Tuesday, January 21, 2025

మనువాదం మట్టికరవక తప్పదు!

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మన నాగార్జునసాగర్ డ్యామ్ ప్రారంభోత్సవ సమయంలో ముహూర్తాలు, మంత్రాలు, పూజలు, కొబ్బరికాయలు లేకుండా, కేవలం సింబాలిక్ గా ఒక దీపం వెలిగించి – ‘‘ఈ ఆధునిక దేవాలయాన్ని జాతికి అంకితం చేస్తున్నా’’ అని ప్రకటించారు. ఆయన దేవాలయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రాజెక్టుల్ని, పరిశోధనాశాలల్ని,  ఆసుపత్రుల్ని ఆయన ఆధునిక దేవాలయాలని అన్నారు. ఇక 2022 జులై నెలలో తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పార్లమెంటు సభ్యుడు సెంథిల్ అక్కడి పూజాకార్యక్రమాన్ని ఆపేశారు. దాంతీ పూజారి వెనక నుండి వెనక్కే పారిపోయాడు. లౌకికవాద ప్రభుత్వం కాబట్టి ఇలాంటివి చేయకూడదని యం.పి. సెంథిల్ హెచ్చరించారు. ఒక్క హిందూ మతం ప్రకారం పూజలు చేస్తే మిగతా మతాల్ని అవమానించినట్లు అవుతందనీ- అక్కడ ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు లౌకికవాదాన్ని అమలు పరిచే విధంగా ఉండాలన్నది ఈ దేశంలో సామాన్యుడికి కూడా తెలుసు. అధికారంలో ఉన్న మన ప్రధాన మంత్రిగారికే తెలియలేదు. ప్రతిపక్షాలు లేకుండా తను ఒక్కడే హిందూ మతానుసారంగా కొత్త పార్లమెంటు భవనంలో అశోక స్థూపానికి ప్రారంభోత్సవ పూజలు చేశాడు. దాని మీద ఉన్న సింహాలు అశోకుని సింహాల్ని ప్రతిబింబించడం లేదని, అవి అరెస్సెస్ రౌద్ర స్వభావాన్ని గుర్తు చేస్తున్నాయని దేశం యావత్తూ దుయ్యబట్టింది. అయితే నేం? అన్నీ వదిలేసిన వారికి ప్రజల ఆక్రోశాలు అర్థం కావుకదా!

Also read: దశహరాకు వక్రభాష్యాలు ఆపండి!

లాక్ డౌన్ కాలంలో ఒక వలసకార్మికురాలు తన పిల్లలతో నడిచి వెళుతున్న దృశ్యాన్ని శిల్పంగా మలచి ఆమెనే దుర్గామాతగా సంభావిస్తూ దసరా ఉత్సవాల్లో నిలిపిన బెంగాల్ కళాకారుడు పల్లవ్ భౌమిక్ ప్రతిభ, సృజనాత్మకత అపూర్వం. సమాజం పట్ల బాధ్యతను చాటే ఆలాంటి కళ అజరామరం’’- అని ప్రశంసించారు ఆర్థికవేత్త కౌశిక్ బసు. కరోనా వైరస్ ను అరికట్టడంలో ఆశా వర్కర్ల పాత్ర ఎంతో కీలకమైంది. కానీ, దిల్లీ, హరియాణా, మధ్యప్రదేశ్ లలో వారు జీతాలు అడుగుతున్నారని, తమ సర్వీసును క్రమబద్ధం చేయమన్నారని, రోగుల వద్దకు వెళ్ళేప్పుడు అవసరమైన రక్షణ ఉపకరణాలు ఇమ్మన్నారనీ ఆగ్రహించి కేసులు పెడుతున్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు – ఈ విషయం బాధ్యత గల ఒక సీనియర్ జర్నలిస్ట్ సమర్ హలర్న్ కర్ అక్కడి నుండి రిపోర్టు చేశారు. మోదీ మీడియా ప్రచారం చేస్తున్న అబద్ధాలకు విరుగుడుగా, కొంత మందయినా ఇలా వస్తవాలు నిర్భయంగా వెల్లడిస్తున్నందుకు మనం సంతోషించాలి.

Also read: చిన్నారుల మెదళ్ళలో మతబీజాలు

సమకాలీన సమాజంలో దేశాన్ని పాలిస్తున్న మనువాద పాలకుల ప్రకటనలు, చేష్టలు ఎంత దుర్మార్గంగా ఉంటున్నాయో గమనించండి. ‘‘మా కార్యకర్తలకి కరోనా అంటే భయం లేదు. ఎందుకంటే వారు అంతకంటే ప్రమాదకరమైన మమతా బెనర్జీతో తలపడుతున్నారు’’-అని అన్నాడు బిజేపీ మాజీ లోక్ సభ సభ్యుడు అనుపమ్ హజ్రా. ఈ పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అక్కడ ఆగితే బాగుండేది. కాని, ఇంకా ముందుకు వెళ్ళి, తనకు గనక కరోనా వస్తే వెళ్ళి మమతను హత్తుకుంటానని అన్నాడు. ‘‘మా బీజేపీ వారి సంస్కారం ఇదీ’’- అని ఆయన స్వచ్ఛందంగా ప్రకటించుకున్నట్టు అయ్యింది! ‘‘వ్వావ్ 50 కోట్ల రూపాలయ విలువైన గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడైనా చూశారా?’’- ఇది మన మహోన్నత నాయకుడు నరేంద్రమోదీ మాట. ఒక ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ ని విమర్శించేందుకు అతని భార్య సునంద పుష్కర్ ను గుర్తు చేశాడు మోదీ. వేసుకున్న బట్టలతో ఎవరు ఏమిటో గుర్తు పట్టొచ్చునని ముస్లింలను ఉద్దేశించి ఓ సభలో వ్యాఖ్యానించింది ఈ సంస్కారవంతుడే! అధికారంలో ఉండి, ఇతర పార్టీ నాయకులకు ఆదర్శప్రాయంగా, హుందాగా ఉండడమంటే ఇదేనా? కనీసం నిర్వహిస్తున్న ఆ ప్రధాని పదవి పరువైనా కాపాడాలి కదా? ఇతర పార్టీ నాయకులెవరూ అనుచితమైన వ్యాఖ్యలు చేయడం లేదని కాదు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు జయదీప్ కవాడే స్మృతి ఇరానీ గురించి ఏమన్నాడో చూడండి: ‘‘స్మృతి ఇరానీ నితిన్ గడ్కరీ పక్కన కూర్చుని రాజ్యాంగాన్ని మార్చే విషయం గురించి మాట్లాడుతుంది. అయితే ఆమె బొట్టు నానాటికీ పెద్దదువుతోంది గమనించారా? భర్తను మార్చే వాళ్ళే అలా తరచూ బొట్టు పెద్దది చేస్తుంటారని జనంలో ఒక అభిప్రాయం ఉంది!’’ అని అన్నారు జయదీప్ కవాడే. వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరివి ఎలా ఉన్నా – వాటిని ప్రజాజీవితంలోకి తేకుండా సంయమనం పాటించడం అవసరం. సామాన్య పౌరులకంటే కూడా దిగజారి నేలబారు వ్యాఖ్యలు చేయడం అవసరమా? కనీసం ఆత్మవిమర్శ కూడా చేసుకునే పని లేదా?

Also read: రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు

అసలయితే  తప్పులు చేయనివారు ఎవరూ ఉండరు. తప్పులు సరిదిద్దుకుంటే వారు మహానుభావులవుతారు. దిద్దుకోనివారు అలాగే మూర్ఖులుగా మిగిలిపోతారు. జాతిపిత అయినా కూడా, ఈశ్వర్ అల్లా తేరో నామ్ అంటూ హిందూ, ముస్లిం ఐక్యతను చాటి చెప్పినా కూడా గాంధీజీ పొరపాట్లకు అతీతుడని ఎవరమూ భావించనక్కరలేదు. తన కుమారుడు మణిలాల్ ఒక ముస్లిం యువతిని ప్రేమించినప్పుడు ఆయన ఆగ్రహించి,  అతనితో తనకు ఇక ఎలాంటి సంబంధమూ ఉండదని- చెప్పడం తప్పే కదా?- ఇది, గాంధీజీ మనవడు తుషార్ గాంధీ చెప్పిన విషయం! గాంధీజీ మనువాదుల భావజాలానికి లొంగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక సారి ఒక ఆలయం ముందున్న వీధిలో దళితులు నడవకూడదని ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలు సడలించాల్సిందేనని పెరియార్ సత్యాగ్రహం చేపట్టారు. పెరియార్ ని బుజ్జగించడానికి గాంధఈజీ ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి- అన్న మాట ఏమిటంటే- ‘‘మీరు ఇప్పుడు దళితులకు దేవాలయం వీధిలో నడవడానికి అనుమతి ఇప్పిస్తారు – కానీ రేప్పొద్దున వారు ఆలయ ప్రవేశానికి అనుమతి అడిగితే ఎలా?’’- అని. ఆయన తన మనువాద బుద్ధిని ప్రదర్శించారు.

Also read: ఇవి కేవలం భారత దేశంలోనే జరుగుతాయి!

ఎవరో కోడిని అడిగారట- అదేమిటీ?- అలా నిర్దాక్షిణ్యంగా నీ గొంతు కోసేస్తున్నారూ?- అని!

అందుకు కోడి ఇలా చెప్పిందట-‘‘అది అంతే! జనాన్ని మేలుకొలిపే వారికి అదే పరిస్థితి ఎదురౌతుంది!’’ అని!

కాలాలు మారుతూ ఉండొచ్చు. మనిషి కుత్సిత బుద్ధిమారనంత వరకు మేలుకొలిపేవారి గొంతులకు ఉరి బిగుస్తూనే ఉంటుంది! సమకాలీనంలో కూడా మనం ఈ విషయం గమనిస్తూనే ఉన్నాం!  నాస్తికత్వాన్ని అర్థం చేసుకోలేని ఆస్థికులు ఒక హాస్యప్రధానమైన సవాల్ విసురుతారు. ‘‘దేవుడు లేడు- అని మీరు నిరూపించండి!’’- అని. దీనికి బెట్రండ్ రస్సెల్ ఒక వివరణ ఇచ్చారు- ‘‘నేను ఆకాశంలో శుక్రుడికీ, గురుడికీ మధ్య ఒ టీకప్పు తిరుగుతోందని చెప్తాననుకోండి. అప్పుడ ఎవరైనా ఆకాశమంతా గాలించి ‘‘ఆ టీకప్పు లేదు’’- అని నిరూపిస్తారా? లేదుకదా? టీ కప్పు తిరుగుతోందని చెప్పే నాపైనే దాన్ని చూపించే బాధ్యత ఉంటుంది. అందువల్ల ‘దేవుడు లేడని నిరూపించండని నాస్తికులను అడగడం సరికాదు. ఉన్నాడని వాదించే ఆస్థికుల మీదే- దేవుడు ఉన్నాడని నిరూపించే బాధ్యత ఉంటుంది-అని!

Also read: భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

టీ.వీ. తెరమీద, సోషల్ మీడియాలో కొందరు అమ్మలు-అయ్యలు జనానికి చిట్కాలు బోధిస్తుంటారు. అలా చేస్తే వారి జీవితాలు దివ్యంగా ఉంటాయని ఊదరగొడుతుంటారు. అలాంటి ఓ సూక్తి పాటించిన యువకుడు తన  స్నేహినితుడితో ఇలా చెప్పుకున్నాడు. ‘‘బీరువాలో దాల్చిన చెక్క- పర్సులో యాలకులు పెట్టి మూడు నెలలయ్యిందిరా! వాసన తప్ప డబ్బులేం రాలేదు. ఇప్పుడయితే వాసన కూడా రావడం లేదు’’ అని వాపొయ్యాడు.  కాకమ్మ కబుర్లను నిజమని నమ్మించే వాళ్ళంతా ప్రబుద్ధులే! ఇక్కడ జార్జి మెక్ లారిన్ ను గుర్తు చేసుకోవడం అవసరం.

1948లో ఒక్లహోమా విశ్వవిద్యాలయంలో చేరిన మొట్టమొదటి నల్ల జాతీయుడైన విద్యార్థి – జాక్ మెక్ లారిన్. శ్వేత జాతీయులకు దూరంగా ఒక మూల కూర్చోబెట్టేవారు. అతణ్ణి తోటి విద్యార్థులంతా ఒక జంతువులాగా చూసేవారు. ప్రొఫెసర్లు కూడా హీనంగా చూసేవారు. ఎవరూ మాట్లాడేవారు కాదు. అతనిఅనుమానాలు ఎవరూ తీర్చేవారు కాదు. లేచి అడిగినా ప్రొఫెసర్లు పట్టించుకునేవారు కాదు. క్లాసులో ఓ మూల ఇంత చోటివ్వడమే ఎక్కువ – అన్నట్టు ఉండేవారు. తర్వాత కొంతకాలానికి పరిస్థితి మారింది. జార్జ్ మెక్ లారిన్ శ్రద్ధగా ఇంట్లో చదువుకోవడం ప్రారంభించాడు. క్లాసులో పాఠాలు కూడా జాగ్రత్తగా వినేవాడు. కష్టపడడానికి ప్రత్యామ్నాయం ఏదీ ఉండదు కదా? ఇవన్నీ మంచి ఫలితాలిచ్చాయి. క్రమంగా తెలివైన విద్యార్థిగా గుర్తింపుకొచ్చాడు. అది అలాగే కొనసాగి, యూనివర్సిటీ టాపర్స్ లో ఒకడయ్యాడు. అప్పటి నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తోటి విద్యార్థినీవిద్యార్థులు, అధ్యాపకులు అందరూ జార్జ్ మెక్ లారిన్ ఎక్కడున్నాడని వెతకడం ప్రారంభించారు. తమ అనుమానాలు తీర్చుకోవడానికి, విషయం మరింత లోతుగా చర్చించుకోవడానికీ అందిరికీ మక్ లారిన్ అవసరమయ్యాడు. అతని రూపూరేఖలూ, నల్లరంగూ, అతని మూలాలు అన్నీ కనుమరుగయ్యాయి. అతని తెలివీ, ప్రతిభా మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అందుకే ‘‘ప్రపంచాన్ని మార్చగల ఏకైక ఆయుధం – విద్య!’’ అని జార్జ్ మెక్ లారిన్ స్వీయ అనుభవంలోంచి చెప్పాడు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. మార్పు సహజం. మన దేశంలో దళితులూ, బహుజనులూ ఏకమై, మనువాద సంప్రదాయాలను బహిష్కరిస్తూ, స్వతంత్రంగా హేతుబద్ధంగా ఆలోచిస్తే గానీ…మనువాదం మట్టికరవదు! లౌకికవాదం బలపడదు!!

Also read: మనువాదుల ఇటీవలి పరిశోధనలు

(రచయిత కేంద్ర సాహిత్య అకాబెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles