- ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కొనసాగవచ్చు
- అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పిన ముఖ్యమంత్రి
- ఉపఎన్నికలు జరిగిన 3 స్థానాలుూ టీఎంసీ కైవసం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో ఘనవిజయం సాధించారు. ఇక ఆమె ముఖ్యమంత్రి హోదాలో నిశ్చింతగా కొనసాగవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘనవిజయం సాధించినప్పటికీ ఆమె పోటీ చేసిన నందిగ్రాంలో ఓడిపోయారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు. కేసు కోర్టు పరిశీనలో ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆరు మాసాలలోగా అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కి కానీ ఎన్నిక కావలసి ఉంది. లేని పక్షంలో పదవి నుంచి తప్పుకోవలసి వచ్చేది. కోవిద్ కారణంగా ఉపఎన్నికలు నిర్వహించరేమోనన్న అనుమానాల నడుమ ఎన్నికల సంఘం భబానీపూర్, మరి రెండు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు ప్రకటించింది. మూడు చోట్లా అధికార త్రిణమూల్ కాంగ్రెస్ గెలుపొందడం విశేషం.
దక్షిణ కోల్ కొతా లోని భబానీపూర్ నియోజకవర్గంలో మమతకు 84,709 ఓట్లు వచ్చాయి. బీజేబీ అభ్యర్థి ప్రియాంకా టైబెర్ వాల్ 24,396 ఓట్లు సంపాదించుకున్నారు. అంటే మమతా బెనర్జీ మెజారిటీ 58,832 ఓట్లు. ఇది రికార్డు. ఆమె 2011లో 54,213 ఓట్ల ఆధిక్యంతో గెలిచి నెలకొల్పిన రికార్డును తిరిగి ఆమే అధిగమించారు. ప్రియాంక ఒక న్యాయవాది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఎంటల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2015లో మునిసిపల్ ఎన్నికలలోనూ ఓడిపోయారు. ఇటీవల ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ పైన గళమెత్తి, కోర్టులో కేసులు పెట్టి, వాదించిన కారణంగా ప్రియాంక పేరు తెరపైకి వచ్చింది. భబానీపూర్ స్థానాన్ని మమత 2011, 2016లోనూ గెలుచుకున్నారు. నందిగ్రామ్ లో భూముల విక్రయానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకురాలు కనుక, ఆ పోరాటం కారణంగానే రాష్ట్రంలో అదికారంలోకి రాగలిగారు కనుక నందిగ్రాం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తన పూర్వపు అనుచరుడు సువేందు అధికారి చేతిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. భబానీపూర్ లో నమ్మిన బంటు సోవన్ దేబ్ ఛటోపాధ్యాయను నిలబెట్టారు. ఆయన 28 వేల మెజారిటీతో గెలుపొందారు. మమతా బెనర్జీ కోసం ఆ సీటు ఖాళీ చేశారు.
సాధారణంగా విజయం సాధించిన తర్వాత రెండు వేళ్ళూ చూపించి విజయ సంకేతంగా పరిగణించే మమతా బెనర్జీ ఆదివారంనాడు మూడు వేళ్ళు చూపించారు. ఎందుకంటే పోటీ చేసిన మూడు ఉపఎన్నికలలోనూ టీఎంసీ గెలిచింది కనుక అని చెప్పారు. ‘ఒకటి, రెండు, మూడు…ప్రజలకు ధన్యవాదాలు,’ అని మమత అన్నారు. ఈ నియోజకవర్గంలో ఒక్క వార్డులో కూడా ప్రత్యర్థికంటే తక్కువ ఓట్లు తనకు రాకపోవడం ఆనందంగా ఉన్నదని ఆమె అన్నారు. ‘‘2016లో కూడా రెండు వార్డులలో వెనకబడ్డాను. కానీ ఈ సారి ఒక్క వార్డులో కూడా వెనక పడలేదు,’’ అని సగర్వంగా చెప్పారు.
‘‘ప్రతి మ్యాచ్ లోనూ ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. గెలిచినవారే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నుకోబడాలనే సిద్ధాంతం ఏమీ లేదు. నేనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్,’’ అని ప్రియాంక సరదాగా వ్యాఖ్యానించారు. బీజేపీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సుకనాతా మజుందార్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అభినందించారు. 2019లో 18 లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకున్నప్పటి నుంచీ ముమ్మరంగా ప్రచారం చేసింది. ఒక దశలో బీజేపీ గెలుస్తుందని కూడా పరిశీలకులు భావించారు. కానీ 2011, 2016లో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని తృణమూల్ అధినేత విజయభేరి మోగించారు. కాకపోతే అంతవరకూ ప్రతిపక్షంగా ఉన్న సీపీఎం, కాంగ్రెస్ లు తుడిచిపెట్టుకొని పోయాయి. డెబ్బయ్ కి పైగా సీట్లు సాధించి బీజేపీ బలమైన ప్రతిపక్షంగా రూపొందింది.