`బాబూ నువ్వు ఆఫీసుకు తీసుకెళ్లిన అన్నం తినకు` అని అప్రమత్తం చేసింది ఆ తల్లి. తాను, కూతురు తిన్న అన్నంలో తేడా వచ్చి కడుపులో తిప్పడంతో కొడుకు ఏమైపోతాడోనని ఆత్రుత పడింది ఆ అమ్మ. కానీ అది తనయుడి పనేనని తెలియదు ఆ తల్లికి. తన పందేలకు, వ్యసనాలకు అడ్డువస్తున్నారన్న కోపంతో తల్లి, చెల్లికి మందు పెట్టాడు ఆ ఎం.టెక్ భట్టభద్రుడు.
తెలంగాణలోని మేడ్చల్ మండలం రావల్ కోల్ కు చెందిన సాయినాథ్ రెడ్డి ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. తండ్రి ప్రభాకర్ రెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోగా, అలా వచ్చిన బీమా సొమ్ముతో పాటు భూమి అమ్మకంతో వచ్చిన డబ్బు కలిపి సుమారు రూ. 20 లక్షలు బ్యాంకులో ఉంచారు. తల్లి ఒకప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా చెల్లెలు అనూష బీఫార్మసీ చదువుతోంది. తండ్రి లోటు ఉన్నా చింత లేని చిన్నకుటుంబమే. అయినా సాయినాథ్ రెడ్డిని అత్యాశ వెంటాడింది. బ్యాంకులో డబ్బు తీసి ఐపీఎల్ బెట్టింగ్ ల్లో పెట్టి నష్టపోయాడు. ఇంట్లోని 15 తులాల బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా తల్లి నిలదీసింది.దాంతో తల్లిని, చెల్లిని వదిలించుకోవాలని నిర్ణయించి ఈ నెల 23వ తేదీ రాత్రి అన్నంలో విష గుళికలు కలిపి ఉద్యోగానికి వెళ్లాడు. భోజనం చేసిన తల్లీకూతుళ్లకు కడుపులో తిప్పడంతో సునీత కొడుక్కి ఫోన్ చేసి `అప్రమత్తం`చేసింది. ఇంటికి చేరుకున్న అతను `మమ్మల్ని ఆస్పత్రికి తీసుకువెళ్లు` అని అమ్మ ఎంత ప్రాధేయపడినా అపస్మారానికి వెళ్లేంతవరకు పట్టించుకోలేదట. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా 27న చెల్లి, మరునాడు తల్లి మరణించారు. అంత్యక్రియల అనంతరం సాయినాథ్ రెడ్డిని బంధువులు నిలదీయడంతో అసలు సంగతి బయటపడింది.