తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 14వ భాగం
(గత వారం తరువాయి)
ఒక లక్ష్యం ఒక సుగమ్యం – ఒక ధ్యేయం ఉన్న వారు ఏ రంగంలో ఉన్నా వారు ముందుకు సాగుతారు! సమాజాన్ని ప్రగతిబాట వైపు సాగేటట్టు చేస్తారు! వారినే “క్రాంతదర్శులు“ అంటాము!
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఇలాంటి ఉన్నతాశయాలు, ఉత్తమ ఆలోచనలు ఉన్న దర్శక నిర్మాతలున్న చిత్రసీమలో అడపాదడపా అయినా మేలుబంతి వంటి ప్రగతి భావనాపూర్వక చిత్రాలు వస్తుండడం వల్లనే!
Also read: దాసరి నారాయణరావు దార్శనికత
చిత్రసీమలో ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో 1950 పూర్వార్ధంలో “మాలపిల్ల“ వంటి ప్రగతిభావన చిత్రాలకు అంకురార్పణ జరిగింది. ఇది సినిమాకున్న శక్తిని ప్రతిబింబించిన ప్రయోగంగా చెప్పుకోవాలి.
సినిమా అనేది కేవలం వినోదం కోసమే కాదు. ప్రజా ప్రయోజనం కోసం. అంటే ప్రేక్షకులలో ఆలోచనలు, వర్తమాన సమాజం గురించి ఆలోచనలు రేకెత్తించే సాధనంగా ఉండాలన్న హెచ్చరికతో తీసిన చిత్రాలను ప్రజలు ఆదరించారు! హర్షించారు!
ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం! కేవలం ప్రగతి భావనలో ఉన్న చిత్రాలతో సమాజంలో అభ్యుదయం రావడానికి మార్గదర్శకాలు అవుతాయా? ఎంతో మందికి ఈ సందేహం రావడం సహజం! దానికి జవాబు విపులంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది!
Also read: టి. కృష్ణ బాటలో నడిచిన ధవళసత్యం, వేజెళ్ళ
ప్రాథమికంగా.. బడికి వెళ్ళే పిల్లలకు ఆరంభంలో మిగిలిన విషయాలతో పాటు (సబ్జెక్ట్స్) కొన్ని నీతి వాక్యాల వంటివి, సూక్తుల వంటివి చెప్పడం మనకు తెలిసిందే.
అబద్ధం ఆడరాదు అనే నీతి వాక్యానికి హరిశ్చంద్రుడి కథ చెబితే, ఆ సూక్తిని మరిచిపోయే అవకాశం ఉండదు. అది ఆ కథకున్న శక్తి.
అలాగే సమాజంలోని హెచ్చుతగ్గులు అంతరించి అందరూ సమభాగ్యంతో బతకాలి అన్న మాట చెప్పినప్పుడు అది నినాదంగా వినిపిస్తుంది. ఆ నినాదాన్ని దృశ్యరూపంలో చూపించినప్పుడు ప్రేక్షకుల మీద బలమైన ముద్ర వేస్తుంది. కొందరిలో అయినా ఆ దిశగా ప్రయాణించే ప్రయత్నాన్ని కలిగించడానికి మార్గదర్శకం అవుతుంది. ఇది ప్రగతిభావన కలిగిన చిత్రాల ప్రభావం అని చెప్పవచ్చు.
Also read: అప్రతిహతంగా సాగిన ‘ప్రతిఘటన’
సాహిత్యమే మార్గసూచిక: గతంలో కొన్ని కావ్యాలలో “అభ్యుదయ పరంపరాభివృద్ధిరస్తు“ అన్నది కనిపించేది. ఇక్కడ అంటే ఈ కావ్యాలలో ఉదహరించిన వాక్యం అందరూ అభివృద్ధి అన్నివిధాలుగా చెందితే సమాజం శ్రేయోదాయకంగా వర్ధిల్లుతుందని.
దేశ, కాల, మాన పరిస్తితులబట్టి ఈ అభ్యుదయం అనే మాటకు అర్థం మారుతూ వస్తోంది. ఒకప్పుడు వ్యక్తి కేవలం తన సుఖ సంతోషాలనే కోరుకుంటే, కాలక్రమేణా తోటివారి మంచిని కూడా కోరుకోవడం ప్రారంభమైంది. దీన్నే సమాజ శ్రేయస్సు అనవచ్చు. ఈ భావన కలగడానికి కొంతలో కొంత అయినా సాహిత్యం దోహదకారి అయింది అనడంలో ఎవరికీ ఆక్షేపణ ఉండక్కర్లేదు.
శత జయంతి జరుపుకున్న “మహాకవి గురజాడ కన్యాశుల్కం“ ఆయన నిజానికి ప్రదర్శన కోసం వ్రాసింది కాదు అది పూర్తిగా ప్రదర్శించాలంటే కనీసం 8 గంటలు పడుతుంది. ఈ సంగతి ఆయనకు తెలియదా? అయితే నాటి సంఘంలోని కొన్ని సామాజిక వర్గాలలోని మూఢ విశ్వాసాలను, దురాచారాలను, పది మంది దృష్టిలోకి తీసుకురావడానికి నాటక రచన ప్రభావవంతమైనది అని గ్రహించే కన్యాశుల్కం వ్రాయడం జరిగింది. అయితే తరువాతి రోజుల్లో ఆ నాటకం పాఠకులలో అశేష ఆదరణ పొందడంతో క్రమంగా కొందరు అభ్యుదయవాదులు ఆ నాటకంలోని కొన్ని ముఖ్య భాగాలను ప్రదర్శించడం ఆరంభించారు. నాటకంలో ఆత్మ, నాటకంలోని విలువలు అదృశ్యమైపోకుండా క్రమంగా నాటక ప్రదర్శనలకూ ఆదరణ లభించడం విశేషం!
ఇది ఎందువల్ల జరిగింది అంటే ప్రేక్షకులలో కేవలం వినోదం కోసం వచ్చేవారిని కొంత మందిని పక్కనబెడితే మిగిలిన వారు ఆ నాటకంలోని సందేశాన్ని సమగ్రంగా, అర్ధం చేసుకున్న వారు అనడం అతిశయోక్తి కాదు!
Also read: పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి
ఏ ప్రగతి లేదా అభ్యుదయ భావన అయినా సంఘాన్ని, అందులోనూ కొన్ని కరడుగట్టిన భావాలతో ఉన్న సమాజాన్ని, రాత్రికి రాత్రే మార్చివేస్తుందన్నది భ్రమ! అలాగని ఆరంభించకుండా ఉండటం నిరాశా వాదాన్ని తెలుపుతుంది!
అలాగే సాహిత్యంలో వచ్చిన కన్యాశుల్కం, వరవిక్రయం మొదలైన రచనలు ఆనాడే ప్రగతి కిరణాలు వెదజల్లిన ఇతివృత్తాలు.
ఆ తరువాత మారుతున్న కాలంతోపాటు సమకాలీన సమస్యల గురించి అనేక రచనలు వెలువడటం అందరికీ తెలిసిందే! ఈవిధమైన అభ్యుదయ భావాలున్న రచనలు కొన్ని చలనచిత్రాలుగా పరివర్తన చెందాయి.
అందులో కొన్నిటిని పరిశీలించినప్పుడు పి. శ్రీదేవి వ్రాసిన కాలాతీత వ్యక్తులు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ వ్రాసిన బలిపీఠం, డి. కామేశ్వరి కోరికలే గుర్రాలయితే, న్యాయం కావాలి, భూషణ్ వ్రాసిన కొండగాలి, వాసిరెడ్డి సీతాదేవి సమత (ఇది వామపక్ష భావాలున్న రచన), ఇలా దాదాపు 50 రచనలు, ప్రగతిభావన ఇతివృత్తంతో వ్రాసినవి వెండితెర చిత్రాలుగా రావడం జరిగింది. ఇంకా వస్తున్నాయి అని చెప్పవచ్చు!
అందుచేత ప్రగతి ఇతివృత్తంతో వచ్చిన చిత్రాలకు సాహిత్య ప్రక్రియ ఎంతగానో దోహదం చేసింది అనవచ్చు!
Also read: మాదాల రంగారావు ప్రగతిశీల చిత్రాల ప్రస్థానం
ఇతర భాషల్లో అభ్యుదయ చిత్రాలు
ఒక్కసారి ఇతర భాషల్లో వచ్చిన కొన్ని అభ్యుదయ భావనలున్న చిత్రాలను పరిశీలిద్దాం!
తమిళ చిత్రాలు: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నిర్దేశకత్వంలో తమిళంలో 1973లో వచ్చిన దిక్కట్ర పార్వతి (దిక్కులేని పార్వతి) రాజాజీ రచన. ఇందులో ప్రముఖ నటి లక్ష్మి కథానాయిక పాత్ర పోషించడం జరిగింది. ఆ తరువాత ఇలాంటి ధోరణిలోనే వచ్చిన సిలం నేరంగళ్ సిలమని దరగళ్ (1977) (జయకాంతన్ రచన). సిరై (1984) అనూరాధ రమణన్ రచన. 1996లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన అందిమందారం.
ఇటు ప్రేక్షకులు, అటు ప్రభుత్వం మెచ్చిన విశారణై (2016) చిత్రం దర్శకుడు వెట్రిమారన్. ఈ చిత్రం ఎం. చంద్రకుమార్ వ్రాసిన లాక్ అప్ రచన ఆధారంగా నిర్మించడం జరిగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి బహుమతి అందుకోవడం విశేషం.
ఇప్పటికీ నూతన తరం నిర్మాత, దర్శకులు తమిళంలో ప్రోగ్రెసివ్ ధోరణులున్న చిత్రాలను నిర్మించడానికి కొందరు ముందుకు వస్తుండటం హర్షదాయకం. అలాగే 1977లో జాన్ అబ్రహాం దర్శకత్వంలో వచ్చిన అగ్రహారత్తిల్ కళిదే చిత్రం అటువంటిదే.
Also read: అభ్యుదయ భావాలకు ప్రతిరూపం మాభూమి
కన్నడ భాషలో నిర్మించిన ప్రగతివాద చిత్రాలు: తెలుగులో అధివాస్తవిక కవిగా పేరుపొందిన పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) వ్రాసిన కవితలు ఫిడేలు రాగాలు డజన్, అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి! విద్యాధికుడు, విశాల భావాలు గలవాడు, ఆదర్శాలను ఆశయాలను ఆచరణలో చూపిన అభ్యుదయ వాది అయిన పట్టాభి నిర్మాత, దర్శకుడుగా కన్నడ చిత్రరంగంలో తన చిత్రాల ద్వరా ప్రగతిభావ చిత్రాలకు మార్గదర్శి అయ్యారని చెప్పవచ్చు.
పట్టాభి సారథ్యంలో వచ్చిన చండమారుత (1977) కన్నడ ఇంగ్లీషు భాషల్లో నిర్మాణమైంది. ఎమర్జన్సీ కాలంలో ఈ చిత్రం నిషేధానికి గురి అయి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రముఖ కన్నడ నాటకకర్త పి. లంకేష్ వ్రాసిన క్రాంతి బంతు క్రాంతి నాటకం ఆధారంగా నిర్మించబడిన ఈ చండమారుత చిత్రం తరువాతి కాలంలో అభ్యుదయ భావాలున్న దర్శక నిర్మాతలకు మార్గసూచి అయింది.
మరో ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్. అనంతమూర్తి వ్రాసిన నవల ఆధారంగా నిర్మాతగా దర్శకునిగా 1970లో పట్టాభి సంస్కార చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి నేటి ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విశేషం.
కన్నడ చిత్రరంగ ప్రముఖులు గిరీష్‌కర్నాడ్, పి. లంకేష్, పట్టాభి శ్రీమతి నటి, సోషల్ వర్కర్ అయిన స్నేహలతారెడ్డి ఈ సంస్కార చిత్రంలో ప్రధాన భూమికలు పోషించడం జరిగింది.
Also read: వ్యవసాయం ఇతివృత్తంగా అనేక సినిమాలు
సంస్కార చిత్రానికి కేంద్ర ప్రభుత్వ “స్వర్ణకమలం“ అవార్డుతోపాటు ఉత్తమ దర్శకుని బహుమతి కూడా అందుకోవడం ఈ చిత్ర విశేషం! మానవ సంబంధాలను విశ్లేషిస్తూ మనుషుల మధ్య జాతి, మత, కుల భేదాలు సమసిపోవాలని ప్రబోధించే చిత్రం సంస్కార!
ఈ సమాంతర చిత్రాల వరుసలో 1972లో విడుదలై విమర్శకుల ప్రేక్షకుల అభినందనలు పొందిన చిత్రం ప్రముఖ కన్నడ రచయిత ఎస్.ఎల్. బైరప్ప వ్రాసిన వంశవృక్ష ఆధారంగా అదే పేరుతో నిర్మితమైన వంశవృక్ష చిత్రం!
సమాజంలోని సాంఘిక సమస్య ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్ర కథ, ప్రయోజనాత్మకమైనది అని చెప్పాలి. అగ్రకులం, నిమ్నకులం అని సాంఘిక భేదాలను సృష్టిస్తున్న వారికి ఈ చిత్రం చక్కని జవాబు చెబుతుంది!
సామాజిక సందేశంతో విడుదలైన వంశవృక్ష చిత్రం 1972 సంవత్సరపు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ బహుమతి అందుకుంది. అలాగే చిత్ర దర్శకులు అయిన బి.వి. కరంత్, గిరీష్ కర్నాడ్‌లు ఉత్తమ దర్శకత్వ బహుమతి అందుకోవడం విశేషం!
ఈ చిత్రం మరో విశేషం ఏమంటే ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు బాపు, తెలుగులో నిర్మించి విజయం పొందారు. మరో ఆసక్తికరమైన సంగతి ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ ఈ చిత్రంతోనే చిత్రరంగ ప్రవేశం చేయడం విశేషం!
Also read: ప్రతి ప్రయత్నం ఒక వియత్నాం
ప్రముఖ కన్నడ, తెలుగు కథానాయిక సౌందర్య 2002లో నిర్మించిన ద్వీప చిత్రం, ప్రసిద్ధ దర్శకుడు గిరీశ్ కాసరవెల్లి దర్శకత్వంలో విమర్శకుల, ప్రేక్షకుల అభినందనలు పొందింది. మానవ సంబంధాలతో పాటు పుట్టి పెరిగిన పరిసరాల మీద కూడా అనుబంధం ఎలా ఉంటుందో సున్నితంగా, సునిశితంగా తెలియచేసిన చిత్రం ద్వీప. ఈ చిత్రంలో సౌందర్యతో పాటు అవినాష్, తెలుగు వారికి పరిచయమైన చోమనదుడి వాసుదేవరావు వంటి ప్రముఖులు నటించడం జరిగింది.
సమాంతర చిత్రాలుగా కొందరు అభ్యుదయ భావాలున్న నిర్మాత, దర్శకుల చిత్రాలు నేటికీ కన్నడ రంగంలో నిర్మించబడటం, అవి ప్రశంసలు పొందడం జరుగుతోంది.
పైన ఉదహరించిన (కన్నడ) చిత్రాలే కాదు ఇంకా చెప్పుకోవలసిన ప్రగతిశీల చిత్రాలు కన్నడ చిత్రరంగంలో మరెన్నో ఉన్నాయి.
మళయాళ చిత్రరంగం: దక్షిణాది చిత్రరంగంలో మొదటి నుంచి ఇటువంటి చిత్రాల నిర్మాణంలో ముందడుగులో ఉన్న మళయాళ చిత్రరంగం పొరుగున ఉన్న మిగతా భాషల చిత్ర రంగాలకు మార్గదర్శిగా నిలబడింది అంటే ఎవరికీ ఆక్షేపణ ఉండనక్కర్లేదు.
ఈ సందర్భంగా కొన్ని చిత్రాలను పరిశీలించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలతోపాటు మరికొన్ని కుతూహలం కలిగించే సంగతులు తెలుస్తాయి.
సినిమా అన్నది వ్యాపారమన్నది నూటికి తొంభై మంది నమ్మే సూత్రం! అయితే మిగిలిన పది శాతం మంది మాత్రమే సినిమాను సాంఘిక ప్రయోజన మాధ్యమంగా పరిగణిస్తారు. వాళ్ళకి “వ్యాపార ధోరణి“ ఉండదు. ఈ విషయం చిత్రరంగంలో భాషా భేదం లేకుండా నిరూపితమైన సత్యం!
కానీ మళయాళ చిత్రరంగాన్ని తీసుకుంటే దక్షిణాది చిత్రరంగంలో సాంఘిక సమస్య ల మీద, మానవ బంధాల మీద, ఆర్ధిక వ్యత్యాసాల మీద తీసిన ఆర్ట్ ఫిలింస్ ఎక్కువగా ఉండటం అవి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా పురస్కారాలు పొందడం విశేషం.
మళయాళ చిత్రరంగంలో రాము కరియత్ – ఆదూర్ గోపాలకృష్ణన్ – ఎంటి వాసుదేవనాయర్, భరతన్ మొదలైన వారు ఈ ప్రయోజనాత్మక చిత్రాల దర్శకులుగా పేరుపొందిన వాళ్లు. వీరి చిత్రాలకు ప్రముఖ మళయాళ రచయిత “తక్కళి శివశంకరం పిళ్ళై“ (చెమ్మన్) వంటి వారి రచనలు చిత్రకథా వస్తువులయ్యాయి.
Also read: పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’
ఇటువంటి చిత్రాలు ఈ చిత్రరంగంలో ఎక్కువగా రావడానికి మరో కారణం ఉంది. కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువగా ఉండటం ముఖ్యమైన కారణం. విద్యావంతులైన వారి ఆలోచనా పరిధి విస్తృతంగా, విశాలంగా, విశ్లేషణపూర్వకంగా ఉండటం వలన, సమాంతర చిత్రాలు అక్కడ ఆదరణ పొందుతున్నాయి. అందువల్ల ఆ ధోరణిలో మరిన్ని చిత్రాలు రావడానికి అవకాశం కలుగుతోంది.
అలా కొన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న చిత్రాల వివరాలు:
నీలక్కుయిల్ (1954 జాతీయ స్థాయిలో రజత పతకం)
చెమ్మన్ 1965 (దక్షిణాదిలో తొలి స్వర్ణకమల పురస్కారం అందుకున్న చిత్రం)
స్వయంవరం (1972) – నిర్మాల్యం (1973)
చిదంబరం (1985) – పిరవి (1989)
కాధాపురుషన్ (1996) వానప్రస్థం (1999)
బెంగాల్ చిత్రరంగం: ఇక ఆది నుంచి అంటే ప్రముఖ దర్శకుడు జాతీయ, అంతర్జాతీయ బహుమతులు అందుకుని “ఆస్కార్ జీవిత సాఫల్య“ పురస్కారం పొందిన సత్యజిత్‌రే గురించి సమాంతర చలనచిత్ర నిర్మాతలకు, దర్శకులకు ఆ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు!
Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం
ఒకరకంగా భారత చిత్రరంగంలో సమాంతర చిత్రాలకు (వాస్తవ ప్రతిబింబిత) మార్గదర్శి సత్యజిత్‌రే అని చెప్పవచ్చు. ఆయన సారథ్యంలో వచ్చిన అపూట్రయో (పథేర్ పాంచాలి 1955, అపరాజితో (1956), ది వరల్డ్ ఆఫ్ అపు 1959) అపూర్వమైనవి.
ప్రముఖ అంతర్జాతీయ సినిమా విశ్లేషకుడు మార్టిన్ స్కోర్‌సెస్సీ ఈ “అప్పు ట్రయోని“ చూసిన తరువాత THE APPU TRIOLOGY TOOK MY BREATH AWAY“ అనడం, సత్యజిత్‌రే దర్శక ప్రతిభకు సముచిత సత్కారంగా భావించవచ్చు. భారత చిత్రరంగానికే గౌరవం ఆపాదించిన విశ్లేషణ అది.
సత్యజిత్ రే మార్గంలో వాస్తవ ప్రతిబింబిత చిత్రాలను ప్రేక్షకులకు అందించిన వారిలో రిత్విక్ ఘటక్ దర్శకత్వంలో వచ్చిన మేఘే ఢాకా, కోయల్గాంధార్, అజంత్రిక్ (వెనిస్ ఫిలింఫెస్టివల్‌లో 1959లో ప్రదర్శించబడింది) – సువర్ణరేఖ (ALL TIME GREATEST FILM – BY ASIAN FILM IN 1998)
చివరిగా రిత్విక్ ఘటక్ దర్శకత్వంతో పాటు ప్రధాన భూమిక ధరించిన JUKTI TAAKO AR GAPPO చిత్రంలో నక్సలైటు ఉద్యమం బెంగాల్‌లో ఎలా రూపుదిద్దుకుంటుందో అన్నది చిత్రీకరించబడటం విశేషం!
Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’
చాలా తక్కువ చిత్రాలు దర్శకత్వం వహించిన రిత్విక్ ఘటక్ సమాంతర చిత్రాల దర్శకులలో ప్రధమ పంక్తిలో ఉండటం ఆయన దర్శకత్వ నైపుణ్యానికి నిదర్శనం!
తెలుగు వారికి కూడా పరిచయం అయిన ప్రముఖ దర్శకుడు మృణాల్‌సేన్! ఆయన దర్శకత్వంలో వచ్చిన భువన్ షోమే (1969) మృగయా (1976) ఒక ఊరి కథ (1977) చిత్రాలు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నాయి!
‘ముగింపు’ కాదు
“ప్రగతి“ అనేది ఎలాగయితే నిత్య స్రోతస్వినిలా ఉంటుందో, ప్రతి తరంలోనూ ఈ తరం ప్రగతి కిరణాలు ప్రసరించే చిత్రాలు రావడం అంతే సహజం! అంచేత ఇది ముగింపు కాదు. ఈ తరహా చిత్రాల గురించి – ప్రత్యేకంగా ఇంచుమించు మొదటిసారిగా వ్రాసిన పుస్తకం ఇది కావచ్చు(!)
Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు
ఇలాంటివి మరికొన్ని రచనలు రావాలని, భవిష్యత్తులో రాబోయే “ప్రగతిభావుక“ చిత్రాల మీద మరింత విశ్లేషణ, విమర్శనాత్మకంగా జరగాలన్న ఆశాభావంతో-
మీ
యడవల్లి
(ఇప్పటికింతే…)