Wednesday, January 22, 2025

మనువాదుల ఇటీవలి పరిశోధనలు

విద్య అసలు లక్ష్యం సమాధానాలను అందించడం కాదు,

మనలకు ప్రశ్నలు సంధించడం ఎలాగో నేర్పించడం!

  •  హెలెన్ కెల్లర్,

అమెరికన్ రచయిత్రి, ఉపాధ్యాయురాలు

ఈ దేశంలో ముప్పయ్ అయిదు స్మృతులున్నాయి. అందులో లభించినవి ఇరవై అయిదు మాత్రమే. అందులో అతి ముఖ్యమైంది – మనుస్మృతి. ఒక రకంగా ఈ దేశంలో పాత రాజ్యాంగం మనుస్మృతే. ఆ మనుధర్మశాస్త్రంలో నేరస్థులకు వేసే శిక్షలు ఇలా ఉన్నాయి. వీటిలో ఉన్న తేడాల్ని శ్రద్ధగా గమనించాలి. శిక్ష ఎవరికైనా కానీయండి, లాభం మాత్రం బ్రాహ్మణవర్గానికి చేకూరే విధంగా రాసుకోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

  1. బ్రాహ్మణుడు క్షత్రియుణ్ణి చంపితే – వేయి ఆవులు, ఒక ఎద్దు – ఉత్తమ బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అదే దోష పరిహారం. అదే శిక్ష (మనుధర్మం 11-127)
  2. బ్రాహ్మణుడు వైశ్యుణ్ణి చంపితే దోష పరిహారంగా వంద ఆవులను, ఒక ఎద్దును మరొక బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలి (మనధర్మం 11-128)
  3. ఒక వేళ బ్రహ్మణుడు శూద్రుణ్ణి చంపితే – పది ఆవులు, ఒక ఎద్దును మరో బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలి (మనుధర్మం 11-130)
  4. ఇక బ్రాహ్మణుణ్ణి చంపడం కంటే మహాపాపం ఈ భూమి మీద మరొకటి లేదు. కాబట్టి రాజు కూడా బ్రాహ్మణుణ్ణి చంపకూడదు. చంపించకూడదు. అసలు ఆ ఆలోచనే మానుకోవాలి (మనుధర్మం 8-381)

ఏకపక్షంగా సాగిన ఈ శిక్షలు (దానాలు) పాపం పేరుతో పరిపాలకుల చేతులు కూడా కట్టేశాయి. మనస్మృతి సహాయంతో సమాజంలో తమ స్థాయి అత్యున్నతంగా నిలుపుకున్న బ్రాహ్మణవర్గమేమీ ప్రత్యేకంగా అవతరించినవారు కాదు. జీవ పరిణామ క్రమంలో ఏర్పడ్డ ఆ మహామిశ్రమ సంతతివారే. వారి కుట్రలు, కుతంత్రాల సహాయంతో తమని తాము ప్రత్యేకంగా నిలుపుకున్నారు. అంతే! వారి మనుస్మృతి నిజమైతే – మరి రావణుణ్ణి రాముడెలా చంపాడు? వారు రాసుకున్న రామాయణంలోనే రావణుడు బ్రాహ్మడు. రాముడు క్షత్రియుడు. బ్రాహ్మణుణ్ణి క్షత్రియుడు చంపితే హర్షిస్తున్నారెందుకూ? రాముడికి శిక్షపడాలి కదా? ఆ విషయం ఎందుక ఆలోచించరూ?

Also read: మనుస్మృతిలో మాంసభక్షణ గూర్చి ఏముంది?

డైనోసార్లపై అబద్ధ ప్రచారం

ఎప్పుడో రాయబడ్డ మనుస్మృతిలోని అంశాలు యధాతథంగా సమాజంలోని అన్ని వర్గాలు ఇప్పుడు కూడా ఆచరించాలని మనువాదులు ఆరాటపడుతుంటారు. కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని, నూతన ఆవిష్కరణల్ని వారు పరిగణనలోకి తీసుకోరు. వారి పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ కొందరు సమకాలీన అంశాలను కూడా తమ మనుస్మృతిలో రాయబడి ఉన్నట్టు భ్రమిస్తూ ఉంటారు.  లేదా మనుస్మృతికి అనుగుణంగా తామే కథలు అల్లుతూ ఉంటారు. అలాంటి కొన్ని అసంబద్ధమైన విషయాలు పరిశీలిద్దాం! అలాంటి వాటిని నమ్మకుండా ఉండగలగాలి. తెలివిగా తిప్పికొడుతూ విషయం జనబాహుళ్యానికి తెలియజేస్తూ ఉండాలి. ఇది అందరి సమష్టి బాధ్యత! ఉదాహరణకు డైనోసార్స్ అంతరించి పోయిన జంతువులు. అవి ఏ దేవుడికీ వాహనం కాలేకపోయాయి. కారణం ఏమింటే అవి జీవించి ఉన్న కాలంలో దేవుడిని సృష్టించుకున్నమనిషి లేడుకాబట్టి! కానీ, పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఓ మనువాది ఒక కొత్త విషయం కనిపెట్టాడు. ఆయన ఒక భూవిజ్ఞాన శాస్త్రవేత్త – పేరు అశుఖోస్లా. ‘‘డైనోసార్లను తొలిసారి కనిపెట్టింది బ్రహ్మదేవుడే’’- అని ప్రకటించాడు. దానికి సంబంధిత ప్రస్తావన వేదాల్లో ఉందని బల్లగుద్ది చెప్పాడు.  ఎక్కడ ఉంది? ఎలా ఉంది? వివరంగా చెపితే అందరికీ బోధపడేది కదా? బ్రహ్మ-ఒక కల్పించుకున్న దేవుడు. డైనోసార్లు ఈ భూమిమీద పుట్టి, కొన్ని వేల ఏళ్ళపాటు తమ ఉనికిని చాటుకుని కాలక్రమంలో అంతరించిపోయిన జీవులు. వాటిని బ్రహ్మదేవుడు కనిపెట్టడమేమిటీ? ఇతర దేశస్తులకు డైనోసార్ల గురించి తెలుసు కానీ, హిందూ పురాణాల్లోని బ్రహ్మదేవుడి గురించే తెలియదు. ప్రపంచ దేశాల వైజ్ఞానికులంతా అంగీకరిస్తేనే ఏదైనా వైజ్ఞానిక అంశంగా గుర్తించబడుతుంది. ఆధారాలు లేకుండా చేసే మూర్ఖపు ప్రకటల్ని శాస్త్రజగత్తు అంగీకరించదు. డైనోసార్ల మీద పరిశోధనలు చేసినవారి విలువ తగ్గించడానికి అశుఖోస్లా అనేవాడు ఒక అబద్ధం ప్రకటించాడు. పోనీ, మన దేశంలోని ప్రఖ్యాత వేదపండితులైనా బ్రహ్మదేవుడి పరిశోధనల గూర్చి మాట్లాడలేదేమి చెప్మా? వేదాలలో ఏమున్నదో వారికి బాగా తెలుసు కదా?

Also read: మనల్ని మనం ఖాళీ కప్పులుగా చేసుకుంటే?

గోవును హత్తుకుంటే ఏమవుతుంది?

మన దేశంలో నేటి దేశభక్తుల తెలివి మామూలుగా ఉండడం లేదు.  వారు చేసిన, చేస్తున్న ప్రచారాలు ఎలా ఉంటున్నాయో అందరికీ తెలుసు – అందులో ఒకటి ఇలా ఉంది. ‘‘గోవుని హత్తుకోవడం వల్ల ఆక్సిటోసిన్ – అనే హార్మోన్ విడుదల అవుతుంది. తద్వారా ఒంటరితనం ఉండదు. మానసిక ఆందోళన తగ్గుతుంది – అని క్రైస్తవ దేశమైన నెదర్లాండ్ లో ఆ దేశపు యూనివర్సిటీ ప్రకటించింది. మరి ఈ విషయం ఇక్కడి గొర్రెలకు ఎప్పుడు అర్థమవుతుదో’’- అనే ఒక పోస్టర్ జైగోమాత శీర్షికతో ప్రచారమైంది. జైగోమాత శీర్షికతో ఇలాంటివి ఎవరు ప్రచారం చేస్తారో వేరే చెప్పనక్కరలేదు కదా? సరే ఇదే విషయం మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం! అప్పుడు గొర్రెలవరో  బాగా తెలుసుకోవచ్చు.

మన మెదడులో హైపోథాలమస్ అనే భాగం ఉంటుంది. ఇది రక్తపోటును ,గుండె కొట్టుకునే విధానాన్ని, శరీర ఉష్ణోగ్రతని, జీర్ణవ్వవస్థనీ ప్రభావితం చేస్తుంది. మెదడు కింది భాగంలో ఒక చిక్కుడు గింజంత పరిమాణంలో పిటుటరీ గ్రంథి ఉంటుంది.  ఇక, ఆకసిటోసిన్ అనేది ఒక హార్మోన్. హార్మోన్ అంటే రసాయనికి పదార్థం. ఈ ఆక్సిటోసిన్ హైపోథాలమస్ లో ఉత్పత్తి అయి, కింద ఉన్న పిటుటరీ గ్రంథిలో నిలువ ఉంటుంది. ఆ హర్మోన్ అవసరమైనప్పుడు రక్తప్రవాహంలో కలిసి శరీరంలో ఏ బాగానికి అవసరమైతే ఆ భాగానికి చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ హార్మోన్ స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలకు అందుతుంది. స్త్రీలలో కాన్పు జరగడానికి, కాన్పు తర్వాత పాలు పడటానికీ ఈ ఆక్సిటోసిన్ హర్మోన్ ఉపయోగపడుతుంది. ఇవీ ఆక్సిటోసిన్ కు సంబంధించిన వైజ్ఞానిక వివరాలు. రోడ్డు మీద గోవు కనబడగానే ఎవరు పడితే వారు హత్తుకుంటే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కాదు. ఆ గోవును చిన్నప్పటి నుండి పెంచుకున్నవారికి దాని మీద ప్రేమ ఉంటుంది. అలాంటి వారు దాన్ని హత్తుకుంటారు. వేరే వాళ్ళకు ఆ కోరికే కలగదు. గోవు ఏమైనా గర్ల్ ఫ్రెండా? జీవిత సహచరా? అదొక జంతువు. కౌగిలించుకున్నవాడు మనిషి. హార్మోన్లు ఉత్పత్తి అయ్యే అవకాశమే ఉండదు. నెదర్లాండ్ కాదు గదా ప్రపంచంలో ఏ యూనివర్సిటీ ఈ విషయం ప్రకటించలేదు. అదొక అబద్ధం. తెలివి లేని గొర్రెలే ఇలాంటివి నమ్ముతారు. ఒకటి రెండు సైన్సు పదాలు పట్టుకుని జనాన్ని మభ్యపెట్టడానికి దేశభక్తులు చేసే వ్యర్థ ప్రయత్నమిది.

Also read: ఫేక్ వర్సెస్ రియల్

ఇదేనా రామరాజ్యం!

శ్రీరాముడు మోదీ రూపంలో అవతారం ఎత్తాడు – అని దేశభక్తులు భజన చేయడం ప్రారంభించారు. అంతేకాదు, లక్ష్మణుడు అమిత్ షా రూపంలో జన్మించాడట. ఇక హనుమంతుడు – ఆదిత్యనాథ్ రూపందాల్చాడట. ఈ దేశంలో రామరాజ్యం కలను వీళ్ళంతా నిజంచేయడానికి సంకల్పించారట. ఇకపోతే బెంగాల్ సి.ఎం. మమతా బెనర్జీని శూర్పణఖతో పోల్చాడు ఉత్తర ప్రదేశ్ బిజెపి ఎంఎల్ఏ సురేంద్రసింగ్. బావుంది. పోలికలన్నీ బాగానే ఉన్నాయి. కానీ, ఆ ఎంఎల్ఏ సురేంద్రసింగ్ ఇంకా ఒక విషయం చెబితే బావుండేది. రాముడు సీతను ఏ అడివిలో వదిలేశాడో కూడా చెప్పాల్సింది. ఏమైనా అతని వల్ల ఒక మేలు జరిగింది!  ఇంతవరకూ ఉన్న రామరాజ్యం భ్రమల్ని బద్దలు కొట్టాడు. రామరాజ్యం ఇంత హీనంగా ఉంటుందన్న నిజాన్ని చెప్పి, ప్రజల కళ్ళు తెరిపించాడు. ముస్లింల పేర్లు ఉస్మాన్, రహమాన్ లాగా ఆంజనేయుడి పేరు హనుమాన్ అని ఉంది కాబట్టి, హనుమాన్ ముస్లిం – అని ప్రకటించాడు మరో దేశభక్తనేత. హిందీ మాట్లాడం – అనేవారు – దేశం వదిలి వెళ్ళాలని ఒక యు.పి. దేశభక్తుడు ఆజ్ఞాపిస్తే, తమిళనాడు విద్యామంత్రి సవినయంగా ఇలా నివేదించుకున్నాడు. ‘‘అయ్యా! హిందీ వచ్చినవాళ్ళు మా కోయంబత్తూరు లో పానీపూరి అమ్ముకుంటున్నారు. ఏం ఫరవాలేదు..మాకు తమిళం, ఇంగ్లీషు భాషలు చాలు’’ అని ప్రకటించాడు మంత్రి కె. పొన్ముడి. ‘‘ఎక్కువ మాట్లాడితే మాకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తాం’’- అని కూడా స్టాలిన్ ప్రభుత్వం ఒక హెచ్చరిక చేసింది.

Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

జన్మతః జ్ఞానం రాదు

మనిషి తన ఆలోచనలతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. జన్మతః కాదు’’- అన్నది నిజం. కానీ వైదిక మతం ఒప్పుకోదు. దాని ప్రకారం కొందరు జన్మతోనే యోగ్యులవుతారు. మరికొందరు అయోగ్యులవుతారు. ఈ 21వ వైజ్ఞానిక శతాబ్దంలో ఇలాంటి ఆలోచనలు నిలుస్తాయా? ఎప్పటికప్పుడు ఎవరికి వారు వారి వయసు, అనుభవంతో సంబంధం లేకుండా నిరంతరం తెరచిన మెదళ్ళతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. మన పూర్వీకులకి తెలియని ఎన్నో విషయాలు మన తరానికి తెలుస్తున్నాయి.  ఇంకా ముందు తరాలు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుని ఏం చేయాలి? అంటే మూఢత్వంలో కూరుకుపోకుండా చేతనత్వంతో సజీవంగా జీవించాలి!

Also read: మాల్గుడి సృష్టికర్త ఆర్. కె. నారాయణ్

ప్రకృతిని అర్థం చేసుకోవాలి

పదార్థానికి సంబంధించిన పరమాణువులు, వాటి అమరిక వల్ల ఏర్పడ్డ అణువులు, వాటి నుండి జీవరసాయనాలు, ఆర్.ఎన్.ఎ., డి.ఎన్.ఏ-లు, లిపిడ్స్, ఏకకణ జీవులు, బహుకణ జీవులు సుమారు నాలుగు వందలకోట్లు- అని అనుకుందాం. వీటన్నిటి పరిణామ క్రమంలో జరిగిన, జరుగుతున్న ఎన్నో మార్పులు – జీవుల మధ్య జరిగిన జీవన్మరణ పోరాటాలు, సహాయ సహకారాలు…ఎన్ని ఎన్నని చెప్పుకోగలం?ప్రకృతిని చూసి పరవశించడమే కాదు, దాన్ని లోతుగా అర్థం చేసుకోవడం కూడా అవసరం. ఉట్టి ఈస్తటిక్ సెన్స్ ఉంటే సరిపోదు, దానితోపాటు సైంటిఫిక్ అవుట్ లుక్ కూడా నేడు చాలా అవసరం. మనకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని ప్రకృతిలో ఎన్నెన్నో జరిగిపోతున్నాయన్న వాస్తవం గ్రహించుకోవాలి- కదా? ఈవిషయాలన్నీ ఆలోచించగలిగినవారికి – ప్రపంచాన్ని చూసే దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఈ అవగాహన లేనివారి ఆలోచన పరిమితమైన పరిధిలో కుంచించుకుపోయి ఉంటుంది.

Also read: శాస్త్రవేత్తల్లో మతవిశ్వాసాలు

అనర్థాలన్నిటికీ ఇదే కారణం

ఒక పరిమితిలో కుంచించుకుపోయినవారు వారి ఆలోచనా విధానాన్ని, అవగాహనా స్థాయిని పెంచుకోకుండా విశాల దృక్పథం గలవారిమీద అజమాయిషీ చేయాలని చూస్తున్నారు. ప్రపంచంలో జరుగుతున్నఅనర్థాలకు, దోపిడులకు, దాడులకు, యుద్ధాలకు ఇదే కారణం! అందువల్ల, ఒక వైవు సృష్టి రహస్యాలు, విశ్వపరిజ్ఞానం, జీవ పరిణామ పరిజ్ఞానం, సామాజిక జీవనంలో సాధించుకుంటున్న ప్రగతిని గూర్చి సమకాలీనంలో అందరూ తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకున్నది వచ్చే తరాలకు అందించగలగాలి. అవగాహన లేని తిరోగమనమార్గం మానవ వినాశనానికి మాత్రమే దారి తీస్తుంది!

Also read: మా‘నవ’వాదానికి వెన్నెముక – సైన్స్

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles