Sunday, December 22, 2024

మణిపూర్ మంటలు, మౌనం వీడిన ప్రధాని

ప్రధాని నరేంద్రమోదీ మణిపూర్ విషయంలో పాటిస్తున్న భయంకరమైన మౌనం వీడటానికి ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించినట్టూ, వారిపైన సామూహిక అత్యాచారం జరిగినట్టూ వీడియో సమాచారం వెల్లడి కావలసి వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ విషయాన్ని సూమోటూగా తీసుకొని తీవ్రమైన వేదననూ, ఆగ్రహాన్నీ వెల్లడిస్తూ ‘మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా?’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, మణిపూర్ ప్రభుత్వాన్ని మందలించిన తర్వాతనే మోదీ సుమారు ఎనభై రోజుల మౌనం వీడారు. రెండు దశాబ్దాల కిందట గుజరాత్ లో నరమేధం జరినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ ఏ విధంగా మౌనం పాటించారో ఇప్పుడు మణిపూర్ లో అల్లకల్లోలం జరుగుతున్నప్పుడు కూడా అదే మౌనాన్ని ఆశ్రయించారు. ఈ మౌనం వెనుక మెజారిటీవాదం ఉన్నది.

‘‘మీరు వివస్త్రలు కాకపోతే చంపేస్తాం’’        అంటూ మైటీ మూక బెదిరించింది. మూక చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. వారికి పోలీసుల మద్దతు ఉన్నది. అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి మానభంగం చేసిన ఉదంతం మే 4వ తేదీన జరిగింది. అంతకు ముందు ఒక రోజు (మే3న) హైకోర్టు తన పరిధిలో లేని అంశంపైన తీర్పు ఇచ్చింది. మెజారిటీ మైటీలను ఆదివాసులుగా గుర్తించి వారికి రిజర్వేషన్లు అమలు జరగాలని నిర్ణయించింది. ఇది కుకీలకు మింగుడుపడలేదు. వారు అభ్యంతరం తెలుపుతూ ఉద్యమం ప్రారంభించారు.  మహిళలపైన అత్యాచారం జరిగిన తర్వాత పక్షం రోజులకు మే 18న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అంతే. దర్యాప్తు జరగలేదు. అరెస్టులు చేయలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నోరు తెరిచిన తర్వాతనే ప్రధాని మౌనానికి స్వస్తి చెప్పారు. అదే రోజు, గురువారం, 20 జులై 2023న, మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని మణిపూర్ ముఖ్యమంత్రి  బీరేన్ సింగ్ ప్రకటించారు. చంద్రచూడ్ వ్యాఖ్య తర్వాత ఒకే రోజులో అన్ని పరిణామాలూ సంభవించడం విశేషం.

మణిపూర్ లో బాధితులను పరామర్శిస్తున్న రాహుల్ గాంధీ

ప్రధాని ఖండనలో సైతం రాజకీయం దండిగానే ఉంది. ‘‘మణిపూర్ ఘటన దేశంలోని మొత్తం 140 కోట్ల మందికీ సిగ్గు చేటు. ఏ రాష్ట్రంలోనైనా- అది రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్ గఢ్ కావచ్చు, మణిపూర్  కావచ్చు- మహిళలను రక్షించవలసిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలకు ఉన్నది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, అక్కాచెల్లళ్ళ, ఆడబిడ్డల సంరక్షణార్థం చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ వ్యాఖ్యానించారు. రెండు తెగల మధ్య రెండున్నర మాసాలుగా పోరాటం జరుగుతూ వందమందికి పైగా ప్రజలు చనిపోగా, లెక్కలేనన్ని చర్చిలు దగ్థం కాగా, ఆస్తులు ధ్వంసం కాగా కకావికలైన మణిపూర్ కీ మామాలుగా జరిగే నేరాలు జరిగిన రాజస్థాన్ కూ, ఛత్తీస్ గఢ్ కూ పోలిక లేదు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో ప్రభుత్వాలు నిందితులను వెంటనే అరెస్టు చేశాయి. అంతకంటే ఎక్కువ నేరాలు జరిగిన మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ ను ప్రధానమంత్రి ప్రస్తావించలేదు. ఎందుకంటే అవి బీజేపీ పాలిత రాష్ట్రాలు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఇంత సంకుచితంగా వ్యవహరించినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ మొత్తుకోవాలి?

నగ్నంగా పరేడ్ చేస్తున్న మహిళ

మౌనం ప్రధానికి సంబంధించినంతవరకూ ఒక ఆయుధం. ఒక అప్రకటిత విధానం. ప్రముఖ సంపాదకురాలు గౌరీ లంకేష్ ను హత్య చేసినా,  హక్కుల నేతలు దబోల్కర్, కల్బుర్గీ, పన్సారేలను దుండగులు  చంపివేసినా ప్రధాని మౌనాన్నే ఆశ్రయించారు. వ్యవసాయచట్టాలను రద్దు చేయాని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు సంవత్సరం పొడుగునా నిరసన ప్రదర్శనలు చేసినా, మహిళావస్తాదులు న్యాయం కావాలంటూ ఎన్నో మాసాలు జంతర్ మంతర్ లో ప్రదర్శనలు చేసినా మౌనమే ప్రధాని సమాధానం. మణిపూర్ లో వందమందికి పైగా మరణించినా అదే మౌనం. ఒక దేశ ప్రధానిగా ఇటువంటి ఘోరాలు జరిగినప్పుడు స్పందించకపోవడం ఏమి గొప్పో అర్థం కాదు.

మణిపూర్ లోని ఇంఫాల్ లోయలో నివసించే మైటీలు మెజారిటీ తెగ. కొండలలో నివసించే కుకీల సంఖ్య మైటీల కంటే తక్కువ. కుకీలు క్రైస్తవులు. వీరు కాకుండా నాగాలు కూడా ఇంఫాల్ లోయ పక్కనే ఉంటారు. ఇటీవల నాగా మహిళను ఎవరో ఇంఫాల్ (మణిపూర్ రాజధాని)లో హత్య చేశారు. నాగాలు ఆగ్రహోదగ్రులైనారు. సకాలంలో మణిపూర్ పౌరసమాజం నాగా మహిళ హత్యను ఖండించింది. మైటీల రాడికల్ సంస్థ ఆరంబై టెన్గోల్ కూడా హత్యను నిర్ద్వంద్వంగా ఖండించింది. అంతటితో నాగాలు సర్దుకున్నారు. లేకపోతే మైటీ-నాగా ఘర్షణలతో ఉత్తర మణిపూర్ రావణకాష్టంగా మారేది.

ప్రధాన నిందితుడు హెరాదాస్ సింగ్

దేశీయాంగమంత్రి అమిత్ షా సైతం కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తర్వాతనే మణిపూర్ సందర్శించారు. అప్పటి నుంచి కుకీలు నివసించే దక్షిణ మణిపూర్ కొండలలో శాంతిభద్రతలతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు. ఢిల్లీ నుంచే నేరుగా కుకీల ప్రాంతంలో పరిపాలనను సాగిస్తున్నారు. ఢిల్లీ మద్దతు మైటీలకు ఉన్నది. ముఖ్యమంత్రి బీరేంద్రసింగ్ ను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించమని జూన్ 24న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష నాయకులందరూ ముక్తకంఠంతో కోరారు. అయినప్పటికీ మోదీ సమాధానం మౌనమే. ముఖ్యమంత్రి ప్రజల గౌవరం, విశ్వాసం కోల్పోయారు. ఆయనను మైటీలతో అంటకాగుతున్న ముఖ్యమంత్రిగా కుకీలూ, నాగాలూ నమ్ముతున్నారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన బీజేపీ ముఖ్యమంత్రిని తొలగించడానికి మోదీ ససేమిరా అంటున్నారు. మణిపూర్ లో ఘర్షణలు జరిగిన తర్వాత 79 రోజులకు మోదీ నోరు తెరిచారు. ఈ లోపు ఆయన అమెరికా వెళ్లారు. ఫ్రాన్స్ సందర్శించారు. యునైటెడ్ ఎమిరేట్స్ లో పర్యటించారు. అమెరికా పార్లమెంటులో మాట్లాడారు. ఫ్రాన్స్ లో భారత సంతతికి చెందిన ప్రవాసభారతీయులను ఉద్దేశించి అద్భుతంగా ప్రసంగించారు. భారత్ ఔన్నత్యాన్ని పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ – 3 ని నింగికి పంపిన శాస్త్రజ్ఞులను పారిస్ నుంచే అభినందించారు. చిరుతపులులు చనిపోవడం గురించి మాట్లాడారు.  ఈ లోగా ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో పర్యటించారు. కానీ మణిపూర్ మాత్రం వెళ్ళలేదు. మణిపూర్ వెళ్ళిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలియని అజ్ఞాని రాహుల్ గాంధీ అని బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ నిందించారు. భోపాల్ లో గంభీరోపన్యాసం చేస్తూ ప్రధాని మోదీ నేషనలిస్ట్  కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) నేతలు 70 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిపరుల గట్టులన్నీ రట్టు చేస్తామనీ, అందరి లెక్కలూ తేల్చుతామనీ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఇది జరిగిన వారంలోపే అదే ఎన్ సీపీ నాయకులను బీజేపీ నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకున్నారు. 70 వేలకోట్ల రూపాలయ అవినీతికి పాల్బడినట్టు ఆరోపించిన అజిత్ పవార్ ను మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అవినీతి ఆరోపణలపైన కొన్ని మాసాలు జైలులో గడిపిన ఛగన్ భుజ్ బల్ ను మంత్రిగా చేసి ఆదరించారు. అందుకే మోదీ 33 సభలలో ఎన్నికల ప్రచారం చేసినా కర్ణాటక ప్రజలు బీజేపీని తోసిరాజన్నారు. మోదీ మాటకు విలువ పడిపోతున్నది. మాటలకూ, చేతలకూ పొంతన లేకుండా పోతున్నది. మోదీ మాట్లాడుతూనే ఉన్నారు. మణిపూర్ గురించి మాత్రం మొన్నటి దాకా మాట్లాడలేదు. మోదీ దేశవిదేశాలలో పర్యటిస్తూనే  ఉన్నారు. మణిపూర్ ను మాత్రం సందర్శించడం లేదు. కారణం తెలియదు. మణిపూర్ లో జరిగినటువంటి ఘోరం రాజస్థాన్ లో కానీ హిమాచల్ ప్రదేశ్ లో కానీ, ఛత్తీస్ గఢ్ లో కానీ జరిగి ఉన్నట్లయితే అక్కడికి మోదీ, షా, స్మృతి ఇరానీ వెంటనే వెళ్ళేవారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించేవారు. మానవహక్కుల కమిషన్ నోటీసులు పంపించేది. మహిళా హక్కుల సంస్థ వెంటనే స్పందించేది. పార్లమెంటులో రచ్చ రచ్చ జరిగేది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించేవారు. కానీ మణిపూర్ బీజేపీ పాలనలో ఉంది. బీరేన్ సింగ్ బీజేపీకి చాలా ముఖ్యుడు. తనకు మహిళలపైన అత్యాచారం జరిగినట్టు ఎఫ్ఐఆర్ దాఖలయ్యే వరకూ తెలియదని మొదట అన్నారు. ఇప్పుడు వీడియో బయటికి పొక్కిన తర్వాతనే తనకు ఈ విషయం తెలిసిందని ముఖ్యమంత్రి అంటున్నారు. తనకు తెలిసిన కొన్ని గంటలలోనే ప్రధాన నిందితుడు హెరాదాస్ సింగ్ (32)ను అరెస్టు చేయించామని చెప్పుకుంటున్నారు. నిజానికి ఇద్దరు కుకీ మహిళలను అల్లరిమూకకు అప్పగించింది పోలీసులేనని ఆరోపణ. పోలీసులు చేసిన ఈ ‘ఘనకార్యం’ గురించి కూడా తెలియని ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగడానికి అర్హుడా? పోలీసులలో, సాయుధ పోలీసులలో సైతం జాతిపరమైన భేదాలు ఉన్నాయి. మైటీ పోలీసులు దక్షిణాదిన కొండలలో కుకీలు నివసించే ప్రాంతంలో పని చేయరు. పోలీసు శిక్షణ కేంద్రం నుంచి, కేంద్ర బెటాలియన్ నుంచీ, మణిపూర్ సాయుధ బెటాలియన్ నుంచీ 6.32 లక్షల బుల్లెట్లూ, 4,537 మరతుపాకులూ మాయమైనాయి. వీటిలో అయిదు శాతం మాత్రమే కుకీల చేతుల్లోకి వెళ్ళాయి. తక్కినవి మైటీల చేతుల్లో ఉన్నాయి.  

మైటీ మహిళలు జైలును ముట్టడించి 12 మంది కాగ్లీ యేవోల్ కెన్నా లుప్ మిలిటెంట్ గ్రూపుకు చెందిన తీవ్రవాదులను విడుదల చేయించారు. ఈ ఉదంతంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు లేవు. చేసిన అరెస్టులు లేవు. జరిపిన దర్యాప్తు లేదు. సాయుధ పోలీసులు తమ హక్కులను హరించడాన్ని వ్యతిరేకిస్తూ 12 మంది మణిపూర్ మహిళలు కంగ్లాఫోర్ట్ లో నగ్నంగా నిలబడి నిరసన ప్రదర్శన చేశారు. ఏఎఫ్ఎస్ పీఏ(ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్)ను రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఇరోం చారూ షర్మిల పదహారేళ్ళు నిరాహారదీక్ష చేసింది. ఫలితంగా కల్లొలిత ప్రాంతాలలో అమలు చేసే ఈ చట్టం పరిధిని కుదించారు. అటువంటి వీరోచిత నేపథ్యం కలిగిన మణిపూర్ మహిళలను సైతం మతసంఘర్షణలలో సమిధలు చేస్తున్నారు.

మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్

మిజోరం, అస్సాం, మణిపూర్ మధ్య సరిహద్దు వివాదం రగులుతూ ఉంది. మయామ్నార్ నుంచి గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా  ఈ రాష్ట్రాల గుండానే జరుగుతుంది. స్థానిక వనరులపైన ఆధిపత్యంకోసం పోరాటం సాగుతూ ఉంటుంది. ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా తమను ఎవరు బలపర్చుతే వారికి ఓటేసే సంప్రదాయం ఉంది. బయటి నుంచి వచ్చిపడుతున్న డబ్బు ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. అల్లర్ల కారణంగా వలస వెళ్ళిన కుకీ-జో కుటుంబాలకు మిజోరం ఆశ్రయం ఇచ్చింది. కుకీలను మిజోరం ప్రభుత్వం సమర్థిస్తున్నది. మైటీల ఆధిపత్య ధోరణి నుంచి కుకీలను కాపాడవలసి ఉన్నదని మిజోరం నాయకుల అభిప్రాయం. గ్రేటర్ మిజోరంకోసం 1970, 80లలో మిజో నేషనల్ ఫ్రంట్ ఉద్యమం నిర్వహించింది. ఇప్పుడు మణిపూర్ లో జరుగుతున్న ఘర్షణలకు మూలకారణం గ్రేటర్ మిజోరంకోసం మాదకద్రవ్యాల అక్రమరవాణా ముఠాలు జరుపుతున్న ఉద్యమమేనని అస్సాంలోని మైటీలు ఆరోపిస్తున్నారు. కుకీ-చిన్-మిజో తెగలను విలీనం చేసే ప్రక్రియలో భాగమే ఈ అల్లర్లని వారి వాదన. చిన్స్ మయమ్నార్ కు చెందిన తెగ. వారు ఈ మధ్య కాలంలో అక్రమంగా మణిపూర్ లోకి ప్రవేశిస్తున్నారనీ, మాదకద్రవ్యాల సాగు, అక్రమ రవాణాలో వీరికి ప్రమేయం ఉన్నదని మైటీల వాదన. మణిపూర్ జనాభాలో సగానికి పైగా మైటీలు ఉన్నారు. ఇంపాల్ లోయలోనూ, మైదానంలోనూ నివసిస్తారు. కుకీలకీ, నాగాలకూ ఆరవ షెడ్యూల్ కింద స్వయంప్రతిపత్తి ఇచ్చిన తర్వాత తమకు స్వేచ్ఛగా నివసించేందుకు తగిన భూమి లేదని మైటీలు ఫిర్యాదు చేస్తున్నారు. కుకీలూ, నాగాలూ కలిసి మణిపూర్ జనాభాలో నలభై శాతం ఉంటారు.

ఇప్పుడు జరిగిన అల్లర్ల కారణంగా కుకీల ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ మరోసారి ముందుకు వచ్చింది. ఇది ఇంతటితో ఆగకుండా గ్రేటర్ మిజోరం డిమాండ్ కు దారితీస్తుందేమోనని మైటీల అనుమానం. కుకీలను మైటీల ఆధిక్యం కలిగిన ప్రభుత్వం దారుణంగా ఆణచివేస్తున్నది కనుక కుకీలు నివసించే దక్షిణమణిపూర్ ప్రాంతాన్ని మిజోరంలో విలీనం చేస్తే మిజోలతో కుకీలు హాయిగా సహజీవనం చేస్తారని మిజోరం నాయకులు వాదిస్తున్నారు. 1986లో మిజోలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాత మిజోరం నేషనల్ ఫ్రంట్ కుకీల గురించి మాట్లాడటం తగ్గించింది. కానీ తాజా పరిణామాల దృష్ట్యా మైటీల ఆధిక్యం ఉన్న మణిపూర్ లో కుకీలు గౌరవంగా, భద్రతతో బతికే అవకాశాలు లేవు కనుక కుకీలు నివసించే ప్రాంతాన్ని మిజోరంలో విలీనం చేయాలన్న డిమాండ్ కు  ఊతం పెరుగుతోంది.

వివిధ కోణాలలో సంక్షోభం విస్తరించే ప్రమాదం ఉన్నది కనుక మణిపూర్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కి వదిలేయకుండా ప్రధానమంత్రి పట్టించుకోవలసిన అవసరం ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలన్నిటిలో బీజేపీ వ్యవహరాలను అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మకు వదిలివేశారు. కానీ మణిపూర్ లోని కుకీ, నాగా రాజకీయ నాయకులు హేమంతను విశ్వసించరు. అందుకే ఆయన దౌత్యం ఫలించలేదు. మణిపూర్ ముఖ్యమంత్రిని తప్పించి రాష్ట్రపతి పాలన విధించడం ప్రాథమిక చర్య కావాలి. అనంతరం ప్రధాని స్వయంగా మణిపూర్ లో పర్యటించి శాంతి కోసం విజ్ఞప్తి చేయాలి. వివిద వర్గాల ప్రజలను కలుసుకొని మాట్లాడాలి. మిజోరం ముఖ్యమంత్రితో చర్చించవలసిన అవసరం ఉంది. మయన్మార్ ప్రభుత్వంతో కూడా సమాలోచనలు జరపవలసి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితులు కుదుటపడాలంటే ప్రధానమంత్రి తక్షణ జోక్యం అత్యవసరం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles