- అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత
- 291 మందితో జాబితా విడుదల
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. 294 నియోజకవర్గాలున్న బెంగాల్ అసెంబ్లీకి 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే 291 మంది అభ్యర్ధుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ముందు చెప్పినట్లుగా నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ ను బరిలో దించుతున్నారు. 291 స్థానాలకు ఒకేసారి మమత జాబితాను ప్రకటించారు. పొత్తులో భాగంగా మిగతా మూడు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. రెండు నియోజకవర్గాలనుంచి మమత పోటీచేస్తారంటూ పెద్ద ఎత్తున వినిపించిన ఊహాగానాలకు మమత చెక్ పెట్టారు.
Also Read: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ అమీతుమీ
మహిళలకు భారీగా సీట్లు:
ఎన్నికల్లో 80 ఏళ్లు వయసున్న వారికి టికెట్లు నిరాకరించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 50 మంది మహిళలు ఉన్నారు. 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. బీజేపీ నుంచి ఈ సారి గట్టి పోటీ ఎదురవుతుండటంతో అప్రమత్తమైన మమత అభ్యర్థుల జాబితాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మార్చి 27న తొలివిడత ఎన్నికలు ప్రారంభమై ఏప్రిల్ 29 వరకు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం