హైదరాబాద్: మావోయిస్టు మిలటరీ కమిషన్ మెంబర్, కీలక మావోయిస్టు నేత దుబాషీ శంకర్ అలియాస్ మహేందర్ అలియాస్ అరుణ్ అలియాస్ రమేష్ లను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు. అతనితో పాటు ఛత్తీస్ గఢ్ కు చెందిన ఏరియా కమిటీ సభ్యుడు కిరణ్ ను కూడా అరెస్టు చేశారు. శంకర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిరణ్ తో కలిసి మంగళవారం వైద్యం కోసం ద్విచక్ర వాహనంపైన కోరాపుట్ బయలుదేరారు. బైపర్ గూడా గ్రామం దగ్గర పోలీసులు వీరిని అరెస్టు చేశారు. శంకర్ పైన ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డు ప్రకటించింది. శంకర్, కిరణ్ లను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఏఓబీ ఎస్ జెడ్ సీ కార్యదర్శి గణేశ్ విజ్ఞప్తి చేశారు.
దుబాషి శంకర్ స్వస్థలం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చేట్ల నర్సంపల్లి. 1987 లో ఇందుప్రియల్ ఏరియా కమిటీ లో చేరారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా పనిచేశారు. ప్రస్తుతం స్టేట్ మిలటరీ కమిషన్ మెంబర్ గా శంకర్ పనిచేస్తున్నారు. పలు కీలక మావోయిస్టు ఆపరేషన్ లలో పాల్గొన్న శంకర్ పైన తెలంగాణ తో సహా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ లలో 40 కు పైగా కేసులున్నాయి.