- ప్రకాష్ రాజ్ పైన భారీ ఆధిక్యంతో నెగ్గిన మంచు విష్ణు
- జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్ గా శివబాలాజీ విజయం
- ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుడు శ్రీకాంత్ విజయం
- ఇగోలకు పోయి పరిశ్రమకు చెడ్డపేరు తేవద్దని మెగాస్టార్ విజ్ఞప్తి
- ‘మా’ కు నాగబాబు రాజీనామా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైనారు. ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై 107 ఓట్ల భారీ మెజారిటీతో విష్ణు విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానెల్ కు ట్రెజరర్ (కోశాధికారి), జనరల్ సెక్రటరీ పదవులు లభించాయి. ట్రెజరర్ గా శివబాలాజీ, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు ఎన్నికయ్యారు. అంతేకాకుండా, ఈసీ మెంబర్లలోనూ విష్ణు ప్యానెల్ కు చెందిన ఎనిమిది మంది విజయం సాధించారు. అటు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన శ్రీకాంత్ విజయం సాధించారు. మరో వైస్ ప్రెసిడెంట్ గా విష్ణు ప్యానెల్ కు చెందిన మాదాల రవి గెలుపొందారు. రఘుబాబుకు నటి జీవిత కంటే 27 ఓట్లు అధికంగా వచ్చాయి. కోశాధికారిగా శివబాలాజీ నాగినీడుై 67 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఉఫాధ్యక్షుల, కార్యవర్గ సభ్యుుల ఫలితాలను సోమవారంనాడు ప్రకటిస్తామని ఎన్నికల నిర్వహణ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారంనాడు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.
పదవులు తాత్కాలికమనీ, చిన్న పదవులకోసం కీచులాడుకొని ‘మా’ పరువు మంటగలపవద్దని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఇగోలకు పోయి వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావద్దని చిరంజీవి కోరారు. ఎన్నికల ముందు ప్రచారం హోరాహోరీగా జరిగింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ పోటాపోటీగా ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం సాగించారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా రణగుణధ్వనులు వినిపించాయి. ఇంతకు ముందు ‘మా’ ఎన్నికలలో ఇంత సందడి ఎన్నడూ లేదు. పరుష పదజాలంతో పరస్పరం నిందించుకున్నప్పటికీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత గతాన్ని విస్మరించి అందరూ స్నేహంగా ఉండాలని పరిశ్రమలోని పెద్దలు హితవు చెబుతున్నారు.
ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేదనీ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాననీ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ఒక ట్వీట్ ద్వారా ప్రకటించారు.