దారి వెంట ఓ రోజు
నడుచుకుంటూ వెళ్తున్నాను.
చిత్రమైన ఆలోచన వచ్చింది
ఈ క్షణంలో లోకంలో
కోట్లాది మంది వున్నారు కదా
వారితో పరిచయం కాకుండానే
నా జీవితం తెల్లారి పోతుందే అని.
ఇంత చిన్నదా జీవితం!
చుట్టూ వున్న
ఒకరిద్దరి తోనే సమాప్త మౌతుందా!
ఇన్నాళ్లూ
భూగోళం నా పిడికిట్లో వుందని విర్రవీగాను.
ఆకాశం నా కౌగిలిలో ఇమిడిందని ఆనందించాను
అట్లాసును చూసి
అంతా తెలుసు అని గర్వించాను.
నా అజ్ఞానానికి
దిక్కులు పిక్కటిల్లుతూ నవ్వాయి
మేఘాలు జాలి పడుతూ కదిలాయి
ఇంతలో ఎక్కడి నుంచో
ఓ గాలి వీచింది!
అది అశేష జనావళిని తాకి
ప్రపంచ పర్యటనకు బయల్దేరిన
ప్రాక్తన సమీరం.
అది నా అణువణువునూ తడుముతూ
రకరకాల
మట్టి వాసనలను వెదజల్లు తుంటే
వారంతా నాలో
లీనమైనట్టే వుంది.
సంధ్యకు వీడ్కోలు చెప్తూ
మరి కొంత దూరం వెళ్లాను.
ఎక్కడి నుంచో ప్రసారమౌతూ
చీకటి నా చుట్టూ వ్యాపించింది.
ఎక్కడెక్కడి మదవతుల
కోరికల దేహాలను రాసుకుంటూ వచ్చి
ఇక్కడ
అనుభూతులను మేల్కొల్పు తున్నది.
ఎంతటి రాత్రికైనా
ఉదయం తప్పదు.
నా నడక మళ్లీ మొదలైంది
కొండలు దిగుతూ
వెలుగు
మైదానాల్లోకి పరుచుకుంటుంది.
సూర్య కిరణాల ముందు
నా చర్మ చరణాలే పాటి!
నా కన్నా ముందు
నడిచిన వారి అడుగు జాడలు
నేల మీద కనిపించాయి.
మసకగా పొడిచిన సూర్యుడు
నేడు ప్రభవానల తేజోమూర్తి
సూక్ష్మీకరణం పొందిన
సకల జగజ్జనుల ఆర్తి.
ఇప్పుడిక
సందేహ సంధ్యకు తెరపడింది
తత్వం బోధ పడింది.
Also read: గాలి
Also read: గొడుగు
Also read: మా ఊరు
Also read: ఆకు
Also read: తాళం చెవి