Thursday, November 21, 2024

మందకృష్ణ విద్వేష రాజకీయాలు ఎంతకాలం?

“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే వర్గీకరణను అడ్డుకుంటాడు” అనే మందకృష్ణ ప్రకటన ఇటీవల పత్రికల్లో వచ్చింది. నిజంగానే భట్టి విక్రమార్క సీఎం అవుతాడా? మరి కాంగ్రెస్ లో అధికారం కోసం తహతలాడుతున్న రెడ్లు అలా జరగనిస్తారా? ఒకవేళ అధిష్టానం దళితుడిని సీఎం చేయాలనుకుంటే మాదిగలను సీఎంగా చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వారి జనాభా ఎక్కువ. వాస్తవం ఇది కాగా, మరి కృష్ణ మాదిగ భట్టి విక్రమార్క అనే బూచిని ఎందుకు చూపిస్తున్నాడు? దాన్నిఅర్థం చేసుకోవాలంటే కర్ణాటక ఎన్నికల్లో ఆయన వైఖరిని ముందుగా పరిశీలిద్దాం.

Also read: బంగారు తెలంగాణలో ఎయిడెడ్ కళాశాలలకు సమాధి!?

కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఓడిపోవాలని ప్రజాస్వామిక వాదులు కోరుకున్నారు. అక్కడ ఉన్న ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు అదే లక్ష్యంతో పని చేశారు. ఇలాంటి సంక్లిష్టత పరిస్థితులలో కూడా మందకృష్ణ బిజెపి అనుకూల నిర్ణయం తీసుకున్నాడు. అయినప్పటికీ ఏ ఒక్కరూ ఆయన వైఖరిని తప్పు పట్టే సాహసం చేయలేదు. కాబట్టి రేపు తెలంగాణలో కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే కాదనే వారెవరు? వర్గీకరణ పేరుతో తాను ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుందని అతనికి తెలుసు. అటువంటప్పుడు భట్టి విక్రమార్క అనే బూచిని చూపాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గానే  మాదిగలు బిజెపికి ఓటు వేయండనీ చెప్పవచ్చు. అలా చెప్పకుండా ఈ డొంక తిరుగుడు రాజకీయాలు ఎందుకోసం?

ఇక వర్గీకరణ విషయానికి వస్తే, మరి రిజర్వేషన్లు పొందే విషయంలో తేడాలు తెలుగు రాష్ట్రలలోనే ఉన్నాయా? కాదు. దేశవ్యాప్తంగా ఉన్నాయి. దానికి ప్రాంతీయ కారణాలు కూడా ఉన్నాయి. ఉత్తర భారతానికి వచ్చినప్పుడు ఎక్కువభాగం చమార్లు పొందుతున్నారు. మన దగ్గర కూడా ప్రధానంగా తెలంగాణ ఉద్యమం పేర్కొన్న ఆ నాలుగు జిల్లాలలో మాలలు  ఎక్కువగా పొందిఉండవచ్చు. అయితే మాలలు ఆ నాలుగు జిల్లాల కోసం వర్గీకరణను వ్యతిరేకించటంలో అర్థం లేదు. ఒకవేళ తెలుగుదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామచంద్రరావు కమిషన్ రిపోర్టుపై వారికి అభ్యంతరాలు ఉంటే సమగ్ర సర్వే చేయమని కోరవచ్చు. అందులో విద్యావంతుల, ఉద్యోగుల, భూముల, ఆస్తుల, వ్యాపారాల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆధారంగా సర్వే జరగాలి. ఎందుకంటే, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన మూడు ఎకరాల పథకంలో సూర్యాపేట జిల్లాలో 46 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఇందులో 45 మంది ఒక్క మాదిగ కులం వారే కాగా, మిగతా ఒకటి బైండ్ల. ఒక్క మాలకూడా ఈ పథకంలో లబ్ధిదారుడుగా లేడు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల విషయంలో కూడా మాదిగలు తమ జనాభా స్థాయిని మించి అదనంగా 10 శాతం ఎక్కువగా పొందుతుంటే, మాలలు తమ జనాభా స్థాయి కన్నా పది శాతం తక్కువగా పొందుతున్నారు. కాబట్టి పరిస్థితులు మారుతున్నాయి.

Also read: లాల్-నీల్ సమస్య?

రాజ్యాంగ దృక్పథం ఏమిటి?

అసలు రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగం యొక్క దృక్పథం ఏమిటో కూడా చూద్దాం. అది మన సమాజాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించింది. అడవిపై ఆధారపడుతూ, ప్రత్యేక జీవన విధాన సంస్కృతి కలిగిన వారిని షెడ్యూల్  తరగతి గాను, సమాజం చేత అస్పృశ్యత అనే సమస్యతో వెలివేతకు గురవుతున్న వారిని షెడ్యూల్ కులాలుగాను, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడినవారిని వెనుకబడినతరగతులుగాను గుర్తిస్తూ మిగతావారిని ఇతరతరగతులుగాపేర్కొన్నది. ఇటువంటి వర్గాల మధ్య అసమానతులను తొలగించి అందరిని భారతీయులు అనే ఒక జాతిగా నిలపటమే రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగాగాను కింది వర్గాల వారికి ప్రత్యేకమైన హక్కులను కల్పించింది. అందులో ఒకటి రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లతోనే వారందరూ అభివృద్ధి చెందుతారనే భ్రమలు రాజ్యాంగకర్తలకు కూడా లేవు. ఇంకా ఆదేశిక సూత్రాల ద్వారా వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ రిజర్వేషన్లు కూడా 10ఎండ్ల పరిమితితో ఇవ్వబడ్డాయి. ఈ పదేళ్లలో లక్ష్యాన్ని సాధించగలమని ఆ నాడు అనుకున్నారు. కానీ పాలకుల చిత్తశుద్ధి లేని కారణంగా లక్ష్యం నెరవేరకపోవటంతో పొడిగించుకుంటూ వస్తున్నారు.

Also read: భక్తులతోనేదేవుడికిముప్పు, నాస్తికులతో కాదు!

మరి రాజ్యాంగకర్తలు ఆశించినలక్ష్యాన్ని ఎందుకు నీరుగారిపోతున్నదనే దాని మీద ఇంతవరకు సమీక్ష లేదు. కాబట్టి అందుకు గల కారణాలపై ఉద్యమాలను చేపట్టకుండా, పాలకుల నిర్లక్ష్యాన్ని విమర్శించకుండా అస్తిత్వవాద నాయకులు తమలాగే సమస్యలతో సతమతమవుతున్నవర్గాన్ని శత్రువుగా చూపిస్తూ ఉద్యమాలు ప్రారంభించారు. కాబట్టి పాలకుల నిర్లక్ష్యం వల్లనే వల్లనే నేటికీ కులాల మధ్య అసమానతలు కొనసాగుతున్నాయని అర్థం అవుతున్నది. అయితే తిరిగి ఆ పాలకులే ఆ కులాల మధ్య ఉన్న తేడాలను ముందుకు పెట్టి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ తన రాజకీయ అవసరాల కోసం మందకృష్ణకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన మిత్రవర్గాలను శత్రువర్గాలుగా చూపిస్తూ ఉద్యమాలు చేస్తున్నాడు. పోనీ ఈ వర్గీకరణ కూడా రాజ్యాంగంకోరే కుల నిర్మూలన లక్ష్యానికి అనుగుణంగా ఉందా? అంటే లేదు. కులాల అస్తిత్వం యధావిధిగా కొనసాగే విధంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ రకంగా అటు పాలకులు, ఇటు ఉద్యమకారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం కులాల మధ్య తేడాలను ముందుకు పెడుతున్నారు.

ఉన్నతశ్రేణివర్గం సహజంగానే ముందుంటుంది

నిజంగానే రిజర్వేషన్లను వాడుకునే విషయంలో అన్ని కులాలలో ఉన్న ఉన్నత శ్రేణివర్గమే ఎక్కువగా వాడుకుంటుంది. వారు వాడుకోగా మిగిలిన భాగమే పేదవారికి చేరుతున్నాయి. అటువంటప్పుడు కులాలలోని వర్గ (ఆర్థిక) ప్రాతిపదికనుతీసుకోవటమే సరైనది అవుతుంది. ఆ రకంగా కేటగిరీ చేస్తే మెజారిటీగా ఉన్న పేదలకు మెజారిటీ భాగం రిజర్వేషన్లు అందుతాయి. ఈ ప్రక్రియ రాజ్యాంగం కోరే కులనిర్మూలనకు కూడా దోహద పడుతుంది. అలాగే షెడ్యూల్ కులాలవారిగా విభజింపబడి ఉన్న గుర్తింపులు మారుతాయి. ఇదే శాస్త్రీయమైన పద్ధతి. ఈ రకంగా పరిష్కారాన్ని కాకుండా వైషమ్యాలు పెంచే డిమాండ్ పెట్టడం వారికి చెరుపు చేస్తున్నది. మొత్తంగా బలహీన వర్గాల అభివృద్ధి గురించి రాజ్యాంగం స్పష్టంగానే ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేసే పాలకులు, అలాగే అమలు చేయించుకునే ఉద్యమకారుల వైఫల్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి రాజ్యాంగం ఆశించినట్లు తమ సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా రాజకీయ పోరాటాల ద్వారా ముందుకు  వెళ్లకుండా తమలో తాము విద్వేషాలు పెంచుకుంటూ ఉద్యమాలు చేయటం వారికే నష్టం. ఇది గ్రహించడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో?

Also read: భారతదేశంపైన మార్క్స్ఏమన్నారంటే….!?

డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు, 9959649097

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles