(ఇన్సెట్: అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్స్ జానయ్య, రషీద్
హైదరాబాద్ : యాదాద్రిజిల్లా అడ్డగూడూరు పోలీసుల కస్టడీలో మరణించిన దళిత మహిళ మరియమ్మ మృతిపైన న్యాయవిచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు గురువారంనాడు ఆదేశించింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టి. వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం ప్రకటించింది. ఆలేరు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణ జరిపి సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని చెప్పింది. అవసరమని భావిస్తే మరియమ్మ శవపరీక్షను మళ్ళీ చేయాలని, ఆ నివేదికను కూడా సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
మరియమ్మ లాకప్ డెత్ పై విచారణకు ఆదేశించాలని, ఆమె కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించి, మరియమ్మ మరణానికి కారకులైన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్)ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జయవింధ్యాల తరఫున పి. శశికిరణ్ వాదించారు. దొంగతనం ఆరోపణపై మరియమ్మనూ, ఆమె కుమారుడినీ, అతడి స్నేహితుడినీ జూన్ 16న అడ్డగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారిని చిత్రహింసలకు గురిచేసినట్టు పిటిషనర్ ఆరోపించారు. హింసకు తట్టుకోలేక మరియమ్మ పోలీసు స్టేషన్ లోనే ఈ నెల 18న చనిపోయిందని పిటిషన్ అన్నారు. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కోర్టుకు అందజేశారు.
అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఘటనపైన మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందనీ, స్థానిక ఆర్డీవో విచారణ జరుపుతున్నారనీ చెప్పారు. హింసకు పాల్బడిన పోలీసు అధికారులను గుర్తించి వారిని సస్పెండు చేశామనీ, వారిపైన డీఎస్ పీ స్థాయి అధికారి విచారణ జరుపుతున్నారని కూడా ఏజీ తెలిపారు. శవపరీక్ష ప్రక్రియను విడియో తీసిన తర్వాత మరియమ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు ప్రసాద్ తెలిపారు.
పోలీసు కస్టడీలో మహిళ మరణించినా, అత్యాచారానికి గురి అయినా ఒక జుడీషియల్ మెజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని సీఆర్ పీసీ 176(1)(ఏ) చెప్పిందని ధర్మాసనం ఏజీకి గుర్తు చేసింది. ఈ నిబంధనను పట్టించుకోకుండా ఆర్డీవోతో విచారణ జరిపించడం అక్రమమని కోర్టు నిర్ధారించింది. అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లో సీసీ కెమెరాలు ఇంకా అమర్చలేదని అడ్వకేట్ జనరల్ చెప్పినప్పుడు కోర్టు ఆగ్రహం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేసింది.
నివేదిక పంపండి: జాతీయ ఎస్పీ కమిషన్ ఆదేశం
మరియమ్మ మరణంపైన వివరాలు పంపాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నీ, డీజీపీని, భువనగిరి డీసీపీని గురువారంనాడు జాతీయ ఎస్పీ కమిషన్ ఆదేశించింది. అంతే కాకుండా దిల్లీలో కమిషన్ జరిపే విచారణకు హాజరు కావలసి ఉంటుందని కూడా ఉన్నతాధికారులకు కమిషన్ స్పష్టం చేసింది. మరియమ్మ హంతకులకు కఠిన శిక్ష విధించాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.