తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 7వ భాగం
రైతు బాగుంటేనే దేశం జాతి పచ్చగా ఉంటుంది. ఉపన్యాసాల్లో, వేదికల మీద ‘‘రైతు దేశానికి వెన్నెముక’’ అని నినాదాలు ఇవ్వడం కాదు – ‘‘వరి వెన్ను’’ ను ఆరుగాలం కష్టంతో సృష్టించే వెన్నెముకలాంటి రైతును కాపాడుకోవడం ధర్మం.
దేశానికి స్వతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్నో ప్రాజెక్టులు పొలాలకు నీరు అందించడం కోసం కట్టడం జరిగింది. ‘‘ఆధునిక దేవాలయం’’ అని పండిట్ నెహ్రూ నాగార్జునసాగర్‌కి చక్కని పేరుపెట్టారు. సాగర్ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నో ప్రాంతాల పొలాలకు నీరు అందడం, అంతదాకా బంజరు భూములుగా ఉన్నవి బంగారం పండించే భూములుగా మారడం జరిగింది. పంటలు పుష్కలంగా పండటానికి అవకాశం ఏర్పడింది. తమ పొలాలకు నీరు దొరకని, ఎందరో ఇతర ప్రాంతాల వారు నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలకు వలస రావడమూ జరిగింది. అయితే పుష్కలంగా పంటలు పండినా, రైతుకు ఆ పంట మీద రావలసిన సంపూర్ణ ఫలం ఆర్ధికంగా అందకపోవడం విషాదం! విచారకరం!
Also read: ప్రతి ప్రయత్నం ఒక వియత్నాం
దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు, పాలకులు ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు అమలు పరచడంలోని వైఫల్యం అని ముందుగా చెప్పుకోవాలి. మరి అందువల్లనే రైతు జీవితాల్లో వెలుగు కిరణాలు దూరంగా ఉంటున్నాయి. కష్టపడే రైతుకు కష్టమే మిగలడం విషాదం!
ఒకపక్క వర్షాధారం మీద పంటనాశించే రైతులు, మరోపక్క పండిన పంటకు గిట్టుబాటు ధర, మద్దతు ధర లేమితో అడకత్తెరలో పోకల్లా నలగడం, మరికొంతమంది రైతులు పంట కోసం చేసిన అప్పుల ఊబిలో కూరుకుపోవడం – దానితో భవిష్యత్తు మీద భయంతో ఆత్మహత్యలకు పాల్పడటం – ఇదంతా వర్తమాన భారతదేశ రైతు ముఖచిత్రాన్ని తెలియపరుస్తున్న దురదృష్టకర పరిస్ధితి!
అన్నదాతా సుఖీభవ అన్నది ఒక సూక్తి. రైతు సమాజాన్నుంచి కోరుకునే హితోక్తి! కానీ ఇది మాటలకు, ప్రసంగాలకే పరిమితమై పోవడం గమనించాల్సిన విషయం. ఈ పరిస్ధితి మారాలి అని ఓ సజీవ చిత్రంగా అభ్యుదయ దర్శకుడు, ప్రగతి భావ విశ్వాసి అయిన ఆర్. నారాయణ మూర్తి నిర్మించిన అన్నదాతా సుఖీభవ చిత్రంలో వాణిజ్య పోకడలను దూరంపెట్టి, వాస్తవాలను కళ్లకు కట్టిన దృశ్యరూపం ఇవ్వడం జరిగింది. సమకాలీన రైతు జీవితాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తూ ఒక ఆశాభావంతో నిర్మాణం అయిన చిత్రం ‘‘అన్నదాతా సుఖీభవ!’’
Also read: పూర్తిగా రాజకీయమే కథావస్తువుగా ‘భారత్ బంద్’
దృశ్య మాధ్యమం, సమాజం మీద చూపే ప్రభావం బలమైనది అంటారు. అందుకే ప్రస్తుత రైతు జీవన పరిస్ధితులు మారడానికి, మార్చడానికి, ‘‘అన్నదాతా సుఖీభవ’’ లాంటి చిత్రాల నిర్మాణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి చిత్రాలు ప్రభుత్వాలలోనే కాదు, సమాజంలోని ఇతర వర్గాల వారినీ ఆలోచింపచేస్తాయి. అంతటి శక్తి ఉంది!
రైతు కూడా వ్యవస్ధలో భాగం అయినప్పుడు, రైతు జీవితంలోని అవస్ధలను, ఆవేదనలను, అర్ధం చేసుకుని, వాటికి పరిష్కారం వెతకవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది! ఉండాలి కూడా!
అభ్యుదయ దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి చిత్రాల గురించి మళ్లీ ప్రస్తావించుకోవాలి.
అనుపమ చిత్రాలు
ఇక ఆది నుంచి అభ్యుదయ భావాలతో ఒకపక్క రాజకీయ కథా కథనాలున్న చిత్రాలు, మరోపక్క ఆదర్శ కుటుంబ కథా వస్తువులున్న చిత్రాలు, వీటితో పాటు రైతు సమస్యాత్మక చిత్రాలను కూడా నిర్మించిన ప్రగతిభావ మిళిత, దర్శక నిర్మాత కె.బి. తిలక్.
రాజకీయ కథావస్తువులు అరుదుగా వస్తున్న కాలంలోనే ఆయన ఎంఎల్ఎ అనే చిత్రం నిర్మించడం జరిగింది. రాజకీయ వ్యవస్ధలోని డొల్లతనాన్ని, సమాజాన్ని, ఓటువేసిన ఓటర్లనీ ఎలా ఏమారుస్తున్నారో ప్రజా ప్రతినిధులు అన్న విషయాన్ని కాస్త సూటిగా, మరికాస్త వ్యంగ్య వైభవంగా ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. ఆ తరువాత ఈ చిత్ర ధోరణిలో మరెన్నో చిత్రాలు వచ్చాయి. అందుకే దర్శక నిర్మాత తిలక్ సమాజ హితుడు. సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగిన అభ్యుదయవాది!
అందుకే దశాబ్దాలుగా పరిష్కారం కాని రైతు సమస్యలు ఆయన దృష్టిని ఆకర్షించాయి. సృజనాత్మకత, వర్తమాన పరిస్ధితుల మీద, ముఖ్యంగా రైతు సమస్యల మీద సాధికారత ఉన్న తిలక్ నిర్మాణంలో భూమి కోసం, కొల్లేటి కాపురం చిత్రాలు వెండితెర మీద ఆవిష్కృతమయ్యాయి.
వారసత్వంగా వచ్చిన భూమి కావచ్చు, లేదా కష్టపడి కొనుగోలు చేసిన భూమి కావచ్చు – మరి భూకామందుల దగ్గర కౌలుకు తీసుకున్న భూమి కావచ్చు – ఏ భూమినయినా బాగుచేసి సాగు చేసేది ఎండా కొండా అనుకోకుండా కండలు కరిగించుకునే రైతు మాత్రమే!
‘‘నేలతల్లి’’ అయితే ప్రతి కర్షకుడు, ఆ తల్లి సంతానమే. మరి అటువంటి భూమిలో బంగారం పండించే రైతు సర్వాధికారాలు కోరుకోవడం లేదు. శ్రమ ఫలితానికి తగిన రాబడి మాత్రమే కోరుకుంటున్నాడు. మరి భూకామందుల దౌర్జన్యానికి మారుపేరుగా, ఆ రైతుకు అదీ అందనివ్వడం లేదు సరికదా పైన పేర్కొన్నట్టు కష్టపడి సంపాదించుకున్న భూమినీ మిగలనివ్వడం లేదు.
బలహీన వర్గాలకు చెందిన రైతువర్గానికి వెన్నుదన్నుగా నిలిచి, రైతును బతికించాలని పోరాటం చేస్తున్న ప్రజాసంఘాలు, ఉద్యమకారుల ప్రయత్నాలు, సఫలం కానివ్వకుండా, దళారీలు, కొందరు స్వార్ధపరులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఫలితంగా రైతు జీవన పరిస్ధితిలో మార్పు అనేది ఎడారిలోని ఎండమావిలా మిగిలిపోతోంది!
ఇదుగో ఇలాంటి రైతు పరిస్ధితిలో నిర్ణయాత్మక మార్పు రావాలని అప్పుడే దేశానికి తిండిపెట్టే రైతు బతుకు మారుతుందన్న ప్రగాఢ విశ్వాసంతో దర్శక నిర్మాత తిలక్ నిర్మాణంలో వచ్చిన భూమి కోసం, కొల్లేటి కాపురం చిత్రాలు తెలియచేస్తాయి. నినాదాలు, ప్రసంగాలకన్నా నిర్మాణాత్మక మైన కార్యాచరణే రైతు జీవితాలకు వెలుగుబాట చూపుతుందని, భూమి కోసం, కొల్లేటి కాపురం చిత్రాలను పరిశీలిస్తే తెలుస్తుంది.
Also read: రాజకీయ కుతంత్రాలపైన శరసంధానం
ప్రస్తుత రైతాంగ పరిస్ధితి
రైతు బ్రతుకు మారాలని అటు రైతు సంక్షేమ ఉద్యమకారులు, ఇటు ప్రభుత్వ రంగంలోని రైతు పధకాల శాఖలు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా రైతు జీవన పరిస్ధితిలో ఆశించిన మార్పు రాకపోవడానికి కారణాలని పరిశీలించినప్పుడు కొన్ని వాస్తవాలు మనకి తెలుస్తాయి.
‘‘పితృస్వామిక భావజాలం వల్ల ఇప్పటికీ ప్రభుత్వ శాఖలు, ప్రధాన రైతు సంఘాలు, పాలనా వ్యవస్ధల్లో మగవాళ్ళని రైతులుగా గుర్తించే స్ధితి ఉంది. కానీ నిజానికి వ్యవసాయ రంగంలో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ముఖ్యమైన 20 పనులలో 16 పనుల వరకూ మహిళలే నిర్వహిస్తున్నారు. ఈ కారణంచేత మహిళలు శారీరక అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నా మానసికంగా దృఢంగా ఉండి కుటుంబాల పోషణ భారం ఎక్కువగా తీసుకుంటున్నారు. మగవాళ్ళలో ‘‘మద్యం’’ అలవాటు వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పల పాలయినప్పుడు, ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో మగవాళ్ళే ఎక్కువ’’
– కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక
ఒక దినపత్రికలో వ్రాసిన వ్యాసంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం సమంజసం అని ఒప్పుకోక తప్పదు. రాష్ట్రాలలో మద్య ప్రవాహం గురించి వ్రాసిన ఆయన వ్యాసంలో రైతుల ప్రస్తుత పరిస్ధితి కూడా ప్రస్ఫుటమవుతోంది. ఇది దేనికి సంకేతమో, కాస్త నిశితంగా ఆలోచిస్తే అర్ధమవుతుంది. నిజానికి రైతు సమస్యల మీద, వారి జీవన విధానం మీద, ఎన్నో దశాబ్దాలుగా చాలా ప్రభుత్వాలు, అధ్యయనం చేస్తున్నాయి. అయితే అనేక కారణాలు, ఆర్ధిక, సాంకేతిక, రాజకీయ కారణాల వల్ల ఆ అధ్యయనాలు సత్ఫలితాలను ఇవ్వలేకపోవడం గమనించాల్సిన విషయం!
ఇక్కడ ఈ సందర్భంలో ఒక ప్రముఖ ఆర్ధిక వేత్త శ్రీ చెన్నమనేని హనుమంతరావుగారు వ్రాసిన వ్యాసంలో రైతులకు సంబంధించిన భాగం పరిశీలిద్దాం.
‘‘నేను ప్రణాళికా సంఘంలో ఉండగా 1983 మే 20న విజ్ఞాన్‌భవన్ కొత్త ఢిల్లీలో వ్యవసాయ రంగం అభివృద్ధి – ప్రత్యేకంగా చిన్నకారు రైతులకు సంబంధించి అనే అంశంపై నన్ను రాజీవ్‌గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఆహ్వానించినపుడు ఆయన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, చిన్న రైతుల పాత్రకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడం పట్ల ఎంతో ఉత్సాహం కనబరిచారు. వివిధ విషయాలతోపాటు రైతుల గుమ్మం దగ్గరకు రుణ వసతిని చేర్చడం “ఇండో గ్యాంజెటిక్“ మైదానాల్లాటి కొత్త ప్రాంతాలకు, హరిత విప్తవాన్ని విస్తరించాల్సిన ఆవశ్యకతను గట్టిగా ప్రస్తావించారు. ఆయన సొంత నియోజకవర్గం అమేధీలో రైతుల రుణ వసతి 65 శాతం వసూలవుతున్న విషయం ఉదహరిస్తూ రుణ వసతిని సక్రమంగా వినియోగించినట్లయితే రైతులు తమ అప్పులను తీర్చడంలో సమస్యలుండవని, భావిస్తున్నానన్నారు. మన విద్యా వ్యవస్ధ రైతుల అవసరాలకు అనుగుణంగా మారకపోతే చదువుకుంటున్న వారు వ్యవసాయం వదిలేస్తారని చెప్పారు.’’
Also read: రైతులకూ, సేద్యానికీ పట్టం కట్టిన ‘రోజులు మారాయి’
– చెన్నమనేని హనుమంతరావు
ఆర్ధిక వేత్త, ఆంధ్రజ్యోతి దినపత్రిక
రైతు మేలు కోరే ఆశయ సంకల్పాన్ని తెలిపే ఈ వ్యాస భాగాన్ని అర్ధం చేసుకుంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రైతుల దయనీయ పరిస్ధితులు మారాలి, మార్చాలి అన్న భావన బలంగా ఉన్నా అందుకు ఎన్నో అవాంతరాలు, అడ్డుగోడల్లా నిలుస్తున్నాయి అని తెలుస్తోంది. అందుకే దశాబ్దాల ప్రయత్నాలు కూడా నీరుగారిపోతూ – రైతు జీవన స్ధితి, ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందంగా ఉంది.
ఆలోచిస్తే అంటే ఇంకా ఇలాంటి పరిస్ధితినే రైతు ఎదుర్కొంటున్నప్పుడు మరిన్ని విభిన్న కోణాలలో రైతు బతుకుల గురించి చిత్రాలు వచ్చే అవకాశం ఉందనిపిస్తోంది. అయితే ఆ చిత్రాలలో రైతు సమస్యలకు పరిష్కారం చూపగలిగితే ఆ చిత్రాలకు ఒక పరమార్ధం, ప్రయోజనం ఉంటాయనుకోవడం అత్యాశ కాదు.
ఇటీవల కాలంలో ప్రకృతి భీభత్సాల వలన కానీయండి లేదా తడిసి మోపెడయిన రుణభారం వలన కానీయండి – దళారీల మాయల వల్ల కానీయండి కారణాలు ఏమయినా రైతు పరిస్ధితి, ముఖ్యంగా చిన్నకారు, సన్నకారు రైతులు వ్యసాయాన్ని వదిలేసి అంటే రైతు జీవితాన్ని వదిలేసి వలస కూలీలుగా మారడం కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తున్న చేదు నిజం. మరికొందరు పూట గడవక, కుటుంబ పోషణ కోసం యాచకులుగా మారడం ఊహించలేని దుర్భర సత్యం.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పరిస్ధితులని మార్చడానికి ప్రభుత్వం కృషి చేయాలి, అది సర్కారు బాధ్యత అని తెలియచేస్తూ ప్రముఖ వ్యాస రచయిత ఓ దినపత్రికలో అర్ధవంతమైన ఆలోచన రేకెత్తించే వ్యాసం వ్రాయడం జరిగింది. అందులోని కొన్ని భాగాలు పరిశీలిద్దాం.
‘‘రైతుకు నగదు పథకాలు, వడ్డీలేని రుణాలు, ఉచిత భీమా అంటూ వారిని బిచ్చగాళ్ళుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వ్యవసాయ సంక్షోభానికి కారణాలు తెలుసుకుని, మౌలిక సమస్యలను పరిష్కరించడం పట్ల ఎవరూ దృష్టి సారించడం లేదు. దేశంలో సగం మందికి పైగా ప్రజలకు వ్యవసాయమే ఆధారం. వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు దాదాపు శూన్యం. పైగా రైతులకు అడుగడుగునా ఆంక్షలే. సాగు చేసుకోవడానికి, తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి, రైతులకు స్వేచ్ఛ లేదు. భూసేకరణ చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం వంటివి రైతుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి.
1991 నుండి దేశంలో ఆర్ధిక సంస్కరణలను భారీస్ధాయిలో తెస్తున్నా దేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగం అయిన వ్యవసాయ రంగాన్ని మాత్రం తాకడం లేదు. రైతుకు ప్రధానమైన ఆస్తి భూమి. కానీ తమ ఇష్ట ప్రకారం భూమిని వినియోగించుకోలేరు. అమ్ముకోలేరు, కొనుక్కోలేరు. అనేక ఆంక్షలు. వ్యవసాయం కాకుండా మరో వ్యాసంగం ఆ భూమిలో చేపట్టరాదు. తమ ఉత్పత్తులను రైతు తనకు అనుకూలమైన చోట, గిట్టుబాటు అయిన ధరకు అమ్ముకునే సౌలభ్యం లేదు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో విస్తృతంగా వ్యవసాయ పరిశోధనలకు ఆస్కారం కల్పించాలి. రైతులకు సమాచారంతో సాధికారికత కల్పించే విస్తరణ కార్యక్రమాలను పునరుద్ధరించాలి. రైతులకు తమ వ్యవసాయం గురించి తామే నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలి. భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌ను రద్దుచేసి, రైతుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాలి.’’
– చలసాని నరేంద్ర, వ్యాస రచయిత
Also read: మళ్ళీపెళ్ళి, మాలపిల్ల, రైతుబిడ్డ తొలితరం అభ్యుదయ చిత్రాలు
ఇలా రైతు సమస్యల గురించి ప్రస్తావించుకున్నప్పుడు తెలియని ఎన్నో విషయాలు ఆ రైతు ఇతివృత్తాలున్న చిత్రాలు ప్రేక్షకులకు తెలియచేశాయి. చేస్తున్నాయి. ఇకముందూ తెలియచేస్తాయి. అయితే ఈ చిత్రాలను వాణిజ్య ప్రధానమైన దృష్టితో కాకుండా రైతు భవితను దృష్టిలో పెట్టుకుని తీసే నిబద్ధత కలిగిన దర్శక నిర్మాతల అవసరం (శ్రీ ఆర్. నారాయణమూర్తిలాగా) ఎంతైనా ఉన్నది అనడం అసమంజసం కాదు.
ముందే చెప్పినట్టు రైతు జీవితం ఇతివృత్తాలుగా రైతు భారతం, రైతు పోరాటం, రైతు కుటుంబం, రైతే రాజు, పాడిపంటలు, పల్లెసీమ, మాభూమి వంటి చిత్రాలు వచ్చాయి. ఆ చిత్ర కథా కథనాల్లో రైతు జీవితం ప్రతిబింబించే సంఘటనలు, సన్నివేశాలు బలంగా ఉండి ప్రేక్షకులను ఆలోచింపచేసేవిగా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.
హలంపట్టి పొలం దున్ని బంగారం పండించే రైతు మన జీవితంలో అత్యంత ఆత్మీయుడు అని గుర్తించినప్పుడు, రైతు బతుకు మారుతుంది. అప్పుడు ఏ దేశమైనా నిత్య హరితంగా ఉంటుంది అన్నది నిజం!
తెలంగాణలో రైతు బ్రతుకు: మరి రైతు సమస్యలున్న చిత్రాల గురించి చర్చించుకుంటున్నప్పుడు – తెలంగాణ రాష్ట్రంలోని నాటి రైతుల పరిస్ధితిని, జమిందారుల దౌర్జన్యాన్ని గురించి కూడా చెప్పుకోవాలి!
Also read: తెలుగు చలనచిత్రాలలో ప్రగతి కిరణాలు!
రైతాంగ పోరాటాలు ఎన్నో ప్రదేశాలలో బహుళ సంఖ్యలో జరిగాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అటువంటి పోరాటం నాటి తెలంగాణలో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కన్నా ముందు నిజాం పాలనలో) జరిగింది. అది చరిత్ర పుటల్లో ఒక రికార్డుగా నిలిచింది!
ఆనాటి వాస్తవ సంఘటనలను, ముఖ్యంగా రైతు జీవితాన్ని అత్యంత వాస్తవంగా ఉండేట్టు నిర్మించిన చిత్రం ప్రముఖ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన మాభూమి చిత్రం.
విప్లవాత్మక భావాలనే కాదు, సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్న తపన బలంగా ఉండి, చిత్ర మాధ్యమంతో తమ ఆలోచనలను ప్రజలకు చేరువ కావాలన్న భావజాలం ఉన్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు బి. నరసింగరావు ఈ చిత్ర నిర్మాణ సారథి కావడం విశేషం.
Also read: యడవల్లి రచన: తెలుగు సినిమాలలో ప్రగతి కిరణాలు