Tuesday, November 5, 2024

మనిషిదే భస్మాసుర మనస్తత్వం

  • ప్రకృతి విలయాలు స్వయంకృతమే
  • అప్రమత్తతే శ్రీరామరక్ష

భస్మాసురుడు అనేవాడు అసలు చరిత్రలో ఉన్నాడో, లేడో అనే అంశం అలా ఉంచితే, వాడికి ప్రతినిధిగా  మానవాళి సజీవంగా ఉంది. వాడి లక్షణాలను పుణికిపుచ్చుకొని, ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్న మనిషి, తన మానసిక ప్రకృతికి తానే భస్మమైపోతున్నాడు. తనతోపాటు తన చుట్టూ ఉన్న ప్రకృతిని, కోట్ల జీవరాశులను భస్మం చేస్తున్నాడు. అందుకే,  కంటికి కనిపించని కరోనా వంటి సూక్ష్మజీవులు, మంకీ పాక్స్ వంటివి పుట్టుకొస్తున్నాయి. కరోనా మళ్ళీ పడగలు విప్పుతోందని అంటున్నారు. ఇటువంటి ఆకస్మిక పరిణామాలన్నీ బుధ్ధిజీవిగా చెప్పుకొనే మనిషి మేధస్థాయికి మించి కలవర పెడుతున్నాయి. మనిషి భవితకు కూడా ఇవన్నీ పెనుసవాళ్లు. భూకంపాలు, సునామీలు, బీభత్సమైన తుపానులు, ప్రకృతి వైపరీత్యాలన్నింటికీ మానవ తప్పిదాలే మూలం. ఈ భూమిపై కోట్లాది జీవరాసులున్నాయి. అందులో మానవజాతి ఒకటి. మిగిలిన జీవులన్నీ తమపని తాము చేసుకుంటూ పోతున్నాయి. తమ బతుకులు తాము బతుకుతున్నాయి. కానీ, మనిషి ఒక్కడే వాటిని కుదురుగా ఉండనివ్వడంలేదు.తన అభివృద్ధి కోసం జీవరాశులను, ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తిరిగి ప్రకృతి కోపానికి తానే బలి అవుతున్నాడు. ఈ సమస్త సృష్టిలో జీవవైవిధ్యమే ఒక అందమైన అమరిక. కోట్ల జీవరాశుల్లో ఏ ప్రయోజనం లేనిది ఒక్కటీ ఉండదు. గడ్డిపరక నుంచి గద్ద దాక, తూతువుపిట్ట నుంచి తుమ్మచెట్టుదాకా ఆన్నీ అవసరమైనవి.

Also read: ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రకంపనలు

ప్రతిజీవికీ ఇంకొక జీవితో అనుబంధం

ప్రతిదానికి ఇంకోదానితో సంబంధం ఉంది. ఇవ్వన్నీ కలిసి,ఈ జీవవ్యవస్థ నడుస్తోంది.చెరువుల్లో ఉండే కీటకాలను తిని కప్పలు జీవిస్తాయి. ఆ కప్పలను తిని పాములు జీవిస్తాయి.ఆ పాములను తిని గద్దలు జీవిస్తాయి.గద్దలు చచ్చిపోయిన తర్వాత వాటిని క్రిములు తింటాయి. తిని వూరుకోవు.వాటిని భూమిలో కలిపేస్తాయి.అవి మొక్కలకు ఎరువుగా మారుతాయి. అవి మనిషిని, మనిషితో పాటు మిగిలిన జీవవ్యవస్థలను బతికిస్తాయి. ప్రతి జీవికి, ఇంకొక జీవితో ఇంత అవసరం, ఇంత   అనుబంధం ఉంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం. ఈ జీవవైవిధ్యంలో ఉన్న సత్యాన్ని, అవసరాన్ని,అనుబంధాన్ని మనిషి మెల్లగా మరిచిపోతూ ఈ బంధాలను తెంచేస్తున్నాడు. ఈ కోట్ల జీవరాశుల్లో ఒక్క ప్రాణి నశించినా, దాని ప్రభావం మిగిలినవాటిపై ఉంటుంది. వీటన్నింటిలో మనిషి జోక్యం ఎక్కువై పోతోంది. వీటి వినాశనానికి కారణమవుతున్నాడు. ప్రస్తుతం, ప్రతి ఏటా సుమారు 10,000 జీవరాశులు అంతరించి పోతున్నాయి. ఏ ఒక్క జీవి అంతరించినా, అది మానవ మనుగడకు ప్రశ్నగా మిగులుతోంది. జీవవైవిధ్యాన్ని క్షిద్రం చేస్తున్న సంధియుగంలో మనం ఉన్నాం. వీటన్నింటికీ కారణం మనిషిలో పెరిగిపోతున్న మితిమీరిన స్వార్ధం. లక్షల సంవత్సరాల మనిషి మనుగడలో జీవనశైలి మారుతూ వస్తోంది. అనాగరికత నుంచి నవీన నాగరికత వైపు మనిషి పయనించాడు. ఆకులు అలములు తింటూ, చెట్టు బెరడ్లు కట్టుకొని, రాళ్లు కొట్టుకుంటూ, నిప్పును సృష్టించుకుంటూ జీవించిన దశ నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే  వరకూ ఎదిగాడు. అంతటితో ఆగడం లేదు. అక్కడ కూడా మేడలు, మిద్దెలు కట్టాలనుకుంటున్నాడు. నేలవిడిచి సాముచేస్తున్నాడు.

Also read: రాహుల్ కు భారీ ఊరట

పిన్న వయస్సులోనే వృద్ధాప్యం

ఈ క్రమంలో, ఈ పరిణామంలో ఆధునిక జీవనశైలిలోకి వచ్చాడు. పరిశ్రమలు పేరుతో పర్యావరణ కాలుష్యం సృష్టించుకున్నాడు. దీంతో భూగోళం మొత్తం వేడెక్కిపోయింది. ఋతువులు మారిపోతున్నాయి. జీవవైవిధ్యం మొత్తం దెబ్బతింటోంది.మహాజీవ వైవిధ్యాలున్న ప్రాంతాల్లో భారతదేశం ప్రధానమైన దేశం. సుమారు 45వేల వృక్ష జాతులు, 77వేల జంతుజాతులు ఒకప్పుడు ఉండేవి. వీటిల్లో పదిశాతం పైగా ప్రమాదంలో పడ్డాయి. అడవులు దాదాపు యాభైశాతం అంతరించిపోయాయి. నీటి వనరులు డెబ్భై శాతం కోల్పోయాం. పచ్చికబైళ్ళు రూపుమాసిపోయాయి. వేట పేరుతో వన్యప్రాణులను చంపేస్తున్నాం. సముద్రతీరాలన్నీ అతలాకుతలం అయిపోయాయి. పిచ్చుకలు, కాకులు, రాబందులు, ఖడ్గమృగాల వంటి అరుదైన జాతుల మనుగడ ప్రమాదంలో ఉంది. ఇవ్వన్నీ జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టులు. ఆరోగ్యానికి పునాదుల్లో ఒకటైన ఆహారం కాలుష్య కాసారమయ్యింది.  ప్రకృతివ్యవసాయం నుంచి రసాయానికి వ్యవసాయంలోకి వచ్చాం. ఈ విధానంలో చేస్తున్న ఆహార ఉత్పత్తిలో మనిషికి శక్తి చేరడం లేదు. నిస్సత్తువ, నిస్సారంలోకి వెళ్తున్నాడు. “కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు”,  అని శ్రీశ్రీ అన్నట్లు, చిన్న వయస్సులోనే మనిషి వృద్ధుడవుతున్నాడు. రసాయన మందులతో  ఉత్పత్తి చేసిన ఆహారం తింటూ, అనారోగ్యం పాలై, తాను కూడా మందులతోనే బతుకు సాగిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రకృతికి దూరమై, మందులకు దగ్గరయ్యాడు. మొన్నమొన్నటి వరకూ ప్రకృతిహితుడుగా ఉండే భారతీయుడు కూడా  ప్రకృతిహతుడుగా మారిపోయాడు. జీవవైవిధ్య సంరక్షణ అంశంగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సదస్సులు జరుగుతూనే ఉన్నాయి.

Also read: మూగబోయిన యుద్ధనౌక

వృక్షో రక్షతి రక్షిత

కానీ, ఆచరణలో వేడి పుంజు కోవడం లేదు. పర్యావరణ విధ్వంసం-జీవవైవిధ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్లు చర్చనీయాంశాలుగానే మిగిలిపోతున్నాయి. కాలుష్యం, వాతావరణ మార్పులు, ఆవాసాల నష్టం మొదలైన అంశాలు ఇప్పటికే ముసాయిదా ప్రతిపాదనలో చేర్చారు. మానవజీవన పరిణామ క్రమంలో, ప్రగతి మాటున మహానగరాలు, నగరాలు, పట్టణాలు పూర్తిగా జీవవ్యతిరేక వాతావరణంలోకి వెళ్లిపోయాయి. ఆదివాసులు జీవించే కొండలు, కోనల్లోనే జీవవైవిధ్యం ఇంకా పదిలంగా ఉంది. కనీసం, వాటినైనా పచ్చగా కాపాడుకుందాం. మిగిలిన దేశాలతో పోలిస్తే, భారతీయులు ప్రకృతిని ప్రేమిస్తారు. పూజిస్తారు. ఇంకా, ఇక్కడ జీవవైవిధ్యానికి అనువైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. జీవవైవిధ్య సంరక్షణకు అంతర్జాతీయంగా అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చట్టాలు చేసుకున్నారు. కానీ,అవి ఆశించిన స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.ప్రభుత్వాలు  క్షేత్రస్థాయిలో అమలయ్యే చర్యలు చేపట్టడం అత్యంత ఆవశ్యకం. జీవవైవిధ్యాన్ని మనిషి ఎంత కాపాడుకుంటే? అంత మనుగడ సాగిస్తాడు. లేకపోతే, మిగిలిన జీవుల్లా, వాడూ ఏదో ఒకనాడు అంతరిస్తాడు. అశోకుడు చెట్లు నాటించెను. వృక్షో రక్షతి రక్షితః.. అనే వాక్యాలు కాగితాలకే పరిమితం చెయ్యకుండా,జీవితాలకూ అన్వయించుకుందాం. బతుకుదాం, బతికిద్దాం. కరోనా వార్తలు మళ్ళీ ప్రబలుతున్న వేళ అప్రమత్తంగా ఉందాం.

Also read: నవనవోన్మేష సాహిత్యోత్సవం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles