రామాయణమ్ – 20
‘‘అమ్మా ,నాన్నగారి ఆజ్ఞ ప్రకారము రేపు నాకు రాజ్యపట్టాభిషేకము! మేమిరువురమూ దీక్షలో ఉండ వలె నని రాజపురోహితులు తెలిపినారు. అందుకు అవసరమైన కార్యక్రమములు నీ చేతుల మీదుగా జరిపించమ్మా’’ అని వినయంగా తల్లిని ప్రార్దించాడు కౌసల్యానందనుడు!
‘‘నాయనా నా చిరకాలపు నోములన్నీ ఫలించినవిరా నేడు! నీవు మహారాజువై ఈ వసుంధరను పరిపాలించాలని ఆ శ్రీ మహావిష్ణువుకు నేను పెట్టుకొన్న మొరలాలకించాడురా ఆ దేవదేవుడు!’’
Also read: పరశురాముడి గర్వభంగం
ప్రక్కనే వున్న ప్రాణాధికుడయిన తమ్ముడు లక్ష్మణుని చూసి, ‘‘లక్ష్మణా ఈ రాజ్యము నీది, ఈ రాజ్యపాలన బాధ్యత నీకోసమే నేనంగీకరించాను. నీ కిష్టమైన భోగములు, సుఖములు అన్నీ ఆనందంగా అనుభవించు!’’ అని పలికి రాముడు భార్యతో కూడి దీక్షస్వీకరించటానికి తన మందిరానికి వెళ్ళిపోయాడు.
శ్రీరాముని మందిరానికి రాజుకోరిక మీద వశిష్ఠుడు విచ్చేశాడు. రామునిచేత దీక్షాస్వీకారం ఏ విధమైన లోటుపాట్లులేకుండా జరగాలని దశరథుడి కోరిక. అనుకోని విశిష్ట అతిధి ఆగమనానికి తొందరతొందరగా తొట్రుపడుతూ వెళ్ళి ఆహ్వానించి ఆయనకు తగిన మర్యాదలు జరిపాడు రాముడు. వశిష్ఠులవారు రాముని చూసి నాయనా ‘‘నీవూ ,సీతా ఈ రోజు ఉపవాసదీక్షలో ఉండి దర్భలమీదనే విశ్రమించాలి. రేపు ప్రాతఃకాలముహూర్తమందు నీకు పట్టాభిషేకం జరుగగలదు’’ అని పలికి వైదేహీసహితుడయిన రామునికి మంత్రపూర్వకముగా ఉపవాసము చేయించాడు.
Also read: సీతారామ కళ్యాణం
ఈ వార్త అప్పుడే నగరమంతా వ్యాపించింది! ఎవరికి వారు తమకే పట్టాభిషేకం అన్నట్లుగా కేరింతలు, త్రుళ్ళింతలు.
వీధులలో ఉత్సవాలు! అయోధ్యానగరవాసుల సంబరాలు అంబరాన్ని చుంబించాయి. అన్ని దారులు రాముడి ఇంటివైపే దౌడుతీసాయి. ఎవరినోట విన్నా ఇవే ముచ్చట్లు. రాబోయే అద్భుతమైన రోజులగూర్చి ఇప్పడే కలలు! ఆ కలలను గురించిన కబుర్లు!.
. రాముడి మందిరంకోలాహంగా వున్నది! స్వచ్ఛమైన నీటితోనిండిన ఒక సరస్సులో వేలకొద్దీ పద్మాలు విచ్చుకుంటే చూపరులకు ఎంత ఆహ్లాదకరంగా వుంటుందో రాముని భవనంలోకి వచ్చీపోయే పురజనుల ముఖపద్మాలు విచ్చుకొని అంత ఆహ్లాదకరంగా వున్నదట!
జనులందరి మదిలో ఒకటే చింత!
ఇంకా తెలవారదేమి? ఈ చీకటివిడిపోదేమీ! ఎవరికీ నిద్దురలేదు…
తెల్లవారగానే తమ రాజు రాముడు! ఈ భావనే వారిమదిలో బ్రహ్మానందాన్ని కలుగజేసింది!
రాముని గృహమునుండి వచ్చిన వశిష్ట మహర్షిని చూసి దశరధుడు అన్నీ అనుకున్నట్లుగా సవ్యముగానే జరుగుతున్నవిగదా! అని ప్రశ్నించి తెలుసుకొని, సభచాలించి, సింహం గుహలో అడుగుపెడుతున్న విధంగా అంతఃపుర ప్రవేశం చేశాడు.
Also read: శివధనుర్భంగం: బాలరాముడు కళ్యాణరాముడైన వేళ
….
ఆ రాత్రి రామచంద్రుడు సీతమ్మతో కలసి హోమముచేసి మిగిలిన హవిస్సు భక్షించి శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ అత్యంత మనోహరంగా అలంకరించిన మహావిష్ణువు ఆలయప్రాంగణంలో పరచిన దర్భలమీద సీతమ్మతో కూడ శయనించాడు!
నాల్గవ ఝాముననే మేల్కొని మరల యధావిధిగా చేయవలసిన కార్యక్రమములన్నీ చేసి ప్రశాంతచిత్తుడైవున్నాడు. నగరం అంతా పౌరులు అలంకరించి శ్రీరామపట్టాభిషేక ఘడియలకోసం ఎదురు చూస్తున్నారు. వీధులలో జనఘోష సముద్రఘోషను తలపిస్తున్నది.
పుట్టినప్పటినుండీ కైకతో కలిసిపెరిగిన దాసి ఒకతి ఆ రోజు రాజప్రసాదము పైకి ఎక్కింది!
ఆవిడ పేరు మంథర! మంథరకు కోలాహలంగా ఉండి చక్కగా అలంకరింపబడిన రాజవీధులు కనపడ్డాయి! జనులందరూ తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించి ఉన్నారు. ఎటు చూసినా మంగళ వాయిద్యాల హోరు, వేదఘోష, మంత్రపఠనం, అశ్వముల జోరు, గజములహుషారు ఎవరి ముఖంలో చూసినా సంతోషము కనపడ్డాయి!
అటు వైపు కళ్లు తిప్పిచూసింది. కౌసల్యమందిరం ముందు జనులు బారులు తీరి ఉన్నారు. అక్కడ సమృద్ధిగా దానధర్మాలు జరుగుతున్నాయి! తన ప్రక్కనే వున్న మరొక దాదిని అడిగింది ‘‘ఏమిటి నగరంలో ఈ రోజు పండుగవాతావరణం ఉన్నదేమిటి’’ అని.
Also read: విశ్వామిత్రుడిని ‘బ్రహ్మర్షీ’ అని సంబోధించిన వశిష్ట మహర్షి
అప్పుడు ఆ దాది ఇలా చెప్పింది, “నేడు రామునికి పట్టాభిషేకం.”
ఆమాటలు మంథర చెవిన పడగానే ఒక్కసారిగా భృకుటి ముడివడింది, కళ్ళలో ఎర్రజీరలువచ్చి రుసరుసలాడుతూ విసవిసా మెట్లుదిగి, అప్పటికింకా నిద్రలేవని కైకమ్మను తట్టి లేపింది!
పైపైకి ఆపదలు వచ్చి పడుతున్నా ఇంత తెలివితక్కువగా ఇంకా నిద్రపోతున్నావా! మూఢురాలా! లే! నిద్దురలే!
ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే!..
‘‘భర్తప్రేమకు నేనే ఎక్కువపాత్రురాలినని మురిసిపోతుంటావుగదా ఇప్పుడేం జరిగిందో చూడు! నీ సౌభాగ్యం మండినట్లే ఉంది! అది ఎండాకాలంలో ఎండిపోయిన నది!’’
‘‘ఏమయ్యిందే నీకు ఇవ్వాళ? ఇట్లా గావుకేకలు పెడుతున్నావు?’’
అని అడిగింది రాణీకైక..
Also read: బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం
వూటుకూరు జానకిరామారావు