రామాయణమ్ – 21
‘‘పడుకొన్నావా హాయిగా! ఊయలమీద ఊగుతూ కన్నులు తెరువకుండా ఇంకా నిద్దురలోనేవున్నవా నీవు! బయట ఏమి జరుగుతున్నదో తెలిస్తే నీ మత్తు పటాపంచలవుతుంది! నీ గుండె చెరువవుతుంది. జగతికంతా నీ సవతి కొడుకే రాజు కాబోతున్నాడు, నీ పతి వలన నీకు పట్టిన గతి తెలియకున్నావు నీవు. దశరథుడు నాకేస్వంతమని పగటికలలు కంటున్నావు! కొంగుకు కట్టేసుకున్నాని భ్రమ పడ్డావు! ఒడిలోదూరిన పాము అని తెలుసుకోలేక పోయావు! ఎంత అమాయకురాలివమ్మా నీవు! సవతిలీల నీకస్సలు తెలియకపాయె! ఎంత గడుసుదమ్మా నీ సవతి! భాగ్యమంతా నాదే అని నీవు కలగంటున్నావు మొగుడికి వలవేసి అంతా తానే లాక్కున్నది!’’
Also read: మంథర రంగ ప్రవేశం
‘‘ఏమిటే. ఏమయ్యిందే ఇప్పుడు అంత కొంపలేమి మునిగిపోయినవని ఈ కేకలు పొద్దున్నే!’’ అని అడిగింది కైక.
‘‘నీ సవతి కొడుకుకు తెల్లవారగనే పట్టాభిషేకమట! రాముడే ఇకనుంచి రాజట!’’
మంథర ఈ మాట పూర్తిచేసిందో లేదో కైక ఒక్కసారి పట్టరాని ఆనందంతో చెంగున దూకి ‘‘అబ్బ ఎంత మంచి వార్తచెప్పావే మంథరా! నీ జీవితంలో ఇంతకంటే మంచివార్త నాకు ఇకముందు చెప్పలేవు! అంతకుమునుపెప్పుడూ కూడా ఇంత మంచి వార్త నాకు చెప్పలేదు! ఇదిగో ఇంత తీయని కమ్మని వార్త నాకెరిగించినందుకు నీకు బహుమతి’’ అని తన మెడలో హారాన్ని తీసి చేతబట్టి మంథర కీయబోయింది కైక!
కైక ఇలా చేస్తుంటే మంధరకు హృదయతాపం హెచ్చింది. కన్నులలో కోపం కనపడజొచ్చింది. మనస్సంతా పాపం నింపుకొని ‘‘ఆహా! ఇది నీకు మంచి కబురా! నీ సవతికొడుకు రాజవ్వటం నీకు ,నీకొడుకుకూ క్షేమకరమా! ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు!’’
Also read: రాముడితో దశరథుడి సంభాషణ
దాని మాటలు విన్న కైక…
“మంథరా ! రాముడే వాడు! సకలగుణాభిరాముడే! సర్వలోకమనోహరుడే వాడు! నా చిన్నతండ్రేవాడు! వాడిని చూస్తే చాలునే, నన్ను నేను మరచిపోతానే. వాడు మా అందరి పుణ్యాలపంట. వాడు మా వరాలమూట! వాడిని గూర్చి ఇంకొక్క మాట మాట్లాడకే! నాకు రాముడయినా, భరతుడయినా ఒక్కటే!
రామే వా భరతే వాహం విశేషం నోపలక్షయే
తస్మాత్తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యాభిషేక్ష్యతి!
‘‘నాకు రాముడయినా,భరతుడయినా ఒక్కటే! తేడాలేదు! అందుకే రాజు రాముని రాజ్యాభిషిక్తుని చేస్తున్నాడంటే ఆనందం కలుగుతున్నది!’’ అని అనడంతోటే
కైక ఇచ్చిన ఆభరణాన్ని విసుగుతో, కోపంతో నేలకేసికొట్టింది మంథర!
‘‘మూఢురాలా శోకించవలసిన సమయంలో ఈ ఆనందమేమిటి? నిన్ను చూసి నాకు నవ్వువస్తున్నది! సపత్నులవృద్ధికి సంతసించే స్త్రీని నిన్నే చూశా! కౌసల్య కొంతసేపటి తరువాత రాజమాత అవుతుంది! నీవేమవుతావు? ఆవిడ ఎదురుగా చేతులు కట్టుకు నిల్చొనే దాసివవుతావా? రాముడు రాజు అయితే భరతుడు సేవకుడై ఊడిగం చేస్తాడా?’’
Also read: రామపట్టాభిషేకంపై వృద్ధనరపతి నిర్ణయం
ఈ విధంగా మాట్లాడుతున్న మంథరను చూసి రాముడి గూర్చి నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు? రాముడెట్లాంటి వాడో వినవే అని కైక చెప్పదొడగింది!
ధర్మజ్ఞో గురుభిర్దాన్తః కృతజ్ఞః సత్యవాక్చుచిః
రామో రాజ్ఞః సుతో జ్యేష్ఠో యౌవరాజ్యమతోర్హతి!
‘‘రాముడు ధర్మాత్ముడు! పెద్దలవద్ద విద్యాబుద్ధులు నేర్చినవాడు, కృతజ్ఞుడు. సత్యవచనాలు పలికేవాడు! నిర్మలమయిన చరితకలవాడు. పైగా పెద్దకొడుకు! అతడే రాజవ్వటానికి అర్హుడు!
‘‘ఒసే గూనిదానా! తన తమ్ములను తండ్రిలాగా చూసుకుంటాడే! నూరుసంవత్సరములు రాముడుపాలించిన పిదప భరతుడు పరిపాలింపగలడు! ఇది అత్యంత ఆనందదాయకము ,కళ్యాణకరము అయిన సమయము అనవసరంగా రోదించకు. వాడు నా రాముడు! నా ఒడిలో పెరిగినవాడు! భరతునికన్నా నాకు వాడే ఎక్కువ! అయినా రాముడికి రాజ్యముంటే అది భరతుడికి కూడా ఉన్నట్లే! తమ్ములంటే ఏవిధమైన భేదభావం లేనివాడు రాముడు!’’
Also read: పరశురాముడి గర్వభంగం
ఆ మాటలు విని దీర్ఘంగా నిట్టూర్చి మంథర! ‘‘నీ కొడుకును నీకు దూరంగా పెంచాడు దశరథుడు! రాముడికి లక్ష్మణుడు అంటేనే ప్రేమ, ఏ విధంగా చూసినా రాముడి తరువాత అతని కొడుకులు రాజులు అవుతారు! నీ కొడుకెందుకవుతాడు? నీ కొడుకును రాముడు చంపివేసినా చంపివేయవచ్చు! తన రాజ్యాధికారానికి అడ్డం వస్తాడేమోనని! నీకు శాశ్వతమైన అవమానం !.దుఃఖం!….’’
అయిపోయింది! అమృతం ఒలికిపోయింది! హృదయం నిండా అమృతాన్ని నింపుకున్న కైక మంధర మాటలకు దాన్ని ఒలకపోసుకొని కాలకూటవిషంతో నింపింది! కన్నులెర్రబడ్డవి దెబ్బతిన్నపాములాగా బుస్సున లేచింది ! చెక్కిళ్ళు ఎర్రబడ్డవి. నెయ్యిపోయగా భగ్గున మండే జ్వాలలాగ అయ్యింది ఆవిడ మానసం! ‘‘ఆ రాముడిని ఇప్పుడే అడవుల పాల్జేస్తాను చూసుకో’’ అంటూ దిగ్గున లేచింది!
Also read: సీతారామ కళ్యాణం
వూటుకూరు జానకిరామారావు