• బీజేపీకి సవాలు విసిరిన దీదీ
• ఎన్నికల్లో గెలుపుకోసం మమత వ్యూహరచన
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రస్తుతం మమత భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నందిగ్రామ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సువేందు అధికారి ఇటీవలే బీజేపీ లో చేరారు.
ఇది చదవండి: తృణమూల్ చేజారుతున్న మంత్రులు
2007లో నందిగ్రామ్ సెజ్ ప్రాజెక్టు ఘర్షణల్లో 14 మంది రైతులు మృతిచెందారు. అప్పటివరకు వామపక్షాలకు కంచుకోటగా ఉన్న బెంగాల్లో అధికారం తృణమూల్ చేతికి వచ్చింది. నందగ్రామ్ ఉద్యమాన్ని సువేందు అధికారి ముందుండి నడింపించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తృణమూల్ విజయభేరి మోగించింది. సువేందు కుటుంబానికి నందిగ్రామ్, జంగల్ మహల్ ప్రాంతాల్లో గట్టి పట్టున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సువేందు అధికారి బీజేపీలో చేరడంతో కలగనున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు మమత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నందిగ్రామ్ తో పాటు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి కూడా పోటీచేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇది చదవండి: బెంగాల్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ