ఎప్పుడు ఏ చెట్టు కొట్టిన పాపమో,
భూమి తల్లి గుండెలు చీల్చి
చమురు అపహరించినప్పటి శాపమో,
సాగర ప్రియుని చేర సాగిపోతున్న నదీ కన్యకు
కాలడ్డు పెట్టిన ప్రతిఫలమో…
స్వచ్ఛమైన ఆకాశాన్ని
నల్లని విషపు పొగలతో నింపిన
పొగరు మనిషి పై ప్రకృతి ప్రతీకారమో…
మనిషి వికృత చేష్టలు
గోడకు కొట్టిన బంతి లా
తిరిగి వచ్చి గట్టిగ తాకాయి…
అయితే కొంచెం మెల్లగా…
దేశకాలాలు లెక్కపెట్టి దెబ్బకొట్టే
కర్మ ఫలం గా!
ప్రయోగ శాలలో గల గల లాడిన పరీక్ష నాళికలు,
పొంగుతున్న రంగు రంగు ద్రవాలు,
జిగిబిగి రాతల నోటు బుక్కులు, నల్ల కోట్లు,
పాన్స్-నే అద్దాలు, పిల్లి గడ్డాలు,
యురేకా అరుపులు, నోబెల్ ప్రైజులు…
అన్నీ చూసి ఆమె అప్పుడప్పుడు ఫక్కున నవ్వుతుంది…
ఇదిగో, ఇప్పటి లాగానే,
ప్రళయం అంచున నిలబెడుతుంది.
Also read: నిశ్శబ్ద గీతిక