- ఆర్థిక ప్రగతి సాధించకపోతే ఎవ్వరూ గుర్తించరు
- భౌతికంగా దగ్గరున్న దేశాలను రాజకీయంగా దూరం చేసుకోకూడదు
- చైనాతో సమస్యలు పరిష్కరించుకొని స్నేహం చేయాలి
- అమెరికాతో, చైనాతో మన ప్రయోజనాల ప్రాతిపదికగా దౌత్యం సాగాలి
ప్రపంచ పరిణామాలను గమనిస్తూ వుంటే మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా మనకు గుణపాఠాలు పెరుగుతున్నాయి. వాటి నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోకపోతే, మరింత మూల్యం చెల్లించుకోవాల్సిందే. అగ్రరాజ్యమైన అమెరికా మొదలు పేద దేశం నేపాల్ వరకూ భారత్ కు ఝలక్ ఇస్తూనే ఉన్నాయి. మన ఆర్ధిక, విదేశాంగ విధానాలను మరింత పదునుపెట్టుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అఫ్ఘానిస్థాన్ పరిణామాలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి.
Also read: అయ్యో అఫ్ఘానిస్తాన్!
ఒంటరిగా భారత్
ప్రపంచ దేశాల దృష్టిలో ఎవరు నాయకుడు, ఎవరు ప్రతి నాయకుడు అన్న విషయాలను అటుంచగా, మన దేశం ఒంటరిగా మిగిలే పరిస్థితులు రాజుకుంటున్నాయి. ఇప్పటికే ఒంటరి అయిపోయాం.చైనాకు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యత్వం రావడానికి పండిట్ జవహర్ లాల్ నెహ్రు ఎంతో మద్దతు పలికారు. ఒకరకంగా చెప్పాలంటే చైనాను నెహ్రు ఎంతగానో ప్రేమించారు. రాజీవ్ గాంధీ సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ఆ దేశంతో అనేక వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ప్రయాణం తర్వాత కూడా కొనసాగింది. 1978 వరకూ రెండు దేశాల ఆర్ధిక స్థితి ఇంచుమించు సమానంగా ఉండేది. తర్వాత ప్రస్థానంలో చైనా మన కంటే ఎన్నోరెట్లు ఎదిగిపోయింది. మనం వెనుకబడి పోయాం. ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ మనదే. కానీ మనల్ని మనం గొప్పగా ప్రచారం చేసుకోలేకపోయాం. ప్రపంచ మార్కెట్ ను ఆకర్షించాల్సిన స్థాయిలో ఆకర్షించలేక పోయాం. అనేక రంగాల్లో చైనాపై ఆధారపడే పరిస్థితి తెచ్చుకున్నాం. దీనిని గమనించిన చైనా మనపై స్వారీ చేయడం మొదలు పెట్టింది. అమెరికాకు మనం దగ్గరవుతున్నామనే అనుమానంతో, మన ఇరుగు పొరుగు దేశాలను మనకు దూరం చేసుకుంటూ వచ్చింది. అదే సమయంలో, వారి అవసరాలను తీరుస్తూ, ప్రయోజనాలను ఎరవేస్తూ, తన మోచేతి కిందకు తెచ్చుకుంది. మన చేతుల్లో రూపం దిద్దుకున్న బంగ్లాదేశ్ మనతో శతాబ్దాల సాంస్కృతిక,చారిత్రక బంధం కలిగిన నేపాల్, మన మూలాలు బలంగా ఉన్న శ్రీలంక.. చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ఇది మన ఘోర వైఫల్యం. రష్యా – భారత్ మధ్య సాగిన స్నేహం ఎల్ల లోకాలకు తెలిసిందే.
Also read: స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినప్పుడే పండుగ
దూసుకుపోతున్న చైనా
చైనా ప్రభావంతో నేడు రష్యా కూడా మనకు దూరమైంది. తాలిబాన్ కు సహాయ సహకారాలు ముమ్మరంగా అందించే దేశాల్లో నేడు చైనా ప్రధాన స్రవంతిలో ఉంది. రష్యాతో పాటు ఇస్లామిక్ దేశాలన్నింటినీ తనకు అనుకూలంగా మలచుకోవడంలో చైనా శరవేగంగా ముందుకు దూసుకు వెళ్తోంది. అమెరికాను అధిగమించి అగ్రరాజ్యంగా అవతరించడానికి సంసిద్ధమవుతోంది. మొత్తంగా, ఈ నలభై ఏళ్ళ ప్రయాణంలో చైనా బలమైన శక్తిగా అవతరించింది. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాకే పరిమితమై ఉన్నాం. కరోనా దెబ్బకు ఇంకా డస్సిపోయాం. అగ్రరాజ్యమైన అమెరికాతో బంధాలు పెరగడం ఒకకోణంలో మంచి పరిణామామే. దానికి పూనికగా నిలిచినవారు పీవీ నరసింహారావు. సోవియట్ యూనియన్ పతనమైన తొలినాళ్ళల్లో దేశ ప్రధానిగా పీవీ పీఠం ఎక్కారు. అప్పటి దాకా మనకు పెద్ద అండగా ఉన్న అగ్రపీఠం సోవియట్ యూనియన్ కనుమరుగైన నేపథ్యంలో అమెరికాతో బంధాలను పెనవేయడం పీవీ వేసిన వ్యూహం. చైనాను పూర్తిగా నమ్మడం కూడా సరికాదని బహుశా ఆయన అలోచించి ఉంటారు. అలా ఆ సందర్భాన్ని పీవీ సద్వినియోగం చేసుకున్నారని చెప్పాలి. మన్ మోహన్ సింగ్ కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. తర్వాత ప్రధానిగా వచ్చిన నరేంద్రమోదీ శైలి వారికి పూర్తి భిన్నం. ప్రపంచంలో భారతదేశం మార్కెట్ చాలా పెద్దది. చైనా – అమెరికా ఆధిపత్య పోరులో భారత్ తో రెండు దేశాలకు అవసరం ఉంది. ఈ స్వార్ధాలను దృష్టిలో పెట్టుకున్న అమెరికా మన దేశానికి మరింత దగ్గరవుతూ వచ్చింది. అమెరికా – భారత్ దగ్గరవుతున్నాయని అనుమానిస్తున్న చైనా మనపై కూడా కక్ష పెంచుకుంటోంది. స్వార్ధ ప్రయోజనాలు, అవసరంతో కూడిన అవకాశవాద ఆర్ధికసంబంధాలతోనే అగ్రదేశాల విదేశాంగ విధానం సాగుతోంది. ఈ దేశాల స్వార్ధాలకు మధ్యలో మనం నలిగిపోతున్నాం. మనకంటే ఎంతో చిన్నదేశమైన పాకిస్తాన్ అటు అమెరికాతో-ఇటు చైనాతో సరిసమానమైన బంధాలను పెంచుకుంది. వాటిని కాపాడుకుంటూ వస్తోంది. ఇక తాలిబాన్ తో ఉన్న అక్రమ సంబంధం లోకానికి తెలిసిందే.
Also read: ఈ తీరు మారదా?
వాడుకొని వదిలేయడం అమెరికా నైజం
అవసరాన్ని బట్టి ప్రవర్తించడంలో అమెరికాది అందెవేసిన చెయ్యి. వాడుకోవడం – వదిలెయ్యడం (యూజ్ అండ్ త్రో విద్య ) లోనూ అమెరికాదే అగ్రస్థానం. ప్రస్తుత అఫ్ఘానిస్థాన్ పరిణామాలే దానికి ఉదాహరణ.ఒకప్పుడు అఫ్ఘానిస్థాన్ లో రష్యా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి, పాకిస్తాన్ ను వాడుకొని, తాలిబాన్ కు సహాయసహకారాలను అందించింది. అల్ ఖైదా దాడి నేపథ్యంలో బిన్ లాడెన్ ను అంతం చేయడానికి, తద్వారా అల్ ఖైదాను ముగించడానికి అఫ్ఘాన్ ప్రభుత్వానికి విరివిగా సహకరించింది. వేల కోట్లాది రూపాయలు కుమ్మరించింది. ఆ సైన్యాన్ని సుశిక్షితులుగా తయారు చేసింది. బిన్ లాడెన్ అంతమవ్వడంతో ఆట ముగించాలని నిర్ణయించుకుంది. ఇదిగో ఇప్పుడు జో బైడెన్ కాలానికి ఆ పని పూర్తిచేసి, చేతులు దులుపుకుంది. వైఫల్యమంతా అఫ్ఘాన్ ప్రభుత్వానిదే అంటూ పూర్తి నెపం వారిపై నెట్టేసింది. అమెరికాను,అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని నమ్మిన మన ప్రభుత్వం అక్కడ వందల కోట్లు పెట్టుబడి పెట్టింది. చారిత్రాత్మకమైన పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మించి ఇచ్చింది. అమెరికా ఆయుధాలు పడవేయడంతో అఫ్ఘాన్ ప్రభుత్వం అంతమైంది, తాలిబాన్ ముష్కరుల తాండవం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో మన శ్రమ,సొమ్ము వృధా అయిపోయాయి. తాలిబాన్ ను అడ్డం పెట్టుకొని చైనా, పాకిస్తాన్ రెండు దేశాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే మన విదేశాంగ విధానంలో మరింత చాకచక్యంగా ఉండకపోవడం మన ప్రధాన వైఫల్యం. ఆర్ధికంగా ఎదగకపోవడం మరో ముఖ్యమైన వైఫల్యం. అమెరికా, చైనా వంటి దేశాలను అతిగా నమ్మడం కూడా పెద్ద లోపమని అర్ధమవుతోంది. మనదైన పెద్ద మార్కెట్ విలువను చాటుకుంటూ ప్రపంచ దేశాలను మన వైపు తిప్పుకోవడం అత్యంత కీలకం. ఆర్ధిక ప్రగతిని సాధించడం తక్షణ కర్తవ్యం. చైనాతో సంబంధాలు పూర్తిగా దెబ్బ తినకుండా సామరస్య వాతావరణంలో సరిహద్దు వివాదాలను సత్వరమే పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. చైనాతో శత్రుత్వం తగ్గిపోతే, సహజంగానే మన సరిహద్దు దేశాలన్నీ మనకు మళ్ళీ దగ్గరవుతాయి. అమెరికాతో అవసరమైన మేరకు బంధాలను పెంచుకుంటూ పోవాలి. ఆ రెండు దేశాలతో సఖ్యతగా మెలగడం ఎంత ముఖ్యమో, వాటిపై పూర్తిగా ఆధారపడకపోవడం అంతకంటే ముఖ్యం. ఆర్థిక, విదేశాంగ విధానాలను మరింతగా పదును పెట్టుకుంటూ అజాతశతృవుగా అవతరించడమే శిరోధార్యం. గడచిన చరిత్ర నుంచి, జరుగుతున్న పరిణామాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడమే మన కర్తవ్యం.
Also read: మహానగరాలు నీట మునిగిపోతాయా?