మాలపిల్ల చిత్రానికి పనిచేసిన తాపి ధర్మారావు, కాంచనమాల
తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు – 2వ భాగం
చిత్ర నిర్మాణం నాడు నేడు కూడా వ్యాపారం అనడం తప్పు కాదు. నిర్మాతకి పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తేనే మరో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుడతాడు. ఎంతోమంది చిత్ర పరిశ్రమలోని వారికి జీవనాధారం దొరుకుతుంది. అయితే సాగుతున్న చిత్రాల ధోరణికి భిన్నంగా చిత్రాలు తీయాలంటే సొమ్ముతోపాటు దమ్ము, ధైర్యం కూడా ఉండాలి కదా! అలా ఉన్న నిర్మాత, దర్శకులతో తెలుగు చిత్ర పరిశ్రమలో “ప్రగతి భావాల“ చిత్రాలకు అంకురార్పణ జరిగింది. అదీ ఎప్పుడు? దాదాపు 75 సంవత్సరాల క్రితం. మన “తెలుగు చిత్ర పరిశ్రమ“లో ఉన్నవారంతా గర్వపడవలసిన తరుణం అది!
శ్రీ వై.వి. రావు: ఇక ఆ చిత్రాల కథా కమామిషులోకి వెళితే నాడు ప్రసిద్ధ దర్శక, నిర్మాత, నాటి అందాల కథానాయకుడు, శ్రీ వై.వి. రావు నిర్మించిన ‘మళ్ళీపెళ్ళి’ చిత్రాన్ని తప్పకుండా పేర్కొనాలి.
బహుశా తెలుగులో తొలి ‘ప్రగతి భావాల’ చిత్రం “మళ్ళీపెళ్ళి“ అని చెప్పవచ్చు.
అనేక ఆర్థిక, సాంఘిక కారణాల వల్ల ‘బాల వితంతువులు,’ ‘విధవలు’ ఉన్న ఛాందస సమాజంలో వితంతువుల బతుకులు ఒంటి సుఖానికి దూరమై ఇంటి చాకిరికే అంకితమై పోతున్న దుర్మార్గపు వాతావరణం సాగుతున్న కాలంలో
‘మళ్ళీపెళ్ళి’ చిత్రం పెను సంచలనం రేపింది అంటే ఆశ్చర్యం లేదు. ఆ చిత్రం మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను, అర్ధం లేని ఆచార అరాచకాలను ప్రశ్నిస్తూ, విశ్లేషిస్తూ, విమర్శిస్తూ, ప్రేక్షకులలో నూతన భావాలనూ, ఆలోచనలనూ రేకెత్తించింది. ఆచారాల చట్రంలో బిగించి, ఛాందస కట్టుబాట్ల చక్రంలో తిప్పుతూ, అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ప్రవర్తించే ఒక వర్గం వారికి ‘మళ్ళీ పెళ్ళి’ చిత్రం ఒక శరాఘాతంలా తగిలింది. ఆ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆర్ధికంగా అంటే కొంత ఆలోచించవలసిన విషయమే. కానీ తరువాతి రోజులలో ఆ తరహా చిత్రాలు తీయాలనుకునే దర్శక నిర్మాతలకు ‘మళ్ళీపెళ్ళి’ చిత్రం మార్గదర్శకమైంది అనడం వాస్తవం!
Also read: యడవల్లి రచన: తెలుగు సినిమాలలో ప్రగతి కిరణాలు
సాంఘిక చిత్రాలంటే కుటుంబ వాతావరణంతో ముడిపడి ఉండటంతో పాటు పరిసర సమాజ సమస్యల వాతావరణంతో సాగవలసిన పరిస్ధితులు, ఈ ధోరణి చిత్రాల ఇతివృత్తాలలో కనిపిస్తుంది. అప్పట్నుంచి అడపాదడపా కొన్ని అభ్యుదయ భావాల కథలతో చిత్రాలు వస్తున్నప్పటికీ 1938వ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమలోనూ, తెలుగు రాష్ర్టాలలోనూ, అక్షరాలా గొప్ప సంచలనం సంభవించడానికి కారణమైంది.
1938వ సంవత్సరం ఒక మైలురాయి
సాంఘిక చిత్రాల ఇతివృత్తాలను ఓ గొప్ప మలుపు తిప్పి, పెను సంచలనం కలిగించిన ‘మాలపిల్ల’ చిత్రం ఈ సంవత్సరంలోనే విడుదల కావడం ప్రముఖంగా పరిగణించవలసిన విశేషం!
ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, దర్శక నిర్మాత, ఆది నుంచి అభ్యుదయ భావాల పట్ల అనురక్తి, ఆసక్తి ఉన్నవాడు, సమాజ సంస్కరణ గురించి సదా ఆలోచించే శ్రీ గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో విడుదలయిన ‘మాలపిల్ల’ చిత్రం ఆనాటి సమాజంలోని కొన్ని వర్గాల వారిని ఓ కుదుపు కుదిపింది!
ఎందుకు అంటే చిత్రం పేరుకు తగినట్టు ఒక మాలవాడలోని యువతికి, అగ్రవర్ణంగా చెప్పుకునే బ్రాహ్మణ యువకునికి మధ్య ప్రేమ అంకురించడం, ఫలితంగా “వివాహం“ జరగడం, అందువల్ల ఆ పల్లెలోని వారు ముఖ్యంగా అగ్రవర్ణాల వారు ఆగ్రహం చెందడం, తాము నమ్మిన ఆచార వ్యవహారాలు భ్రష్టమయి పోయాయని బాధపడుతూ, రెండు కుటుంబాల వారిని విమర్శలతో తీవ్రంగా బాధించడం ‘మాలపిల్ల’ చిత్ర ఇతివృత్తం.
అప్పటికే రచనలతో తన ప్రత్యేక శైలితో సాహితీ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటచలం వ్రాసిన ‘మాలపిల్లలు’ ఈ ‘మాలపిల్ల’ చిత్రకథ! ఇది చిత్రం కోసం వ్రాసిన రచన కాదు. అయితే అభ్యుదయ భావాలున్న గూడవల్లి రామబ్రహ్మం తన ఆలోచనలకు భావాలకు, తగిన కథ అని నమ్మి చిత్రంగా రూపొందించడం జరిగింది.
ఈ సంచలన చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విశేషం ఉంది. మతమౌఢ్యం మీద, దురాచారాల మీద తీవ్రమైన తిరస్కృతి కలిగిన ప్రముఖ కవి, కథకుడు, చిత్ర కథా గేయ రచయిత, పత్రికా సంపాదకుడు అయిన తాపీ ధర్మారావు ఈ ‘మాలపిల్ల’ చిత్రానికి రచన చేయడం విశేషం! అప్పటికే ఆయనకు సాహితీ లోకంలో ప్రగతి భావాలు కలిగిన రచయితగా పేరు ప్రఖ్యాతులున్నాయి. ‘మాలపిల్ల’ చిత్రం ఇతివృత్తం వివాదాస్పదమైనది. ఆ చిత్ర కథా రచయిత అత్యంత విమర్శలకు గురి అయిన ‘చలం’. ఇక చిత్ర సంభాషణలు, గీతాలు వ్రాసిన ‘తాతాజీ’ (తాపీ ధర్మారావు) మరో అభ్యుదయ రచయిత! దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆ భావాలను ఆదర్శంగా తీసుకునే వ్యక్తి. వీరందరి కలయికతో రూపొందిన ‘మాలపిల్ల’ అక్షరాలా ఆనాటి ఆంధ్రదేశంలో సంచలనం సృష్టించింది.
ఈ చిత్రాన్ని అగ్రవర్ణాల వారు విడుదల కాకుండా ఉండడానికి ప్రదర్శనలు జరగకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫల ప్రయత్నాలయి ‘మాలపిల్ల’ సంచలన విజయం సాధించింది.
అలా తెలుగు చిత్రాలలో ‘మాలపిల్ల’ చిత్రం ప్రగతి భావాలు నిండిన చిత్రంగా నిలిచిపోయింది. అందుకు కారణం దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం సాహసం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
రైతుబిడ్డ జైత్రయాత్ర
ప్రగతి భావజాలంతో నిర్మించిన ‘మాలపిల్ల’ చిత్ర విజయం తరువాత గూడవల్లి రామబ్రహ్మం ఆ విజయ పంథాను కొనసాగిస్తూ మరో అభ్యుదయ భావాలున్న చిత్రం ‘రైతుబిడ్డ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి ముఖ్యంగా ప్రగతి భావాల ఇతివృత్తం మూలంగా కలిగిన ‘రైతుబిడ్డ’ గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి.
భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో రైతు సమస్యల మీద, జమిందారీ ఫ్యూడల్ విధానాల కథా కథనాలతో నిర్మించిన తొలి చిత్రం ‘రైతుబిడ్డ’ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.
ఆనాటి సమాజంలో రైతులకు, భూస్వాములకు (జమిందారులు) నిత్య ఘర్షణగా ఉండేది. ఆరుగాలం కష్టపడే రైతుకు, కడుపు నిండటమే అరుదుగా ఉండేది. భూస్వాముల, పెత్తందారీ విధానాలకు, ఎదురు తిరిగి నిలిచే సాహసం చేసేవారే కరువైన వాతావరణంలో రైతులు సంఘటిత శక్తిగా మారితేనే వాళ్ల బతుకులు బాగుపడతాయన్న నమ్మకం, విశ్వాసాన్ని కలగజేసిన రైతు సమస్యల కథా చిత్రం ‘రైతుబిడ్డ’!
భూస్వాములను ఎండగట్టే చిత్రానికి నిర్మాత జమీందారు
ఈ చిత్రానికి నిర్మాత నాటి చల్లపల్లి జమిందారు కావడం విశేషం. ‘రైతుబిడ్డ‘ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే ఆ చిత్రం మీద విమర్శలు వచ్చాయి. చిత్రం విడుదల కాకుండా నిరోధించటానికి కొందరు పెద్ద భూస్వాములు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
అయినా అన్ని అవాంతరాల మధ్య ‘రైతుబిడ్డ’ చిత్రం విడుదలైంది. కానీ భూస్వాముల ప్రయత్నాలు ఫలించి కొన్నిచోట్ల చిత్ర ప్రదర్శనలు రద్దు అయ్యాయి. అయినా ‘రైతుబిడ్డ’ చిత్రం నాటి చిత్ర పరిశ్రమలో ఆ రకంగా సంచలనం సృష్టించింది.
గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో వచ్చిన ‘మాలపిల్ల,’ ‘రైతుబిడ్డ’ చిత్రాలు ఆ రకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రగతి భావాలు నిండిన చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.
ఇక ఆ తరువాత ఆరకమైన ప్రగతి భావాల ఇతివృత్తాలతో ఎన్నో చిత్రాలు రావడానికి, పైన చెప్పిన రెండు చిత్రాలు మార్గదర్శకాలయ్యాయి అని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.
‘రైతుబిడ్డ’ చిత్రంలోని గీతాలన్నీ రైతు సమస్యలను ప్రతిబింబించే ప్రభోదాత్మక గీతాలు కావడం విశేషం. ఆ గీతాలను నాటి ప్రసిద్ధ అభ్యుదయ కవులు తుమ్మల సీతారామమూర్తి చౌదరి, నెల్లూరు వెంకట్రామానాయుడు, కొసరాజు రాఘవయ్య చౌదరి, తాపీ ధర్మారావు వ్రాయడం జరిగింది!
ఇక ప్రముఖ రంగస్ధల నటుడు, అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్న బళ్ళారి రాఘవ, ప్రముఖ గాయని, నటి, కుమారి టంగుటూరి సూర్యకుమారి వంటి ప్రసిద్ధులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు ధరించటం విశేషంగా పేర్కొనాలి!
రైతు సమస్యల మీద నిర్మించి ‘రైతుబిడ్డ’ చిత్రంలోని గీతాలు ఆనాడు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ‘సైసైరా చిన్నపరెడ్డి నీ పేరే బంగారుకడ్డి’ గీతం ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది!
ఆ తరువాత భారతదేశ కర్షకుల సమస్యలను ప్రతిబింబిస్తూ వచ్చిన ‘మదర్ ఇండియా’ చిత్రం కూడా ఎంతగానో ప్రేక్షకాదరణ పొంది ఘన విజయం సాధించడం, ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఈ హిందీ చిత్రం ‘ఆస్కార్ నామినేషన్’ కి ఎన్నిక కావడం మరో విశేషం!
Also read: యడవల్లి రచన: తెలుగు సినిమాలలో ప్రగతి కిరణాలు
(మిగతా వచ్చే వారం)
After the release of Gudavalli Ramabrahmam’s MALA PILLA in 1938 and his film RAITHU BIDDA in 1939 and in the end of 1939 only YVRao’d MALLEE PELLI is released!