ఎన్నికల జాతర తేది
ప్రకటించారు!
విలువల పాతర మొదలు!
నోట్లు రద్దు చేసి
సైబర్ నేరాలకు తెర తీస్తారు
దేశమంతా కాషాయం అంటారు
గొంతు లోకి కషాయం దింపుతుంటారు
రాముడు, శంకరుడు
మాకు మౌనం గా ప్రచారం చేసి పెడతారు
జిఎస్టీ తో లాభాలు ఎవరీకి వచ్చాయో?
బాట పక్క కుదేలైన బాబు లకే తెలుసు
అచ్చె దిన్ కబుర్ల తో
గాయపడిన పచ్చి గాయాలెన్నో
వికసించని కమలం
వికటించిన రాజకీయమై
నగ్న మణిపూర్ గా
భగ్గుమన్న తరాలు గా
దర్సనమిస్తాయి!
గణాంకాలు రంకెలు వేస్తుంటాయి
గతుకుల దారి లో నిత్యం బతుకు
బొల్తా పడుతూఉంటుంది!
ఎప్పుడో రాసిన రాతకు
పించను కు ముందు కొలువు దొరుకుతుంది
విదేశి పెట్టుబడులు అని ఊరిస్తారు
ఉద్యోగం ఎప్పుడూ మిధ్యా బింబమై
మురిపిస్తూ ఉంటుంది!
సంక్షేమం సంక్షోభం గా ముదిరి
అభివృద్ది
అందని ఆకాశం లో
ఆఖరి నక్షత్ర మై మెరుస్తూ ఉంటుంది!
రచ్చ గెలిచి ఇంట మంట పెడుతుంటారు
ఈసురోమని మనుషులుంటే
ఇస్రో లు పలాయన వేగాన్ని అందుకుంటాయి
ఐదు ఏళ్ళ కి ఒక సారి
వచ్చే ఓటు ని
నోటు కాటు వెయ్యకుండా
కాపాడుదాం!
-వీరేశ్వర రావు మూల©
Also read: మౌనం
Also read: మణిపూర్