Friday, December 27, 2024

మతలబు 2019 ఎన్నికలలో ఖాయంగా జరిగింది, దాస్ పత్రం మాత్రం చేపను పట్టుకుంటుందని అనుకోవడం లేదు

 ‘‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంలో దిగజారుడు (డెమాక్రాటిక్ బ్యాక్ స్లయిడింగ్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమాక్రసీ)‘‘ అనే పరిశోధనా పత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఢిల్లీలోని అశోకా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా పని చేస్తున్న డాక్టర్ సవ్యసాచి దాస్ రచించిన పరిశోథనా పత్రం ఇది. దీనిని ఇంకా ప్రచురించలేదు.

దీనికి నా మొదటి స్పందన కల్తీలేని అసూయ. ఇటువంటి డేటా విశ్లేషణ నేను చేయాలని ఆకాంక్షించాను. అందులో కాస్త ఈర్ష్య కూడా లేకపోలేదు. రచయిత ఒక ఆర్థిక శాస్త్రవేత్త. తోటి రాజకీయ శాస్త్రవేత్త కాదు. కృతకంగా వండిన వంటలాగా కాకుండా ఒక ఆర్థికశాస్త్రవేత్త తన పరిశోధనా పద్ధతులను రాజకీయాలపైన అమలు చేసి పరిశోధనా సారాన్నిసూటిగా చెబుతున్నాడు. నిజమైన, సత్తా కలిగిన అంశాలపైన ఆర్థికశాస్త్రవేత్తలు దృష్టి పెడితే దాని ఫలితం నిజంగా వెలుగులీనుతుంది.

Also read: మణిపూర్ సంక్షోభాన్ని హిందూత్వ-క్రైస్తవ ఘర్షణగా చూడొద్దు, అది దేశీప్రాచ్యదృష్టి అవుతుంది

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక దిగజారుడు అనే శీర్షికతో తయారైన పరిశోధనా పత్రం ఇంకా ప్రచురణ కాలేదు. అయినప్పటికీ సవ్యసాచి దాస్ అనే ఆర్థికవేత్త రాసిన పరిశోధనా పత్రం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. మన దేశంలో జరుగుతున్న చర్చోపచర్చల సరళిని, స్థాయిని బట్టి చూస్తే ఈ పత్రంపైన వివాదం నెలకొనడంలోనూ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు అందరికీ తెలిసిన వైఖరినే ప్రదర్శించడంలోనూ  ఆశ్చర్యంలేదు. భారతదేశంలో చైతన్యవంతంగా ఉన్న ఎన్నికల విధానాన్ని తప్పుపట్టే విధంగా అటువంటి ‘‘సవ్యంగా పక్వం కాని పరిశోధనను’ విశ్వవిద్యాలయం ఎట్లా అనుమతిస్తుందంటూ బీజేపీ పార్లమెంటు సభ్యుడు నిషికాంత్ దూబే ప్రశ్నించారు.

అవకాశాలను ప్రాతిపదికగా చేసుకొని ఏమై ఉండి ఉండవచ్చునని ఆలోచించే శాస్త్రీయ విధానం పట్ల అవగాహన లేక ఏదో హెడింగులలో వచ్చి ప్రచారం పొందాలన్నదుగ్థతో అధ్యాపకుడు పరిశోధనా పత్రాన్ని రాసి ఉంటారని మీడియాలో ప్రవీణులు కొందరు వ్యాఖ్యానించారు. పత్రంలో పస లేదని, వాస్తవాల ఆధారంగా చేసిన పరిశోధన కాదని మీడియా పెద్దలు చప్పరించేశారు. ఈ పత్రంతో తమకు సంబంధం లేదని హడావిడిగా ప్రకటన జారీ చేయవలసిన అవసరం అశోకా విశ్వవిద్యాలయానికి లేదు. కానీ సాగిలబడినట్టు ప్రకటన చేశారు విశ్వవిద్యాలయం అధికారులు.

Also read: స్వామి వివేకానంద సంఘపరివార్ హితైషి కాదు, ఆయనను కాజేయడానికి పరివార్ కు ఉదారవాదులు తోడ్పడ్డారు  

సగం ఉడికిన వంటకం కాదు

ఎన్నికల థోరణుల అధ్యయనంతో నాకు పరిచయం ఉన్నది కాబట్టి ఈ పరిశోధనా పత్రం సగం ఉడికిన వంటకం ఏ మాత్రం కాదని నేను విశ్వసనీయంగా చెబుతున్నాను.  చాలా కాలంగా భారత ఎన్నికలపైన గణాంకాలతో పద్ధతి ప్రకారం పక్కాగా చేసిన పరిశోధన పత్రాన్ని నేను చూడడం ఇదే ప్రథమం. నిజానికి ఈ ఒక్క పరిశోధనా పత్రంలో ఎనిమిది పరిశోధనా పత్రాల సమచారం ఉంది. ఈ ఎనిమిది పత్రాలలో ఏ ఒక్కటైనా ప్రొఫెషనల్ జర్నల్(వృత్తిపరమైన పత్రిక) లో ప్రచురణకు నోచుకుంటుంది. ఈ ఒక్క పరిశోధనా పత్రం కారణంగా రచయితను ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి వరిస్తుంది.

కండగురించి మాట్లాడుకోవాలంటే ఈ పరిశోధనా పత్రం బలమైన వాస్తవ సాక్ష్యాధారాలు ఇస్తుంది. ఎన్నికలలో అక్రమాలపైన జరిగిన పరిశోధన ఇది. పార్లమెంటు ఎన్నికలపైన ఇటువంటి అధ్యయనం జరగడం ఇదే ప్రథమం. 2019 నాటి లోక్ సభ ఎన్నికలలో మతలబు ఏమైనా జరిగిందా అనే ప్రశ్నను పరిశోధనకు స్వీకరించడమే సాహసం. ఈ అత్యంత సున్నితమైన ప్రశ్నను పరిశోధకుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. ప్రశ్నలు వేసుకున్నాడు. వాటికి జవాబులు చెప్పుకునే క్రమంలో అతను చూపించిన ఆధారాలు, వనరులు దిమ్మతిరిగేవి. డేటాతో చాలా ఉన్నత ప్రమాణాలతో కూడిన పరీక్షలు నిర్వహించి నిర్ణయాలకు వచ్చాడు.

రాజకీయంగా పెద్ద ఎత్తున హడావిడి చేయకుండా రచయిత చాలా జాగ్రత్తగా, నేర్పుగా నిర్ణయాలకు వచ్చాడు. ‘‘ఓటరు రిజిస్ట్రేషన్ సమయంలోనూ, ఓటింగ్ క్రమంలోనూ, ఓట్ల లెక్కింపులోనూ (ఎంతమంది ఓటర్లు ఓటు చేశారనే అంశంలో) మతలబు జరిగినట్టు నాకు సాక్ష్యాధారాలు లభించాయి. రెండు సందర్బాలలోనూ ముస్లింలను లక్ష్యం చేసుకొని ఎన్నికల వివక్షకు పాల్బడినట్టు తెలిసింది. ఓటర్ల జాబితాలో ముస్లింల పేర్లు కొట్టివేయడం, ఎన్నికలలో వారిని ఓటు చేయకుండా ఒత్తిళ్ళకు గురి చేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే క్రమంలో లోటుపాట్లు ఉండటం దీనికి దోహదం చేసింది.

Also read: రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎటైనా కావచ్చు

తీవ్ర అక్రమాలు జరిగినట్టు తన దృష్టికి రాలేదని పత్రకర్త అంగీకరిస్తాడు. ‘‘ఏదో ఫ్రాడ్ జరిగినట్టు కానీ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు కానీ మా పరీక్షల ఫలితాలు సూచించడం లేదు’’ అని ముందే చెప్పాడు. అందువల్లనే కావచ్చు, పెద్ద దుమారం లేపే ఫలితాలు రాలేదు కనుకనే, రాజకీయంగా గంభీరమైన ఆరోపణలూ, ప్రత్యారోపణలూ చేసుకునే అవకాశం లేనందువల్లనే ఈ పరిశోధానా పత్రంపైన అంతగా రచ్చ జరిగింది. ఇంతవరకూ రాజకీయ అంశాలపైన వచ్చిన పరిశోధనా పత్రాల బాటలో   ఈ పత్రం లేకపోవడం ఒక సుగుణం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)ను దుర్వినియోగం చేశారంటూ మామూలుగా ఎన్నికల చర్చలో వినిపిస్తుంది. ఈ అంశం జోలికి దాస్ వెళ్ళలేదు. ఈవిఎంలను తమకు అనుకూలంగా మార్చడం ద్వారా ఎవరైనా ఎన్నికలలో లబ్ధిపొందినట్టు ఇంతవరకూ సాక్ష్యాధారాలు ఎక్కడా దొరకలేదు. ఈ విషయాన్ని నేను అనేక సార్లు చెప్పాను. మా మిత్రులకు కూడా ఈ పత్రంలో ఈవిఎంల ప్రస్తావన లేకపోవడం ఆశాభంగం కలిగించింది.

మన ముందున్నవి చాలా సమంజసమైన అంచనాలు: ఇవీఎంను మార్చవచ్చు. అటువంటి అక్రమాలు చేయడానికి అధికార పార్టీకి పాపభీతి ఏమీ ఉండదు. అటువంటి అక్రమాలను అరికట్టడానికి ఎన్నికల కమిషన్ నడుం బిగిస్తుందన్న నమ్మకం లేదు. ఈవీఎంలను మార్చవచ్చునేమో కానీ ఈవీఎంలు మార్చడం ద్వారా ఏ పక్షమైనా ఎన్నికలలో అబ్ధి పొందినట్టు ఆధారాలు ఎక్కడా లేవు. ఈవీఎంలను మార్చడం వంటి నిష్ఫలమైన అంశం జోలికి సవ్యసాచి దాస్ వెళ్ళలేదు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియలో మతలబు జరిగిందని సాక్ష్యాధారాలను బేరీజు వేసుకొని నిరూపించడానికి కూడా అతడు ప్రయత్నించలేదు. స్థానికంగా చాలా సాక్ష్యాధారాలు లభించాయి. ఇది వరకు జరిగిన అక్రమాల గురించి కొందరు చెప్పిన అంశాలు సైతం ఉన్నాయి. కానీ ఈ దశలో పూర్తిగా సందేహాలు నివృత్తి చేస్తూ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని నిరూపించడం అసాధ్యం. ఇటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించే పని పరిశోథనాత్మక జర్నలిస్టులకు కానీ భావి చరిత్రకారులకు కానీ వదిలిపెట్టడం మంచిది.

ఎన్నికల శల్యపరీక్ష సారాంశం

దీనికి బదులు దాస్ తన దృష్టిని విధానంపై కాకుండా ఫలితంపైన పెట్టాడు. నియోజకవర్గాలూ, బూత్ ల స్థాయిలో ఫలితాలను విశ్లేషించాడు. అసాధారణ కోణాల కోసం అన్వేషించాడు. ఎన్నికల అక్రమాలు జరిగి ఉంటే వాటి తాలూకు ఆధారాలు దొరుకుతాయని అంచనా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శల్యపరీక్ష. అక్రమాలు గుర్తించడానికి జరిగే కసరత్తు. వివాదాస్పదమైన వివరాలు కానీ ఆరోపణలు కానీ కాకుండా ప్రభుత్వం నమోదు చేసిన వివరాలు ఆధారంగా చేసిన పరిశోధన. ఈ పరిశోధనలో బూత్ స్థాయిలో విశ్లేషించి దాన్ని జాతీయ స్థాయికి ఆపాదించవచ్చు. ఈ పద్ధతిలోని పరిమితి ఏమంటే అక్రమాలు జరిగిన తీరును పేర్కొంటూనే, అక్రమాలు చేయడానికి వినియోగించిన యంత్రాంగాన్ని గుర్తిస్తూనే బహుశా ఈ విధంగా  జరిగి ఉండవచ్చును అని మాత్రమే చెప్పగలం, హేతుబద్ధంగా వాదించగలం. నేరాన్ని నిరూపించడానికి అవసరమైన తిరుగులేని సాక్ష్యాధారాలను ఈ పరిశోధన అందించలేదు. ఇది ఆర్థిక సంబంధమైన అక్రమాలను విశ్లేషించడం వంటిది. అక్రమాలు ఏ మేరకు జరిగాయో, ఎక్కడ జరిగాయో గణాంకాలు తెలియజేస్తాయి. కానీ కోర్టులో ప్రాసిక్యూషన్ లో దీన్ని ఒప్పుకోరు. పోలీసు దర్యాప్తు జరిగి తీరవలసిందే.

ఈ పత్రంలో చేసిన వాదనలను నేను సరళమైన భాషలో కొన్ని భాగాలుగా విభజిస్తాను (ఆసక్తి కలిగినవారి కోసం సాంకేతికపరమైన వివరాలు కూడా జోడిస్తాను.)   

  1. 2019లోబీజేపీ సాధించిన విషయంలో ఏదో తేడా కొడుతున్నది. కొద్ది ఓట్ల తేడాతో ఫలితం నిర్ణయమైన స్థానాలలో చాలా వాటిని బీజేపీ గెలుచుకున్నది. (ఈ అసాధారణ పరిస్థితిని పరీక్షించేందుకు పరిశోధకుడు ‘మెక్ క్రే పరీక్ష’ను ఎంచుకున్నాడు.

1 అ) అటువంటి విజయాలు ఎన్ డీఏ పాలిత రాష్ట్రాలలో దక్కడం గమనించాడు.

  1. ఆ) ఆది కేవలం అసాధారణమే కాదు. ప్రపంచ ప్రమాణాలతో చూస్తే ఇది చాలా అసాధారణం.  1977 లోక్ సభ ఎన్నికలలో కానీ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కానీ ఇటువంటి అసాధారణ ధోరణి కనిపించలేదు.
  2. అనుమానాలు రేకెత్తించడానికి ఈ పాత పద్ధతి చాలు. కానీ అక్రమాల నిరూపణకు ఇది సరిపోదు. ఏయే నియోజకవర్గాలలో పోటీ  నువ్వా-నేనా అన్నట్టు బాహాబాహీగా ఉంటుందో, ఎక్కడ అదనంగా ప్రచారం చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయో ఈ పద్ధతి కచ్చితంగా చెప్పగలదు.
  3. అ) కానీ ఇది జరగలేదు. ఇటువంటి నియోజకవర్గాలలో గడప గడపకూ తిరిగి ప్రచారం చేయడం వల్లనూ, సోషల్ మీడియా ప్రచారం వల్లనూ బీజేపీకి ఇతర పార్టీలకేంటే ఆధిక్యం రాలేదు (2019 జాతీయ ఎన్నికల అధ్యయనం, లోక్ నీతి –సీఎస్ డీఎస్).
  4. కనుక అక్రమాలు జరిగి ఉంటాయన్న ప్రతిపాదనను బాగా పరిశీలించాలి. ఈ అసాధారణ నియోజకవర్గాలలో కొన్నివింత పోకడలు కనిపిస్తాయి.
  5. అ) ఓట్ల సంఖ్యలో సగటున పెరిగే ఓట్లు సైతం పెరగకపోవడం, ముఖ్యంగా ముస్లిం ఓట్లు. అంటే కావాలనే ముస్లిం ఓటర్ల పేరు కొట్టివేశారని అనుకోవాలి. (ఓటర్ల జాబితాలో నుంచి 2.5 కోట్ల పేర్లలో అల్గోరితమ్ పద్ధతిలో ముస్లిం ఓటర్ల పేర్లు పరిశీలిస్తే ఇది అర్థం అవుతుంది.)

3ఆ) పోలైన ఓట్లనూ, లెక్కబెట్టిన ఓట్లనూ పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తుంది. (ఈ కుంభకోణాన్ని 2019 ఎన్నికల సమయంలో మీడియా కనిపెట్టింది. అప్పుడే  పోలైన ఓట్ల లెక్కను ఎన్నికల కమిషన్ తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య అంత తేడా ఎందుకు ఉన్నదో ఎన్నికల కమిషన్ ఎన్నడూ వివరించలేదు.)

3ఇ) ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇటువంటి అక్రమాలకు పాల్బడే అవకాశం అధికంగా  ఉన్నది.

Also read: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ దృష్టి పెట్టాలో కర్ణాటక ఎన్నికలు చెప్పాయి

ఈ పత్రం బహుశా ఇట్లా జరిగి ఉండవచ్చును అంటుందే కానీ కచ్చితంగా ఇలాగే జరిగింది అని అనదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మనం ఒక నిర్ణయానికి రావాలి. ఏదో మతలబు జరిగిందని చెబుతుంది కానీ ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అన్నది స్పష్టంగా చెప్పదు. నేరం చేసినవారికీ, లబ్ధిపొందినవారికీ మధ్య లావాదేవీ సాగినట్టు నిరూపించే చట్టపరమైన ఆధారాలు ఏమీ లేవు.  2019 ఎన్నికలలో అంతటా అక్రమాలు జరిగాయన్న ఆరోపణ లేదు. పరిశోధకుడూ, రచయితా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అక్రమాలు జరిగి ఉంటే బీజేపీకి 9 నుంచి 18 స్థానాల వరకూ అదనంగా లభించి ఉండవచ్చునని అతడే లెక్క కట్టాడు. లోక్ సభలో బీజేపీకి గల మెజారిటీ చూసుకుంటే ఈ సీట్లు వచ్చినా, రాకపోయినా బీజేపీకి తేడా పడదు. కనుక మరో సారి స్పష్టంగా చెప్పాలంటే 2019లో అక్రమాలు చేసి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని ఈ పరిశోధనా పత్రం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆరోపించడం లేదు.

అదే సమయంలో ఇది సగం ఉడికిన వంటకం కానీ, ఊహాగానం కానీ, పిచ్చి ఆరోపణ కానీ ఎందుకు కాదో తెలుసుకోవాలి. పోటాపోటీగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలలో ఫలితాలు కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత మతలబు జరిగి ఉంటుందని పత్రం నిరూపించింది. ముందుగా అనుకొని కొందరు ఓటర్ల పేర్లను (ప్రధానంగా ముస్లింలు) తొలగించే  ఏర్పాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో జరిగిందనీ, ఓటు చేయడానికి వచ్చిన ఓటర్లను ఓటు వేయకుండానే వెనక్కు పంపారనీ, ఓట్ల లెక్కింపు వ్యవహారంలో అక్రమాలు జరిగాయనీ ఈ పత్రం స్పష్టం చేసింది. రాజకీయ వ్యవహారాలపైన జ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా వాసన చూసి పట్టినట్టు ఈ అక్రమాలు కనిపిస్తాయని నాకు అనిపిస్తున్నది. ఇదే విషయాన్ని విమర్శకులు కొంతకాలంగా చెబుతున్నారు.

ఈ పత్రంలో పేర్కొన్న విషయాలు నేను అనుకున్నట్టు నిజమే అయితే పరిణామాలు విస్తృతంగా ఉంటాయి. ఈ పరిశోధకుడు దృష్టి కేంద్రీకరించిన కొన్ని నియోజకవర్గాలే కాకుండా చాలా ఇతర నియోజకవర్గాలలో కూడా అక్రమాలు జరిగి ఉండవచ్చు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముస్లిం ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ పెద్ద ఎత్తున జరిగి ఉండవచ్చు. బీజేపీ ఎన్నికల యంత్రాంగం, జూనియర్ అధికారులు కేంద్ర పాలక పక్షానికి విధేయులుగా ఉంటారు కనుక బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో సైతం  ఈ అక్రమాలు జరిగి ఉండవచ్చు. ఒక్క ముస్లిం ఓటర్ల పేర్లు మాత్రమే కాదు బీజేపీకి ఎట్టి పరిస్థితులలోనూ ఓటు వేయరని నమ్మకంగా తెలిసిన వర్గాల ఓట్లను కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఉండవచ్చు. అదే విధంగా బోగస్ ఓట్లను చేర్చి ఉండవచ్చు. ఈ అంశం ఈ పత్రం పరిధిలోకి రాదు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా పరిశోధన చేయాలి.

అదే విధంగా ఓటు చేయడంలోనూ, ఓట్లు లెక్కించడంలోనూ అక్రమాలు పరిశోధకుడు ఎంపిక చేసుకున్న ఈ స్థానాలకే పరిమితమై ఉండకపోవచ్చు. ఈ స్థానాలలో వినియోగించిన తీరులోనే తక్కిన నియోజకవర్గాలలోనూ జయప్రదంగా అమలు చేసి ఉండవచ్చు. దాని వల్ల బీజేపీకి వచ్చిన సీట్ల సంఖ్య పెరగకపోవచ్చును కానీ దేశం మొత్తం మీద బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం పెరుగుతుంది. ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు డమ్మీ ఓట్లను తొలగించి ఉండకపోవచ్చు. అందుకే పోలైన ఓట్లకీ, లెక్కబెట్టిన ఓట్లకీ పొంతన లేకుండా పోయింది. ఈవీఎంలకు సీలు వేసే ముందు కొన్ని ఓట్లు వేయడం, అమిత్రమైన ఓటర్లను ఓటు వేయకుండా వెనక్కు పంపడం మొదలైన అక్రమాలు జరిగే ఉంటాయి. మనకు కనిపించిందే సముద్రంలో మునిగిన మంచుపర్వతం కొన మాత్రమేనేమో.

Also read: బీజేపీ సామాజిక న్యాయం రాజకీయాన్ని రాహుల్ మండల్ -3 తో ఎదుర్కోవచ్చు

2024 ఎన్నికలలో ఎదురయ్యే సమస్యలు

అటువంటప్పుడు  2024 ఎన్నికలలో ఎదురు కాబోయే సమస్యలు ఎట్లా ఉంటాయి?

మొదటి విషయం, ఈవీఎంలను ప్రతిఘటించడంలో ప్రతిపక్షాలు తమ శక్తిని యావత్తూ వృథా చేయకుండా అక్రమాలు చేయడానికి ఉపయోగించే పాత పద్ధతుల మీద దృష్టి సారించాలి. మళ్ళీ బ్యాలెట్ పత్రాల కాలానికి వెనక్కి పోకుండా ఒకటికి రెండు సార్లు ఓటింగ్, కౌటింగ్ వివరాలను తనిఖీ చేసుకునే అవకాశాన్ని అడిగి తీసుకోవాలి. అ) రిజిస్టరు ప్రకారం ఎన్నిఓట్లు పోలయ్యాయో, ఈవీఎంల ప్రకారం ఎన్ని పోలైనాయో ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకునే అవకాశం పోలింగ్ ఏజెంట్లకు ఉండాలి.ఆ) ఓట్లు లెక్కించే సమయంలో వీవీపీఏటీ స్లిప్పులనూ, లెక్కించిన ఓట్లను పోల్చి చూసుకోవాలి. లెక్క కుదిరిందో లేదో ప్రతి బూత్ లోనూ తనిఖీ చేసుకోవాలి.

ఇక రెండో విషయం, ఓటర్ల జాబితా సవరణ విషయంలో అక్రమాలు జరగకుండా బహుజాగ్రత్తగా ఉండాలి. తమ పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లు బీజేపీ ఏజెంట్ల మాదిరే సుశిక్షితులై, దృఢ మనస్కులై, సమర్థులై ఉండే విధంగా ప్రతిపక్షాలు చూసుకోవాలి. చివరిగా ఎన్నికల కమిషన్ ఉన్న దయనీయమైన స్థితిని దృష్టిలో పెట్టుకొని, ఓట్ల లెక్కింపు సమయంలో న్యాయవ్యవస్థ ప్రమేయం కూడా ఉండాలేమో పరిశీలించాలి.

Also read: లౌకికవాదులు నా వెంట పడటం- భారత దేశంలో దాడికి గురి అవుతున్నామనే మనస్తత్వానికి నిదర్శనం

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles