక్కడ?
Also read: మారీచుని చంపుతానని బెదిరించిన రావణుడు
నేను ఎలాగూ రామునిచేతిలో చంపబడతాను. ఆ తరువాత కొంతకాలానికే నీ వంతుకూడా వస్తుంది. నేను ఆయన చేతిలో చనిపోవడానికే నిశ్చయించుకున్నాను. రాముడి చూపు నా మీద పడనంతవరకే నా ప్రాణాలు ఈ శరీరములో ఉంటాయి. ఒక్కసారి ఆయన నన్ను చూశాడా ఇక ఆ క్షణమే నా జీవితపు చివరి క్షణము’’ అని పలుకుతూ దీనముగా ఇక వెళదాము పద అంటూ రావణుడితో బయలుదేరాడు మారీచుడు.
అప్పుడు రావణుడు ఆనందముగా మారీచుని కౌగలించుకొని తన రధము మీద కూర్చుండ బెట్టుకొని రామాశ్రమ సమీపములోకి చేరాడు.
Also read: రావణుడికి మారీచుడి హితబోధ
విమానము వలెనున్న ఆ రధము దిగి పరిసరాలను గమనిస్తూ ఆశ్రమము వైపు దృష్టి సారించాడు. ‘‘మారీచా! అదుగో ఆ అరటి చెట్లు పెరిగివున్నదే ఆ ప్రదేశము. అదే శ్రీరాముని ఆశ్రమము. నీవు త్వరగా పనిపూర్తిచేయాలి సుమా’’ అని హెచ్చరించి పంపాడు.
మారీచుడు ఒక అందమైన లేడి రూపము ధరించాడు. ఆ మృగానికి అందమైన కొమ్ములున్నాయి. ఆ కొమ్ముల చివరలు మణికాంతులతో మెరిసిపోతున్నాయి. ముఖము కొంత తెలుపు, కొంత నలుపు. దాని ముఖము ఒక చోట ఎర్రని పద్మమువలె మరియొక చోట నల్లకలువలాగా ఉన్నది. దాని చెవులు ఇంద్రనీలాల మణులా అన్నట్లుగా భాసిస్తున్నాయి. మెడ కొంచెము ఎత్తుగా ఉండి క్రింది దవడ ఇంద్రనీల మణి లాగా మెరుస్తూ ఉన్నది. దాని పొట్ట మల్లెపూవులాగా, చంద్రుడులాగా, వజ్రములాగా ప్రకాశిస్తూ ఉన్నది. దాని శరీరము కొంత భాగము ఇప్పపూవు రంగులో, కొంత భాగము పద్మ కేసర వర్ణముతో మెరిసిపోతూ ఉన్నది. సన్నటి పిక్కలతో తళతళ మెరిసే రంగుతో పొందికైన అవయవములతో చూడగానే స్వంతము చేసుకోవాలన్న భావన ఎంతవారికైనా కలిగించేదిగా ఆ మృగము ఉన్నది.
Also read: సీతాపహరణానికి రావణుడిని ప్రేరేపించి
ఆ మాయా మృగము చెంగుచెంగున గంతులు వేస్తూ సీతారాముల ఆశ్రమ ప్రాంతములో సంచరిస్తున్నది. అది గంతులు వేసినప్పుడల్లా సూర్యకాంతి దాని శరీరము మీదనుండి ప్రతిఫలించి వింత వింత శోభలతో అలరారుతున్నది. ఎలాగైనా సరే సీతాదేవి కంట్లో పడాలనే తాపత్రయముతో ఆశ్రమ పరిసరాలలోకి వెళుతున్నది. మరల బయటకు వస్తున్నది. సీతమ్మ వచ్చే అరటిచెట్ల దగ్గరే తిరుగాడుతూ సీతాదేవి దృష్టి పడేటట్లుగా దూకుతున్నది. హఠాత్తుగా గంతులు వేసి గుండ్రముగా తిరుగుతున్నది. దాని హొయలు, వయ్యారము చెప్పనలవి గాకుండా ఉన్నది.
తోటి మృగాలు దాని వద్దకు వచ్చి వాసన చూసి గాభారాపడి తప్పుకుంటున్నాయి. మృగాలు దగ్గరకు వచ్చినప్పుడు తినాలని వాటిమీద కోరిక కలిగినప్పటికీ నిగ్రహించుకుంటున్నాడు మారీచుడు. ఆ సమయములో పూలుకోసుకోవడానికి సీతాదేవి ఆశ్రమము నుండి బయటకు వచ్చింది. అదే సమయములో ఆమె కళ్ళముందు ఏదో మెరుపు మెరిసినట్లయి అటువైపు చూసింది. అప్పుడు ముత్యములచేత, మణులచేత సహజసిద్ధముగా అలంకరింపబడి ప్రకాశించే మృగము ఆవిడ కంట పడ్డది.
Also read: రావణాసురిడిన తూలనాడిన శూర్పణఖ
సీతాదేవి ని చూడగానే ఆ మాయామృగము ఇంకా చిత్ర విచిత్ర గతులతో విన్యాసాలు చేసింది. మధురముగా కూసింది. ఆహ్లాదకరంగా ఆడింది. ముద్దులు ఒలకబోస్తూ గిరగిరా తిరిగింది. భూమి మీద పడుకొని వళ్ళు విరుచుకొని శరీర సౌందర్యమంతా సీతాదేవి కళ్ళలో పడేటట్లుగా అటూఇటూ మెదిలింది.
అ మృగాన్ని చూడగానే బిగ్గరగా కేక వేసి రామలక్ష్మణులను పిలిచింది సీతమ్మ. ఆ మృగాన్ని చూడగానే వీడు మారీచుడే అని గుర్తుపట్టాడు లక్ష్మణుడు. ‘‘అన్నా వీడు నిస్సందేహముగా మారీచుడే. వేటకు వచ్చిన రాజులను భ్రమింప చేసి రకరకాల మృగ రూపాలు ధరించి వారిని సమీపించి వారు మొహములో పడి దగ్గరకు రాగానే వారిని చంపి భక్షించే వాడు. అది వాడి చరిత్ర. ఇది వాడి ఐంద్రజాలమే! రామా ఎక్కడైనా మణిమాణిక్యాలు, రత్నాలు సహజముగా పొదగబడ్డ మృగము సృష్టిలో ఉంటుందా?’’ అని పలుకుతున్న లక్ష్మణుని మాటలకు అడ్డు తగిలి సీతమ్మ ఇలా పలికింది.
Also read: సీతను రావణుడు అపహరించాలని
వూటుకూరు జానకిరామారావు