- సీఎంగా కేసీఆర్ అన్ని రంగాల్లో విఫలం
- పాలన గాడి తప్పిందన్న మాణిక్కం ఠాగూర్
తెలంగాణ సీఎం గా కేసీఆర్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగుర్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు రాజ్యాంగ బద్ధంగా రావల్సిన హక్కులు, నిధుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన గాడి తప్పి ధనిక రాష్ట్రమైన తెలంగాణ 3లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. బీజేపీతో కేసీఆర్ తీరు గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ మాదిరిగా తయారైందని అన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరితో కార్మిక, కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు ప్రాధాన్యమిస్తూ కొత్త సాగు చట్టాల అమలు ద్వారా ప్రభుత్వ సంస్థలను కుట్ర పూరితంగా నిర్వీర్యం చేస్తోందన్నారు. వీటిపై ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం దశల వారిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి విధాన పరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.
మోడీ ప్రజావ్యతిరేక విధానాలు:
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల అన్ని రంగాల్లో దేశం వెనకబడిపోతోందన్నారు. పెరుగుతున్న నిత్య అవసరాల ధరలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని అన్నారు. పెట్రో, గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరగడం, రూపాయి ధర క్షీణించడంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిందన్నారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ సారథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాణిక్కం ఠాగూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.